సీమాంధ్ర నేతల వైఖరితో మరింత కాక | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర నేతల వైఖరితో మరింత కాక

Published Sat, Oct 5 2013 10:40 PM

సీమాంధ్ర నేతల వైఖరితో మరింత కాక

సమైక్యంధ్రాలో ఇంత తీవ్రంగా ఉద్యమ జ్వాలలు రగులుకుంటుంటే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు తమకేది కాదన్నట్టు కూర్చోవడం పట్ల సమైక్యవాదులు ఆగ్రహంతో మండిపోతున్నారు. కొంతమంది రాజీనామాలతో సమైక్యానికి ఓటేసినా..మెజారిటీ ప్రజాప్రతినిధులు తలో మాట మాట్లాడుతుంటంతో ప్రజలు తీవ్ర అసంహనంతో ఉన్నారు. ఈ క్రమంలో భాగంగానే సీమాంధ్ర నేతల ఇళ్లపై దాడికి దిగుతూ తమ నిరసనను ముమ్మరం చేశారు. రాష్ట్రం ముక్కలవుతున్నా మంత్రి బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి ఎంపీ ఝాన్సీ రాజీనామాలు చేయకపోవడంపై విజయనగరం వాసులు పలుమార్లు ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. ఈ సందర్భం గా పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట జరిగింది.

 

పలువురు ఆందోళనకారులు పట్టణంలోని బొత్సకు చెందిన సత్య కళాశాలపై రాళ్లతో దాడిచేశారు. దీంతో పోలీసుల రంగ ప్రవేశంతో సమైక్య ఉద్యమం మరింత రాజుకుంది.  పట్టణంలోని మినర్వా థియేటర్‌లో పార్కింగ్ చేసి ఉన్న ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలకు చెందిన వాహనాలతో సహా మొత్తం ఆరు పోలీసు వాహనాల అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే, బొత్సకు చెందిన సత్యకేబుల్ చానల్ కార్యాలయాన్ని, ఆయన బినామీలతో భాగస్వామ్యం ఉన్న మద్యం దుకాణాలనూ ధ్వంసం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గం గరివిడిలో  బొత్స క్యాంపు కార్యాలయంపై సమైక్యవాదులు రాళ్ల వర్షం కురిపించారు. సాలూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి నిప్పుపెట్టగా.. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఉన్న కాంగ్రెస్ దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేసి, టెంట్‌ను తగులబెట్టారు.

 

ఇదిలా ఉండగా మరోమంత్రి పనబాక లక్ష్మి మాత్రం తన స్వరాన్ని కాస్త పెంచి విభజన తన ఓటని తేల్చాశారు. తెలంగాణ ఏర్పాటుపై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో తీవ్ర ఉద్రిక్తత, బంద్ కొనసాగుతుండగా అదే ప్రాంతానికి చెందిన మంత్రి పనబాక విభజనకు అనుకూలంగా మాట్లాడటం గమనార్హం. తాను విభజన వాదినేనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన ప్యాకేజీ తీసుకుంటే పోయేదానికి ఇంత రగడ ఎందుకని ఒక్కముక్కలో చెప్పేశారు.  కాగా, మంత్రి పల్లంరాజు  రాజీనామా చే్స్తానని తొలుత కాంగ్రెస్ అధీష్టానానికి హెచ్చరికలు పంపినా..సోనియా భేటీ అనంతరం వెనక్కు తగ్గారు. సీమాంధ్ర నేతలు ఇలా తలో మాట..తలో దారి చూసుకుంటున్నా విభజన నిర్ణయం మాత్రం వారి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
 
 


 

Advertisement
Advertisement