తరమెళ్లిపోయింది | Sakshi
Sakshi News home page

తరమెళ్లిపోయింది

Published Sat, Aug 23 2014 12:23 AM

తరమెళ్లిపోయింది - Sakshi

గాంధీజీ హత్య జరిగినప్పుడు దేశమంతా కుప్పకూలి ఏడుస్తోంది. కాని చాలా నగరాల్లో పట్టణాల్లో కొన్ని గుంపులు లడ్డూలు పంచుకుని పండగ చేసుకున్నాయి. అలాంటి పట్నాల్లో విజయవాడ ఒకటి. అప్పుడో యువ హీరో పాతికమందినేసుకుని కర్రసాము చేస్తూ లడ్డూల్నీ మనుషుల్నీ చచ్చేట్టు కొట్టి కకావికలై పరుగులు పెట్టేట్టు చేశాడనీ పేరు చండ్ర రాజేశ్వరరావనీ చిన్నప్పుడు విన్నప్పుడు ఎవరీ రాబిన్‌హుడ్ బతుకులో ఎప్పుడేనా ఎక్కడేనా చూడగలమా అనిపించేది. తర్వాత సభల్లో ప్రదర్శనల్లో ఈ ఆరున్నర అడుగుల బుల్లెట్టూ కమ్ రాకెట్టుని దూరంగా ఆరాధనతో చూశాం.
 
 1970 నుంచి మూడు దశాబ్దాలు ఆయన చంకలో బిడ్డల్లా తిరిగాం. ఆయన అచ్చు రైతులా విరగబడి అమాయకంగా నవ్వడం, తీక్షణమైన చూపుల్తో ఆగ్రహించడం, పార్టీకి కష్టమొచ్చినపుడు గ్రేట్‌వాల్‌లా చేతులు చాచి అడ్డం పడటం అన్నిటికీ సాక్షులం. ఆయన శతజయంతి ఉత్సవాల సందర్భంగా జీవిత కథ వచ్చింది. ఆయన స్వగ్రామం మంగళాపురానికి చెందిన డాక్టర్ పూర్ణచంద్రరావు రాశారు.
 
 ఆ గ్రామానికి చండ్ర రాజేశ్వరరావు పూర్వీకులు రావడం దగ్గర నుండి విలువైన వివరాలున్నాయి. విద్యార్థి గాయకుడిగా, పార్టీ నిర్మాతగా, రాష్ట్రం నుండి జాతీయ అంతర్జాతీయ నేతగా ఆయన ఎదిగిన తీరును చారిత్రక నేపథ్యంతో చూపడం రచయిత చేసిన గొప్ప కృషి. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన సంవత్సరంలో పుట్టిన ఆయన రష్యాలో అక్టోబర్ విప్లవంతో స్ఫూర్తిపొంది, భారత స్వాతంత్ర పోరాటంలో దూకి, తర్వాత పార్టీని స్థాపించి విస్తరించిన తీరును వరుసగా చెప్తుందీ పుస్తకం. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో గెరిల్లా యుద్ధ శిక్షణలో ఆయన పాత్ర వివరంగా ఉంది. మాస్కో వెళ్లి స్టాలిన్‌ని కలిసి వచ్చాక ఆయన చావుకి ఎదురెళ్లి అడవుల్లో గెరిల్లాలను కలిసే దృశ్యాలు ఇన్‌స్పైరింగ్‌గా ఉంటాయి.  రెండవ భాగమంతా ఆయన పర్యటనలూ ప్రసంగాలూ ప్రకటనలతో నింపడం వల్ల వ్యక్తిగా ఆయనకు సంబంధించి హ్యూమన్ యాంగిల్ మరింతగా తెలిసే అవకాశం తగ్గింది. చరిత్రలో పుట్టి పెరిగి చరిత్ర సృష్టించిన నిండు మనిషి గాథ ఇది. చివరికి పుస్తకాలూ రెండు మూడు జతల పంచెలూ లాల్చీలు తప్ప పైసా మిగుల్చుకోకుండా చనిపోయిన చండ్ర గురించి చదువుతుంటే ఆదర్శం, త్యాగాల తరం అంతరించిందా అనిపిస్తుంది.
 
 కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు-
 రచన: కిలారు పూర్ణ చంద్రరావు
 వెల: రూ.350 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు
 - మోహన్
 
 గమనిక:
 మీ రచనలు, సమీక్ష కొరకు రెండు కాపీలు, ఈ పేజీపై అభిప్రాయాలు అందవలసిన చిరునామా:
 ఎడిటర్, సాక్షి రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34.

Advertisement

తప్పక చదవండి

Advertisement