ఇరానీ కీ కహానీ | Sakshi
Sakshi News home page

ఇరానీ కీ కహానీ

Published Sun, Jul 10 2016 1:23 AM

ఇరానీ కీ కహానీ - Sakshi

సానుకూలమైన అంశాలన్నిటినీ పూర్వపక్షం చేసే మితిమీరిన ఆత్మ విశ్వాసం. అది అహంకారంగా పెచ్చరిల్లిన సందర్భాలు ఆమెకు హాని చేశాయి. శాఖ మార్పుతో స్మృతి ఇరానీ పని అయిపోయినట్టేనని భావించడానికి వీలు లేదు. ఆమెకు మంత్రిమండలి నుంచి ఉద్వాసన చెప్పాలని ప్రధాని సంకల్పిస్తే అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఆయన ఆ పని చేయ లేదు. అంటే, అంతటి అసంతృప్తి కానీ ఆగ్రహం కానీ లేదని అనుకోవాలి.
 
 ‘ఈ దేశంలో మహిళలకు అన్యాయం నిరంతరం జరుగుతూనే ఉంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్-హెచ్ ఆర్‌డీ) మంత్రి స్మృతి ఇరానీ చేతిలోని పుస్తకం లాగివేసి చీర కట్టించి (జవుళి శాఖ అప్పగించి) కూర్చోబెట్టారు’. కేంద్ర మంత్రివర్గ విస్తరణ, శాఖల పునర్విభజన అనంతరం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉన్న వ్యాఖ్య ఇది. సోషల్ మీడియాలో ఇరానీపై వచ్చిన సంచలనం ఆమె ప్రాముఖ్యాన్ని చాటుతోంది.
 
 ‘స్మృతి ఇరానీ నా సోదరి’ అని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ రాజకీయ క్షేత్రమైన అమేథీ నియోజకవర్గంలో ఒక సభలో ప్రకటించారు. ఎన్నికలలో ఘనవిజయం సాధిం చిన తర్వాత సోదరిని అందలం ఎక్కించారు. మంత్రి పదవి నిర్వహించడం మొదటిసారే అయినా సరాసరి కేబినెట్ హోదా కట్టబెట్టారు.  పీవీ నరసింహా రావు, మురళీమనోహర్ జోషీ,  అర్జున్‌సింగ్ వంటి హేమాహేమీలు నిర్వహిం చిన బరువైన హెచ్‌ఆర్‌డీ శాఖను అనుభవం లేని ఆడపడుచు చేతిలో పెట్టారు. ఇరానీ కంటే విద్యాధికురాలైన నిర్మలాసీతారామన్‌కి సహామయంత్రి హోదానే ఇచ్చారు. ఆమెకు కానీ, సమర్థంగా పని చేసే మరో మంత్రి పీయూష్ గోయెల్‌కు కానీ కేబినెట్ హోదా దక్కలేదు. జవదేకర్‌ని మాత్రమే అదృష్టం వరించింది.
 
పాతిక మాసాలే...
‘క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ’ (ఎందుకంటే, అత్తా ఒకప్పటి కోడలే) సీరియల్‌లో బహూ పాత్రలో (తులసీ విరానీ) జీవించి ‘బహుత్ ఖూబ్’ అని పించుకున్న స్మృతి ఇరానీ ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదిం చారు. బెంగాలీ తల్లి  ప్రసాదించిన వాగ్ధాటి, పంజాబీ తండ్రి నుంచి వచ్చిన చొరవ, దూకుడు ఆమెను చిన్న వయస్సులోనే పెద్ద రాజకీయ పాత్రకు సిద్ధం చేశాయి. భర్త పార్శీ. ఆమె నేపథ్యంలో, స్వభావంలో లౌకికతత్వం బలంగానే ఉంది. రాజకీయంలో మాత్రం బీజేపీ మార్కు లౌకికవాదం ఆవహించిన వ్యక్తిత్వం.
 రాజకీయ క్షేత్రంలో ప్రవేశించిన అనంతరం అహరహం శ్రమించి సంఘ్‌పరివార్‌నీ, నరేంద్రమోదీని మెప్పించి అమాంతంగా శిఖరాగ్రం చేరుకున్న స్మృతి ఇరానీ అక్కడ పాతిక మాసాలకంటే ఎక్కువ నిలువలేకపోయారు. ఎందుకని? రాజకీయాలలో ప్రవేశించిన కొద్ది సంవత్సరాలకే అధికారంలోకి వచ్చినవారు చేసే పొరబాటే ఆమె కూడా చేశారు.
 
 మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు రాజకీయ జీవితంలో ఈ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన రెండు విషయాలలో దూకుడుగా పోయారు. ఒకటి, ముల్కీ నిబంధనలు చెల్లుతాయంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు ’ద హైయస్ట్ కోర్టు హేజ్  పుట్ ద ఫైనల్ సీల్’ అంటూ వ్యాఖ్యానించారు. అది అత్యున్నత న్యాయస్థానం చేసిన నిర్ణయం కనుక అందరూ దానికి కట్టుబడి ఉండాలనే భావనతో ఆ విధంగా స్పందించారు. భూసంస్కరణలు అమలు చేయాలన్నది ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలోని ప్రభుత్వ నిర్ణయం.
 
 ఇందిరాగాంధీ భూసంస్కరణలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు కనుక వాటిని త్రికరణశుద్ధిగా అమలు చేయాలని సంకల్పించారు. ఈ విధానాలకు అడ్డుతగి లినవారిని డొక్కచించి డోలుకడతానంటూ వాగాడంబరం ప్రదర్శించారనీ, అదే ఆయనకు అపకారం చేసిందనీ ఇటీవల విడుదలైన పీవీ జీవిత చరిత్ర (వినయ్ సీతాపతి రచన) ‘హాఫ్ లయన్...’ గుర్తు చేసింది. ఇందిరాగాంధీకి ఇష్టమైన కార్యక్రమం అమలు చేస్తున్నాము కదా, ఆమె మద్దతు ఉన్నది కదా అన్న ధీమాతో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అజాగ్రత్తగా, బాధ్యతారహితంగా మాటలు తూలి సమస్యలు కొనితెచ్చుకున్నారు.
 
 ప్రత్యేకాంధ్ర ఉద్యమం ఫలి తంగా ఇందిరాగాంధీనే  పీవీ చేత  రాజీనామా చేయించారు.   పదవీచ్యుతి అనం తరం ఆత్మపరిశీలన చేసుకొని తన తప్పిదాన్ని గ్రహించిన పీవీ గుణపాఠాలు నేర్చుకొని ప్రధానిగా అత్యంత సంయమనంతో, వ్యూహాత్మకంగా వ్యవహరిం చారు. అతి తక్కువ అధికారంతో, అతి తక్కువ మాట్లాడుతూ, అత్యంత ప్రభావ శీలమైన ఆర్థిక సంస్కరణలు అమలు చేయగలిగారు. నెహ్రూ వేసిన బాటలోనే నడుస్తున్నామంటూ, రాజీవ్ స్వప్నం సాకారం చేయడమే తన ఉద్దేశమంటూ ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. చైనాలో మావోను స్మరిస్తూనే డెంగ్ 1978లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన తరహాలోనే పీవీ ఇండియాలో 1991లో చేశారు.
 
నాటకీయతకే ప్రాధాన్యం
అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ వేము లపై పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు స్మృతి ఇరానీ అద్భుతంగా, నాటకీ యంగా, బలంగా వాదించారు. ‘రాజకీయం కోసం ఆ పిల్లవాణ్ణి చంపేశారు (The child was allowed to die)’ అంటూ ప్రతిపక్షాలపైన ఆరోపణాస్త్రాలు సంధించారు. రోహిత్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని తెలిసిన వెంటనే వైద్య సహాయంకోసం ప్రయత్నించామనీ, వైద్యుడు వచ్చేసరికే అతడు మరణించా డనీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అధికారులు స్పష్టం చేశారు.  ఇరానీ ప్రసంగంలో అర్ధసత్యాలు ఉన్నాయి. ఆమె ప్రసంగం పూర్తి కాగానే ప్రధాని ‘సత్యమేవ జయతే’ అంటూ కితాబు ఇచ్చారు. ఇది ఆమెకు కొండంత బలం ఇచ్చి ఉంటుంది. అంతకు క్రితం గోవా షాపింగ్ మాల్  ఉదంతం కారణంగా పార్టీ జాతీయ కార్యవర్గంలో సభ్యత్వం కోల్పోయిన విషయం ఆమె విస్మరించారు.
 
 పార్లమెంటు ప్రసంగం తర్వాత ప్రధాని మద్దతు తనకు పరిపూర్ణంగా ఉన్నదనే విశ్వాసంతో, తన వ్యవహార శైలికి ప్రధాని ఆమోదం ఉన్నదనే నమ్మ కంతో ఆమె దూకుడు పెంచారు. జాతీయ వేద విద్యా మండలి (నేషనల్ ఎడ్యు కేషన్ బోర్డ్)ని నెలకొల్పాలన్న బాబా రామ్‌దేవ్ ప్రతిపాదనకు మోదీ, షాల మద్దతు ఉన్నదని తెలిసి కూడా ఇరానీ ఆమోదించలేదు. దేశంలో ఇరవై ప్రతి ష్ఠాత్మకమైన విద్యాసంస్థలను నెలకొల్పాలన్నది మోదీ స్వప్నం. ఆ దిశలో అడుగు ముందుకు పడలేదు. 2015 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బిల్లు విషయంలో ఇరానీతో మోదీ ఏకీభవించలేదు.
 
 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో వైఫై సౌకర్యం కల్పించాలన్న ప్రధాని ఆలోచన అమలుకు నోచుకోలేదు. నూతన విద్యా విధానం రూపొందించిన కమిటీ అధ్యక్షుడు, మాజీ కేబినెట్ సెక్రటరీ టీఆర్‌ఎస్ సుబ్రహ్మణ్యంతోనూ ఇరానీకి తగాదా. నివేదికను విడుదల చేయా లన్న మాజీ ఉన్నతాధికారి కోర్కెను ఆమె మన్నించలేదు. సుబ్రహ్మణ్యం మోదీ అభిమాని. ఏదో ఒక సందర్భంలో ఇరానీపై తన అభిప్రాయాన్ని మోదీకి తెలిపే ఉంటారు. రోహిత్ వేముల వ్యవహారంలో ఇరానీ వైఖరి కారణంగా దళితులు బీజేపీకి దూరమైనారనే అభిప్రాయం పార్టీలో బలంగా ఉంది. అందుకేనేమో మంత్రిమండలి విస్తరణలో కొత్తగా తీసుకున్న 19 మందిలో అయిదుగురు దళితులే.
 
 ఇరానీకి అభిమానులు లేకపోలేదు. ఆర్‌ఎస్‌ఎస్ సంయుక్త కార్యదర్శి కృష్ణ గోపాల్ ఇరానీకి సన్నిహితుడు.  విద్య అందరికీ అందుబాటులో ఉండాలంటూ కొన్ని మాసాల కిందట ప్రతినిధి సభలో ఆర్‌ఎస్‌ఎస్ తీర్మానించింది. ఈ తీర్మానం అమలు దిశగా ఇరానీ చర్యలు తీసుకోకపోవడంతో సంఘ్ అధినాయ కులు ఆమెను నాగపూర్ పిలిపించి మరీ మందలించారు. అయినా ఆమె వైఖరి మారలేదు. ఈ పరిస్థితులలో సంఘ్ నాయకత్వం ఆగ్రహం నుంచి ఇరానీని రక్షించే అవకాశం కృష్ణ గోపాల్‌కి లేదు. అటు సంఘ్ నాయకత్వానికీ, ఇటు ప్రధానికీ, పార్టీ అధ్యక్షుడికీ ఆగ్రహం, అసంతృప్తి కలిగించిన కారణంగా ఇరానీని హెచ్‌ఆర్‌డీ శాఖ నుంచి జవుళి శాఖకు బదిలీ చేయవలసి వచ్చింది.
 
 ట్వీటర్‌ను ఆయుధంగా వినియోగించి ఎవరి మీద పడితే వారిపైన దాడి చేయడం, కటువైన పదజాలం ప్రయోగించడం, మౌనంగా ఉండవలసిన సంద ర్భంలో కూడా నోటికి పని చెప్పడం ద్వారా ఆమె ఒక సువర్ణావకాశాన్ని జార విడుచుకున్నారు. ఇరానీ ధాటికి తట్టుకోలేక బొంబాయ్ ఐఐటీ డెరైక్టర్ అనిల్ కాకోద్కర్ పదవి నుంచి వైదొలిగారు.  ఢిల్లీ ఐఐటీ డెరైక్టర్ ఆర్‌కె శేవ్గాంకర్ అదే బాట పట్టారు.
 
 విశ్వభారతి విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ సుశాంత్ దత్త గుప్తానూ, పుదుచ్ఛేరి విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ చంద్ర కృష్ణమూర్తినీ హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ బర్తరఫ్ చేసింది. హెచ్‌ఆర్‌డీ శాఖ వైస్‌చాన్సలర్లను బర్తరఫ్ చేయడం మునుపెన్నడూ లేదు. ఇరానీని కలుసుకోవాలంటే వైస్ చాన్సలర్లు భయపడేవారు. వీరందరి తరఫునా సుప్రసిద్ధ చరిత్రకారుడు రామ చంద్రగుహ ఇరానీని ‘అజ్ఞానం, అహంకారం కలగలిసిన వ్యక్తి (she is a deadly combination of ignorance and arrogance)’ అంటూ అభిశం సించారు. మన దేశంలో ఒక  కేంద్ర మంత్రిని  ఒక ప్రఖ్యాత రచయిత ఈ విధంగా అభివర్ణించడం అరుదు.
 
శక్తిమంతమైన నాయకురాలు
వర్తమాన రాజకీయాలలో స్మృతి ఇరానీ విశేషమైన నాయకురాలు. మంచి సమ యస్ఫూర్తి. ప్రజలకు పరిచయమైన ముఖం. అసాధారణమైన వాగ్ధాటి. ఎవరి నైనా ఎదిరించే సాహసం. పార్టీకి విధేయంగా శ్రమించే క్రమశిక్షణ. రాజీలేని పోరాటం చేయగల పటిమ. సానుకూలమైన ఈ అంశాలన్నిటినీ పూర్వపక్షం చేసే మితిమీరిన ఆత్మవిశ్వాసం. అది అహంకారంగా పెచ్చరిల్లిన సందర్భాలు ఆమెకు హాని చేశాయి. శాఖ మార్పుతో స్మృతి ఇరానీ పని అయిపోయినట్టేనని భావించడానికి వీలు లేదు. ఆమెకు మంత్రిమండలి నుంచి ఉద్వాసన చెప్పాలని ప్రధాని సంకల్పిస్తే అడ్డు చెప్పేవారు ఎవ్వరూ లేరు. ఆయన ఆ పని చేయలేదు. అంటే, అంతటి అసంతృప్తి కానీ ఆగ్రహం కానీ లేదని అనుకోవాలి. ఇరానీ ప్రతిభాపాటవాలను రేపు ఉత్తర ప్రదేశ్ (యూపీ) అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వినియోగించుకునే అవకాశం ఉన్నదని అభిజ్ఞ వర్గాల అభిప్రాయం.
 
 కాంగ్రెస్ తరఫున ప్రియాంక, బీఎస్‌పీ పక్షాన మాయావతి, బీజేపీ సారథిగా ఇరానీ యూపీ అంతటా ప్రచారం చేస్తే మొట్టమొదటి సారి యూపీ  ఎన్నికల క్షేత్రంలో మహిళల ఆధిక్యం కొట్టవచ్చినట్టు  కనిపిస్తుంది. ఇరానీకి యూపీలో ప్రమేయం ఉంటుందా, లేదా అన్నది అమిత్ షా వైఖరిపైన ఆధారపడి ఉంటుంది.

యూపీ సంగతి ఏమైనా ఇరానీ రాజకీయ జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. చిన్న వయస్సులోనే జాతీయ స్థాయి నాయకురాలుగా గుర్తింపు పొందిన ఆమెకు ఉత్తరోత్తరా కొత్త అవకాశాలు లభిస్తాయి.  చేదు అనుభవం నుంచి గుణపాఠాలు నేర్చుకొని తెలివిగా, జాగ్రత్తగా మసలుకుంటే కొత్త శిఖరాలు అధిరోహించ వచ్చు. ప్రచారార్భాటం లేకుండా, గొడవలు పడకుండా, మాట అనకుండా, మాట పడకుండా,  తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థంగా ఎట్లా నిర్వహిం చాలో నిర్మలా సీతారామన్‌ను చూసి నేర్చుకుంటే ఇరానీ భవిష్యత్తుకు ఢోకా ఉండదు.  మహిళ కాబట్టి ఇరానీకి అన్యాయం జరిగిందనే వాదనలో అర్థం లేదు. అంతా స్వయంకృతమే.
 - కె.రామచంద్రమూర్తి
సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్

 

Advertisement
Advertisement