ఎదురు చూసిన భూకంపం | Sakshi
Sakshi News home page

ఎదురు చూసిన భూకంపం

Published Sun, May 18 2014 1:46 AM

ఎదురు చూసిన భూకంపం - Sakshi

మోడీ గుజరాత్‌లో సర్దార్ పటేల్ మహా ప్రతిమను ప్రతిష్టించే ఏర్పాట్లు చేశారు. పటేల్ ప్రతిమను మించి మోడీ కీర్తిని పెంచడంలో సొంత పార్టీ కంటె కాంగ్రెస్, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్కువ కృషి చేశారు. వారు చేసిన ప్రతి విమర్శ తన ప్రతిష్టను పెంచేదిగా ఆయన మలచుకున్నారు.
 
 ఆ గుజరాత్ భూకంపం నరేంద్ర మోడీ అనే రాజకీయవేత్తకు జన్మనిచ్చింది. ఆయన రాజకీయ భారతంలో భూకంపం సృష్టించారు. జనవరి 26, 2001లో గుజరాత్‌లోని భుజ్ ప్రాంతం పెను భూకంపంతో కకావికలైంది. బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘోర ప్రకృతి వైపరీత్యంతో ఇరవైవేల మంది చనిపోయారు. ఢిల్లీలో తన పార్టీ కార్యాలయంలో ఉన్న మోడీ వార్త తెలిసి, ఒక వ్యాపారవేత్త సాయంతో హెలికాప్టర్ మీద భుజ్ ప్రాంతం చేరుకున్నారు. ఆ తరువాతే అక్కడికి చేరుకోగలిగిన నాటి గుజరాత్ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్, ‘ఈ మనిషి నా జీవితాన్ని దుఃఖభాజనం చేసేటట్టు ఉన్నాడు’ అని చుట్టూ అధికారులు ఉన్న సంగతి కూడా పట్టించుకోకుండా వ్యాఖ్యానించారు.
 
 అక్షరాలా అదే జరిగింది. భూకంప బాధితుల రక్షణకు చర్యలు తీసుకోవడంలో దారుణంగా విఫలమైన కేశూభాయ్‌కి బీజేపీయే ఉద్వాసన పలకవలసి వచ్చింది. అదే సంవత్సరం అక్టోబర్‌కు కేశూభాయ్ స్థానంలో వచ్చిన కొత్త ముఖ్యమంత్రే నరేంద్ర దామోదరదాస్ మోడీ. మోడీ గుజరాత్ పద్నాలుగో ముఖ్యమంత్రి. ఆ రాష్ట్ర పద్నాలుగో ముఖ్యమంత్రే ఇప్పుడు భారత పద్నాలుగో ప్రధానమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అలా నరేంద్రమోడీ అధికార రాజకీయాలకు అంకురార్పణ జరిగింది.
 
 దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడేళ్లకి సెప్టెంబర్ 17, 1950న గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో పుట్టిన మోడీ నోటిలో వెండి చెమ్చాతో భూమ్మీద పడినవాడుకాదు. తండ్రి దామోద రదాస్ మూల్‌చంద్ మోడీ  రైల్వే స్టేషన్ దగ్గర మురికోడుతూ, దుమ్ముధూళితో నిండి ఉండే ఒక పేటలో ‘చాయ్‌వాలా’. సాయంత్రం బడి గంట కొట్టిన తరువాత ఉరుకులూ పరుగులతో వచ్చి దుకాణంలో తండ్రికి సాయం చేసేవాడాయన. తరువాత ఒక సోదరుడితో (వారు ఆరుగురు సోదరులు) కలసి వాద్‌నగర్ బస్ టెర్మినస్ దగ్గర మోడీయే ఒక దుకాణం ప్రారంభించారు. ఒకసారి హిమాలయాలకు వెళ్లినా, తిరిగి వచ్చి మళ్లీ తేనీరు అమ్మారు. ఆ తరువాతే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) ‘శాఖ’ వైపు అడుగులు వేశారు. అప్పటికి ఆయన వయసు పదిహేడు సంవత్సరాలు. నిజానికి ఎనిమిదో ఏటనే మోడీకి ఆరెస్సెస్‌తో పరిచయం ఏర్పడింది.
 ఒక సంక్షుభిత కాలంలో, దాని వెంట నడుస్తూ సామాజిక, రాజకీయ కార్యకర్తగా ఆవిర్భవించినవాడు నరేంద్రమోడీ. 1971లో పాకిస్థాన్‌తో భారత్ యుద్ధం చేసింది. ఆ సమయంలో వాద్‌నగర్ మీదుగా సాగే రైళ్లలో ప్రయాణిస్తున్న సైనికులకు తేనీరు సరఫరా చేశారు మోడీ. అదంతా సైన్యం మీద గౌరవం. ఆ గౌరవంతోనే తనను కూడా ఒక సైనికుడిగా ఊహించుకునేవారాయన. ఆ వెంటనే ఆరెస్సెస్‌లో పూర్తి స్థాయి కార్యకర్త (ప్రచారక్)గా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ ఆవిర్భావం, ఆ వెంటనే జరిగిన సాధారణ ఎన్నికలలో అసాధారణ శక్తిగా నిలిచిన నాటి ప్రధాని ఇందిరను జనసంఘ్ ప్రముఖుడు అటల్ బిహారీ వాజపేయి ‘దుర్గ’గా కీర్తించడం- ఇవన్నీ మోడీ సమీపంగా చూసిన రాజకీయ పరిణామాలు. నూనూగు మీసాల మోడీ వీక్షించిన మరో పెద్ద పరిణామం- సంపూర్ణ విప్లవం. లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ బీహార్‌లో ప్రారంభించిన ఆ ఉద్యమానికి తీవ్రంగా స్పందించిన రాష్ట్రం గుజరాత్. ఆ నేపథ్యంలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్షాలు కలసి పోటీ చేయడం రాజనీతి శాస్త్ర విద్యార్థి మోడీకే కాదు, దేశానికే ఆసక్తి కలిగించి ఉండాలి.
 
 ఐక్యమైన విపక్షాల శక్తి ముందు నాటి ముఖ్యమంత్రి చిమన్‌భాయ్ పటేల్ ప్రభుత్వం తలొంచింది. జూన్ 12, 1975న ఈ ప్రజా తీర్పు వెలువడింది. చిత్రంగా అదే రోజు ఈ దేశ రాజకీయాలను మలుపు తిప్పి, భారతీయ జనతా పార్టీ అనే ప్రత్యామ్నాయ శక్తి ఆవిర్భవించడానికి బీజం వేసిన మరో తీర్పూ వెలువడింది. అదే- అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ జగ్‌మోహన్‌లాల్ సిన్హా ఇచ్చిన తీర్పు. 1971 లోక్‌సభ పోరులో రాయ్‌బరేలీలో ‘అక్రమాలకు పా ల్పడినందుకు’ ఇందిర ఎన్నికను కొట్టివేస్తూ వెలువడిన సంచలనాత్మక తీర్పు అది. జూన్ 25న సుప్రీంకోర్టులో జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరించారు. ఆ రాత్రే భారత ప్రజాస్వామిక చరిత్రలో చీకటిపుటను తెరుస్తూ ఇందిర ఎమర్జెన్సీ విధించారు. ప్రతిపక్షాలకు, ఆరెస్సెస్‌కు అదో కష్టకాలం.
 
  స్వాతంత్య్రం తెచ్చుకున్న పాతికేళ్లకు దేశం అత్యవసర పరిస్థితి గుప్పెటలోకి వచ్చింది. ఎమర్జెన్సీ తరువాత 1977 ఎన్నికలలో నాలుగు పార్టీలు కలసి జనతా పార్టీగా ఆవిర్భవించాయి. అందులో భారతీయ జనసంఘ్ ఒకటి. శ్యామాప్రసాద్ ముఖర్జీ స్థాపించిన ఈ పార్టీ నుంచి వచ్చిన వారే బలరాజ్ మధోక్, దీనదయాళ్ ఉపాధ్యాయ, వాజపేయి, అద్వానీ తదితరులు. అదే 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచింది. ఈ పార్టీ నుంచి వచ్చిన నాయకుడే నరేంద్ర మోడీ కూడా. మన ప్రజాస్వామ్యాన్ని వజ్రసదృశం చేసిన ఈ పరిణామాలన్నీ చూసిన ఆ చాయ్ వాలా నేడు చాచా నెహ్రూ అధిరోహించిన స్థానం దగ్గరకు చేరుకున్నారు.
 
  ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన సమయానికి మోడీ ఒక్క ఎన్నికలో కూడా పోటీ చేయలేదు. కానీ ఎన్నికల నిర్వహణలో అనుభవం గడించారు. నాలుగో పర్యాయం గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినపుడే మోడీని ప్రధానిని చేయాలన్న నినాదం మొదలయింది. నిన్న మొన్న ముగిసిన ఎన్నికల వరకు చాలా చిత్రంగా మోడీ ఢిల్లీ పీఠం అధిరోహించడానికి అనువైన వాతావరణం శరవేగంతో ఏర్పడిపోయింది. రెండు స్థానాలున్న బీజేపీని 89 స్థానాలకు తీసుకువెళ్లి ప్రబల శక్తిగా తయారు చేసిన వాడిగా మన్ననలను అందుకున్న అయోధ్య రథికుడు అద్వానీ సయితం అనూహ్యంగా పక్కకు తప్పుకోవలసి వచ్చింది. ఆ యాత్రలో మోడీ అద్వానీ వెంట ఉన్నారు.  కాంగ్రెస్, ఇతర రాజ కీయ పక్షాలు కూడా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి మోడీ ‘మహాశక్తి’గా ఆవిర్భవించడానికి దోహదం చేశాయి. మోడీ గుజరాత్‌లో సర్దార్ పటేల్ మహా ప్రతిమను ప్రతిష్టించే ఏర్పాట్లు చేశారు. పటేల్ ప్రతిమను మించి మోడీ కీర్తిని పెంచడంలో సొంత పార్టీ కంటె కాంగ్రెస్, ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎక్కువ కృషి చేశారు. వారు చేసిన ప్రతి విమర్శ తన ప్రతిష్టను పెంచేదిగా ఆయన మలచుకున్నారు. ప్రత్యర్థి విసిరినది రాయే కావచ్చు, కానీ అది పుష్పగుచ్ఛమని నమ్మించిన మాంత్రికుడాయన. మోడీ ప్రతి విమర్శ ప్రత్యర్థి విసిరిన పాచికకు సమాధాన మిస్తున్న ప్రతి పాచిక వలెనే శబ్దిస్తుంది. మోడీవి ‘నీచ రాజకీయాలు’ అని ప్రియాంక అంటే, దానిని ఆయన మలచిన తీరు పెద్ద కుదుపునకే కారణమైంది. మోడీ ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న పాత సిద్ధాంతానికి పరిమితమైపోలేదు. దానికి నిదర్శనం- ఈ ఎన్నికలు. ఆయన లక్ష్యం కాంగ్రెస్‌ను నేల కరిపించడం.
 
 కానీ ఆ పనిలో తనను వ్యతిరేకించే రాజకీయ పక్షాలన్నింటినీ చిరునామా లేకుండా చేయగలిగారు. ఇదొక భూకంపాన్ని మరిపిస్తుంది. మోడీ మీద ఉన్న ఆరోపణల మాటెలా ఉన్నా ఆయన అరవై అయిదు సంవత్సరాల భారత రాజకీయాలలో ఇప్పుడొక సంచలనం. ఈ సంచలనం ఎంత కాలం సాగుతుందో ప్రత్యర్థులే కాదు, సొంత పార్టీ కూడా చెప్పలేదేమో! మోడీ సమాచారాన్ని ఒక ఆయుధంగా విశ్వసిస్తారు. ఈ చాయ్‌వాలా సృష్టించిన సంచలనం టీ కప్పులో తుపాను కాదని భారత్‌తో పాటు అగ్రదేశం అమెరికా కూడా నమ్ముతోందన్నదే ప్రస్తుత సమాచారం.    
 - డాక్టర్ గోపరాజు నారాయణరావు

Advertisement
Advertisement