Sakshi News home page

ఎవరితను?: పుట్టనే లేదు, మళ్లీ బతికొచ్చాడు!

Published Mon, Aug 29 2016 12:32 AM

ఎవరితను?: పుట్టనే లేదు, మళ్లీ బతికొచ్చాడు!

అటక మీద అన్ని రకాల వస్తువులను పోగేస్తే అందులో నుంచి అవసరమయిన వస్తువు చటుక్కున దొరకదు. అట్లాగే, మెదడులో అనవసరమయిన సమాచారమంతా పోగేస్తే అవసరమయిన ఆలోచన అందదు, అంటాడు షెర్లక్‌ హోమ్స్‌. భూగోళం సూర్యుని చుట్టు గాక చంద్రుని చుట్టు తిరిగినా తనకు పట్టదు, అంటాడతను. మీరంతా చూస్తారు, నేను పరిశీలిస్తాను అని కూడా అంటాడతను.


ఇంతకూ ఎవరీ షెర్లక్‌ హోమ్స్‌? అతను అసలు పుట్టలేదు. కానీ కొంత కాలానికి చనిపోయాడు. కానీ ప్రపంచం గగ్గోలు పెడితే, అతడిని తిరిగి బతికించవలసి వచ్చింది. అతను ఒక రచయిత సృష్టించిన పాత్ర అని అర్థమయే ఉంటుంది. అయినా 120 సంవత్సరాలు పైబడిన తరువాత కూడా, లండన్‌లోని 221 బేకర్స్‌ స్ట్రీట్‌లో అతని కొరకు అడిగే వాళ్లున్నారు. కేవలం ఒక కల్పిత పాత్ర అయిన షెర్లక్‌ హోమ్స్‌ గురించి చాలా పుస్తకాలు వచ్చాయి. ప్రపంచమంతటా అతని పేర సంఘాలున్నాయి. షెర్లక్‌ హోమ్స్‌కు, సాహిత్యంలో అందిన స్థానం, ఏసుక్రీస్తు, మరొకరిద్దరికి తప్ప అందలేదని ప్రపంచమంతా మహామహులే అన్నారు.


ఆంగ్ల సాహిత్యంలో పసుపు పుస్తకాలని ఒక మాట ఉండేది. వాటికి అంతగా గౌరవం ఉండేది కాదు. తెలుగులో అపరాధ పరిశోధన పుస్తకాలు చిత్రంగా చిన్న సైజులో వచ్చేవి. వాటి అంచులకు ఎరుపు రంగు పూసేవారు. తెలుగులోలాగా, ప్రపంచమంతటా అపరాధ పరిశోధన సాహిత్యానికి గౌరవం మాత్రం లేదు. ఇంగ్లీషులో ఈ రకం సాహిత్యం ఎడ్గార్‌ ఎలాన్‌ పో రచనలతో మొదలయింది. అదే దారిలో మరికొంత మంది రాశారు. కొంత కాలానికి అపరాధ పరిశోధన రచనలను ప్రచురించే పత్రికలు కూడా వచ్చాయి. ఆ తరువాత 1887లో ఆర్తర్‌ కానన్‌ డాయ్‌ల్‌ రాసిన ఎ స్టడీ ఇన్‌ స్కార్లెట్‌ నవల వచ్చింది. అందులో షెర్లక్‌ హోమ్స్, వాట్సన్‌ పాఠకుల ముందుకు వచ్చారు. 1920 వరకు డాయ్‌ల్‌ మొత్తం నాలుగు నవలలు, 56 కథలు రాశాడు.


మొదటి నవల మొదటి పేజీలోనే భారతదేశం ప్రసక్తి వస్తుంది. రెండవ నవల ద సైన్‌ ఆఫ్‌ ఫోర్‌లోని కథ అండమాన్‌లో మొదలవుతుంది. ఆ తరువాత డాయ్‌ల్‌ వరుసబెట్టి అడ్వెంచర్స్‌ పేరున పన్నెండు కథలు రాశాడు. ఆ తరువాత 11 కథలు మెమాయిర్స్‌ పేరున వచ్చాయి. అయితే కథలు సూటిగా సాగవు. జరిగిన పరిశోధన వివరాలను డిటెక్టివ్‌కు సహాయకుడు, మిత్రుడు అయిన డాక్టర్‌ వాట్సన్‌ రాసినట్టుగా రచనలు సాగుతాయి. ఈ పద్ధతిని తరువాత అగదా క్రిస్టీ లాంటి మరికొందరు కూడా అనుసరించారు. ఇంతకూ, ఆర్తర్‌ కానన్‌ డాయ్‌ల్, ఇక చాలు అనుకున్నాడు. ఒక కథ చివరలో ప్రత్యర్థితో పెనుగులాడుతూ డిటెక్టివ్‌ హోమ్స్‌ నదిలో పడి చనిపోయినట్టు రాశాడు. దాంతో రచయితను పాఠకులు ఉత్తరాలతో ముంచెత్తారు. నిజంగా ఒక  మనిషిని చంపినా, అంత గగ్గోలు అయ్యేది కాదేమో అంటూ డాయ్‌ల్‌ తిరిగి షెర్లక్‌ హోమ్స్‌ను బతికించి మరో రెండు నవలలు, కొన్ని క«థలు రాశాడు. కనిపించకుండా పోయిన ఆ కాలంలో హోమ్స్‌ భారతదేశం ప్రాంతాలలో కాలం గడిపినట్లు గత కొంతకాలంగా ఒక సిద్ధాంతం పుట్టించి, కొందరు రచనలను కొనసాగిస్తున్నారు!


నిజంగానే బతికిన మనుషుల గురించి కూడా అందుబాటులో లేని వివరాలు షెర్లక్‌ హోమ్స్‌ గురించి దొరుకుతాయి. అతను ఆరడుగులకన్నా ఎత్తు. 183 సెంటీమీటర్లు ఉండేవాడట. ఆ టోపీ, చుట్ట, భూతద్దం, కొలత టేపు మొదలయిన వివరాలన్నీ కలిపి ఒక రూపాన్ని కళ్ల ముందు నిలబెట్టారు. అది చాలదన్నట్టు అప్పట్లో పత్రికలవారు బొమ్మలు కూడా గీయించారు. ఇంకా చిత్రం, అతని శారీరక, మానసిక లక్షణాలను బట్టి హోమ్స్‌కు ఒకానొక మానసిక రుగ్మత కూడా ఉందని తేల్చారు పరిశోధకులు ఈమధ్య!


ఆర్తర్‌ కానన్‌ డాయ్‌ల్‌ పళ్ల డాక్టరు. కానీ పేషంట్లు ఎవరూ రాలేదు. కనుక రాతకు దిగాడు. ఒకప్పుడు తనకు పాఠాలు చెప్పిన గురువు డాక్టర్‌ జోసెఫ్‌ బెల్‌ను దృష్టిలో పెట్టుకుని హోమ్స్‌ పాత్రకు ప్రాణం పోశాడు. ఆర్తర్‌ నిజానికి చారిత్రక నవలలు, కథలను రాయడాన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు. ఈ హోమ్స్‌ మంచి సంగతుల నుంచి  నా మనసును పక్కదారి పటిస్తున్నాడని విసుక్కున్నాడు కూడా! అయితే, అతని తల్లి ఆ మాటలను ఎదిరించింది. హోమ్స్‌ కారణంగానే డాయ్‌ల్‌ పేరు నేటికీ నిలిచి ఉంది! ఒకప్పుడు దూరదర్శన్‌లో కరమ్‌చంద్‌ అని అపరాధ పరిశోధన సీరియల్‌ వచ్చింది. అందులో డిటెక్టివ్‌ తిక్కతిక్కగా ఉంటాడు. ఆ పద్ధతి షెర్లక్‌తో మొదలయి ఇప్పటి దాకా సాగుతున్నదంటే హోమ్స్‌ ప్రభావాన్ని అంచనా వేయవచ్చు. వోల్టేర్, రూసో లాంటి వారు అప్పట్లో కార్యకారణాలు, రేషనాలిటీల గురించి రాశారు. డాయ్‌ల్‌ ఆ పద్ధతులను వాడే ఒక మనిషిని సృష్టించాడు. సైన్సును అంతగా అంగీకరించని కారణంగా వచ్చిన ఫ్రాంకెన్‌సైంటన్(మేరీ షెల్లీ), డాక్టర్‌ జెకిల్‌ అండ్‌ మిస్టర్‌ హైడ్‌(రాబర్ట్‌ లూయీ స్టీవెన్‌సన్‌)లకు పూర్తి భిన్నంగా హోమ్స్‌ తీరు నడిచింది. దీంతో, రసాయనశాస్త్రం, నేరపరిశోధనలను వాడి లండన్‌తో మొదలు ప్రపంచమంతటా ధనిక వర్గాల మధ్యన జరుగుతున్న నేరాల గుట్టుమట్టులను విప్పవచ్చునన్న ధీమా అందరికీ కలిగింది. పో సృష్టించిన డుపిన్, డాయ్‌ల్‌ గారి హోమ్స్‌ ఇద్దరూ విజ్ఞాన పద్ధతి ఆధారంగా పరిశోధనలు సాగించారు. తరువాత రచనలలో ప్రపంచంలో ఆ తీరు కొనసాగింది.


మానవుల స్వభావాలను అర్థం చేసుకోవడం, వాటిని గురించి వ్యాఖ్యానించడం హోమ్స్‌ పాత్రలోని మరో ప్రత్యేకత. నేరాల వెనుక ఆలోచనలను ఊహించగలగడం మామూలు విషయం కాదు. మొదటి నవలలో పాత్ర పరిచయం సందర్భంలోనే రక్తాన్ని గుర్తించడం గురించి తానొక పద్ధతిని కనుగొన్నాను అంటాడు హోమ్స్‌. పొగాకు, కాలిముద్రలు, చేతుల తీరు మొదలయిన అంశాలను పరిశీలించి మోనోగ్రాఫులు రాశానంటాడు. ఒక టోపీ, ఒక గడియారం లాంటి మామూలు వస్తువులను పరిశీలించి సొంతదారులను గురించి ఎన్నో సంగతులు చెప్పేస్తాడు. తోటి పాత్రలు, పాఠకులు ఆశ్చర్యంలో పడుతారు. అతను తన పద్ధతిని వివరించిన తరువాత మాత్రం, ఈ సంగతులు మనకెందుకు తోచలేదు, అని మరోసారి ఆశ్చర్యంలో మునిగిపోతారు. ‘ఏ విషయం గురించీ ముందే నిర్ధారణలు చేయకూడదు’ అంటాడు ఈ పరిశోధకుడు. కారణాలలో ఒక్కొక్కదాన్నే కొట్టిపడేస్తుంటే, చివరకు మిగిలేవి ఎంత అసాధ్యంగా కనిపించినా సరే, అవే అసలయిన ఆ«ధారాలు అంటాడు. పరిస్థితులు ఎంత మామూలుగా కనబడుతుంటే, వాటి వెనుక వివరాలు, అంత లోతుగా ఉంటాయి అంటాడు. అక్కడక్కడ హోమ్స్, అలవోకగా తనవిగానూ, మరెవరో రచయితలవిగానూ చెప్పే మాటలు ఆలోచనల్లో పడేస్తాయి.


‘సంఘటనల గురంచి చెపితే, ఫలితాన్ని ఊహించగల వారు చాలామంది ఉంటారు. కొందరు మాత్రం, ఫలితాన్ని బట్టి, అందుకు దారితీసిన సంఘటనను ఊహించగలుగుతారు’ అంటాడు. హతుని పెదాల వాసన కారణంగా చావుకు కారణం విషం, అని చెప్పడం మనకు ప్రస్తుతం మామూలుగా వినిపించవచ్చు. కానీ నేర పరిశోధన ఒక శాస్త్రంగా మారకముందు, అది ఒక మార్గదర్శక సూత్రం. సీరియస్‌ సాహిత్యం కాదనుకున్న రచనలలో ఇంతటి లోతు ఉండడం మనం గమనించవలసి ఉంది. సాహిత్యం అంతా గొప్పదే! అందులోని లోతును మనం చూడగలగాలి. లాంగ్‌ లివ్‌ షెర్లక్‌ హోమ్స్‌!

(సర్‌ ఆర్తర్‌ కానన్‌ డాయ్‌ల్‌ నాలుగు పుస్తకాలను కె.బి.గోపాలం తాజాగా తెలుగులోకి అనువదించారు. అవి: ఎ స్టడీ ఇన్‌ స్కార్లెట్, ద సైన్‌ ఆఫ్‌ ఫోర్, ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ షెర్లక్‌ హోమ్స్‌–1, ది అడ్వెంచర్స్‌ ఆఫ్‌ షెర్లక్‌ హోమ్స్‌–2. వీటి ప్రచురణ: క్రియేటివ్‌ లింక్స్, 1–8–725/ఎ/1, 103సి, బాలాజీ భాగ్యనగర్‌ అపార్ట్‌మెంట్స్, నల్లకుంట, హైదరాబాద్‌; ఫోన్‌: 9848065658)
కె.బి.గోపాలం
9849062055

Advertisement
Advertisement