దళిత ఉద్యమ శిఖరం తారకం | Sakshi
Sakshi News home page

దళిత ఉద్యమ శిఖరం తారకం

Published Sun, Sep 18 2016 1:02 AM

దళిత ఉద్యమ శిఖరం తారకం - Sakshi

దళిత ఉద్యమ సముత్తేజం, అలుపెరుగని పౌరహక్కుల ఉద్యమ సేనాని, రచయిత, మేధావి, దళిత రాజకీయవేత్త, తెలుగునేల మీద ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన బొజ్జా తారకం (జూన్ 27, 1939-సెప్టెంబర్ 16, 2016) నిర్యాణం దళితులకే కాదు, మానవ హక్కుల ఉద్యమానికే తీరని లోటు. ఈ ఐదు దశా బ్దాల్లో తెలుగునేలలో ఆవిర్భవించిన మేధావుల్లో తారకం ఒకరు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కంది కుప్పలో బొజ్జా మావులమ్మ, అప్పలస్వామి దంపతులకు ఆయన జన్మించారు. అప్పల స్వామి కూడా దళిత రాజకీయ ఉద్యమకారుడే. శ్రీమతి తారకం బొజ్జా విజయభారతి ప్రఖ్యాత కవి బోయి భీమన్న కుమార్తె. ప్రముఖ రచయిత్రి.
 
తారకం గొప్ప మనిషి. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అనర్గళమైన పాండిత్యం ఆయనది. అంబేడ్కర్ రచనలో 1, 4 భాగాల తెలుగు అనువాదానికి సంపాదకత్వం వహించారు. బాబాసాహెబ్ జీవితంలో కీలక ఘట్టాల్ని అనువదించారు. ఆయనకు తెలుగు సాహిత్యం మీద కూడా సాధికారత ఉంది. విరసంలో ఆయన ఉన్న ప్పుడు హిందూ సామ్రాజ్యవా దాన్ని ప్రశ్నించే గ్రంథాలు తీసుకురావాలని వాదించారు. రాజ్యాంగం మీద ఆయనకున్న సాధికారత అసమాన్యమైంది. ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’, ‘కులం వర్గం’, ‘నేల- నాగలి- మూడెద్దులు’, ‘పంచతంత్రం’ వంటి రచనలతో  బహు ముఖీనమైన కృషి చేశారు.
 
మా ఇద్దరిది నలభై ఏళ్ల బంధం. కారంచేడు దురంతంలో నాతోపాటు ఉద్యమ నిర్మాణంలో పాలుపంచుకుని, దళితులకు స్ఫూర్తి దాత అయ్యాడు. ఆ ఉద్యమంలో సీబీసీఐడీ జ్యుడీ షియల్ ఎంక్వైరీలోకి ప్రధాన ముద్దాయి దగ్గుబాటి చెంచురామయ్య రానప్పుడు ప్రైవేట్ కేసు వేసి ఆయ నను చీరాల కోర్టుకు నడిపించారు. ఉద్యమంలో భాగంగా నేను విశాఖ జైలులో ఉంటే, మా అమ్మ, నా భార్య స్వర్ణకుమారితో కలసి ఎన్.టి. రామారావు ఇల్లు చుట్టుముట్టి పోరాటం చేసి నన్ను విడిపించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను రూపొందించే క్రమంలో వందలాది సభల్లో మేమిద్దరం కలసి మాట్లాడాము. 1985 నుంచి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభకు ఆయన అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిని. దళిత మహాసభ నిర్వహించిన అనేక సభల్లో రాజ్యాంగ హక్కుల గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో వివ రించేవారు. అంబేడ్కర్ బోధనలను కూడా సరళమైన భాషలో ఆవిష్కరించేవారు.
 
కారంచేడు నుండి దళిత అనే శబ్దాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యతా శబ్దంగా తీసు కెళ్లటమేకాక ప్రత్యామ్నాయ తత్వవేత్తలైన బుద్ధుడు, మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరి యార్ రామస్వామినాయకర్ ఆలోచనలను ఆంధ్రదేశంలో ముందుకు తీసుకువెళ్లారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత నాయకులందరినీ మేము ఏకం చేశాం. రామ్‌దాస్ అటాలే (ముంబై), జోగేందర్ కవాడే (నాగ్‌పూర్), దళిత్ ఏలుమలై (తమిళనాడు), సి.ఆర్.దాస్ (కేరళ, కొట్టాయం), భగవాన్‌దాస్ (ఢిల్లీ), ప్రకాశ్ అంబేడ్కర్ (ముంబై) వంటి దళిత మేధావులను, నాయకులను ఆహ్వానించి దళిత స్ఫూర్తిని జాతీయస్థాయికి తీసుకెళ్లడానికి నాతో కలసి తారకం ఎంతో శ్రమించారు. ఆంధ్రదేశంలో దళితులపై జరిగిన దాడుల ఘటనల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం తీసుకువెళ్లడంలో ఆయనది అద్వితీయమైన పాత్ర. నిజామాబాద్ జిల్లాలో అంబేడ్కర్ యువజన సంఘాన్ని నిర్మించి, తెలంగాణ  దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు.
 
హిందూ సామ్రాజ్యవాదానికి ఎదురు తిరగకుండా కమ్యూనిస్టులు ఏమీ సాధించ లేరని దళిత ఉద్యమం తెలియచెప్పగలిగింది. మార్క్సిస్ట్, లెనినిస్టులు, మావోయిస్టులు, మార్క్సిస్ట్ సాంప్రదాయవాదులు దళిత ఉద్యమం బ్రాహ్మణవాదానికి నిజమైన ప్రత్యా మ్నాయం అని తెలుసుకోలేని సందర్భంలో దళిత ఉద్యమం తారకంగారి రచనల ద్వారా, నా రచనల ద్వారా ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక, సాహిత్య వ్యవస్థని నిర్మించింది. దళిత ఉద్యమ స్ఫూర్తి నుంచే ఎం.ఎల్. పార్టీలో ఉన్న కె.జి.సత్యమూర్తి (శివసాగర్), కంచె ఐలయ్య, ఉ.సాంబశివరావు వంటి మేధావులు దళిత ఉద్యమ సిద్ధాంత కర్తృత్వంలోకి వచ్చారు. 1989లో తారకంగారు, మేము ఆంధ్రదేశానికి బిఎస్పీపీని ఆహ్వానించి బహు జన రాజకీయ ఉద్యమాన్ని విస్తృతం చేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆర్.పి.ఐ. రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు.
 
తారకంగారికి భారతదేశ వైరుధ్యాల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన లేని లోటును వారసులు తీర్చగలగాలి. దళిత బహుజన మైనార్టీలను, అగ్రకులాల్లో ఉన్న పేదల్ని, మార్క్సిస్ట్‌ల్లో వున్న కుల నిర్మూలనావాదుల్ని, మావోయిస్టుల్లో వున్న అంబే డ్కర్‌వాదులను సమన్వయించి ఒక ఉన్నత రాజకీయ ఉద్యమాన్ని నిర్మించి ఇప్పుడున్న హిందూ సామ్రాజ్యవాద అగ్రకుల రాజ్యాధికారానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధ భారతాన్ని రూపొందించటమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి. దళితుల రాజ్యాధికారమే ఆయన అంతిమ లక్ష్యం. తారకం- భారత సామాజిక, రాజకీయ వినీలాకాశంలో ఓ నీలిపతాక.
 

 డా. కత్తి పద్మారావు
 వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి,
 ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ  మొబైల్ : 9849741695

Advertisement

తప్పక చదవండి

Advertisement