అమెరికాలో అక్టోబర్ సంక్షోభం | Sakshi
Sakshi News home page

అమెరికాలో అక్టోబర్ సంక్షోభం

Published Tue, Oct 29 2013 1:20 AM

అమెరికాలో అక్టోబర్ సంక్షోభం

ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలిగించేటట్టు ఉంది. నష్టనివారణ చర్యలు కోసం అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు.
 
 ‘ఎడ్వర్డ్ స్నోడెన్‌కు కృతజ్ఞతలు’ రెండురో జుల క్రితం అమెరికా పౌరులు కొందరు కేపిటల్ హిల్ అనేచోట ఊరేగింపుగా వెళుతూ ఇచ్చిన నినాదాలలో ఇదొకటి. ఇప్పుడు స్నోడెన్ అమెరికాకు ప్రథమ శత్రువన్న సం గతి ప్రపంచమంతటికీ తెలుసు. ‘ఈ సామూహిక గూఢచర్యం పనులు ఆపాలి!’ అని కూడా ఆ పౌర బృందం ఆక్రోశించింది. ఒక వ్యవస్థగా అమెరికాను స్వదేశీయులే ఎంత చీదరించుకుంటున్నారో చెప్పడానికి ఇదిచాలు. సందర్భం కూడా తలవంపులు తెచ్చేదే. తనకు అత్యంత ఆప్తమైన యూరప్ ఖండ పాలకుల ఫోన్ల సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తూ అమెరికా అడ్డంగా దొరికిపోయింది.
 
ఈ అక్టోబర్ 24న లండన్ నుంచి వెలువడే ‘గార్డియన్’ ప్రచురించిన ఒక వార్తా కథనం అగ్రదేశంలో అక్టోబర్ సంక్షోభానికి బీజం వేసింది. ‘2006, అక్టోబర్’కు చెందిన ఒక కీలక పత్రమే ఈ కథనానికి కేంద్రబిందువు. ప్రపంచంలో 200 మంది ప్రముఖుల, ప్రముఖ సంస్థల సెల్‌ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ చిరునామాలను సేకరించి, అమెరికా జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఎస్‌ఏ)వారి సమాచారాన్ని రహస్యంగా తెలుసుకుంటున్న సంగతిని ఆ పత్రం రుజువు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఏ మాజీ కాంట్రాక్టర్ అయిన స్నోడెన్ విడుదల చేసిన రహస్య పత్రాల గుట్టలలోనిదే ఇది కూడా. ‘గార్డియన్’ దీనిని అదను చూసి ప్రచురించింది.
 
యూరోపియన్ యూనియన్ సమావేశాల కోసం ఆయా దేశాల అధినేతలంతా బ్రస్సె ల్స్‌లో సమావేశమవడానికి కాస్త ముందు ఆ పత్రిక ఈ వార్తను ప్రచురించింది. అమెరికా గూఢచర్యానికి పాల్పడిన సంగతి తిరుగు లేకుండా రుజువు చేసింది. ఈ 200 మంది ఫోన్లు, ఈమెయిల్ చిరునామాలలో జర్మనీ చాన్సలర్ ఏంజెలినా మెర్కెల్ ఉపయోగించే మొబైల్ నెంబరు కూడా ఉంది. ఇది ఆ దేశానికి తీవ్ర ఆగ్రహమే తెప్పించింది. చరిత్ర సృష్టిస్తూ తను అధ్యక్షునిగా ఎన్నికైనపుడు (2011) ఒబామా పిలిచిన యూరప్ నుంచి ఆహ్వానించిన తొలి అతిథి మెర్కెల్. ఇప్పుడు ఆమె అమెరికాను నిలదీయాలని గట్టిగా కోరు కుంటున్నారు. బ్రస్సెల్స్ ఏర్పాటైన ఈయూ సమావేశం కూడా చర్చనీయాంశాలను పక్కన పెట్టి అమెరికా విపరీత చర్య గురించే ఎక్కు వగా ఆవేదనను వ్యక్తం చేసింది.
 
 ఈ మొత్తం వ్యవహారం విస్మయం కలి గించేటట్టు ఉంది. నష్ట నివారణ చర్యలు చేప ట్టాలని అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. మెర్కెల్ మొబైల్ నుం చి ఎన్‌ఎస్‌ఏ సమాచారం సేకరిస్తున్న సంగతి తనకు తెలియదని, ఈ విషయం బహిర్గత మైన వెంటనే అధ్యక్షుడు ఒబామా అమాయ కత్వం నటించారు. అయితే గూఢచర్యం సం గతి 2010 సంవత్సరం నుంచి ఒబామాకు తెలుసునని జర్మనీ పత్రిక ‘బిల్డ్ ఏఎం సోన్టా గ్’ ఒక బాంబు పేల్చింది. మెర్కెల్‌కు వస్తున్న ఫోన్‌కాల్స్ వినే పనిలో అమెరికా గూఢచారి శాఖ ఉద్యోగి ఒకరు ఉన్నారని 2010లోనే ఎన్ ఎస్‌ఏ అధిపతి కీత్ అలెగ్జాండర్ ఒబామాకు నివేదించిన సంగతిని జర్మనీ పత్రిక వెల్ల డించింది.
 
  ఈ సంగతి విని ఒబామా ‘ఇంకాస్త సమాచారం కూడా సేకరించండి!’ అని ఆదే శించినట్టు ఆధారాలు బయటపడ్డాయి. మెర్కె ల్ నమ్మదగిన జర్మన్ కాదని ఒబామా నమ్మక మట. అమెరికా గూఢచర్యం గురించి జర్మనీ ఇప్పటికే అక్కడి అమెరికా రాయబారిని పిలిచి చీవాట్లు పెట్టింది. ఈ పరిణామాల మీద శ్వేత సౌధం అధికార ప్రతినిధి కెయిట్లిన్ హేడెన్ వ్యాఖ్యానించడానికి నిరాకరించినా, ఒక పాత సత్యం కొత్తగా వెల్లడించారు. విదేశాలకు సం బంధించిన సమాచారాన్ని అమెరికా గూఢ చారి సంస్థలు సేకరించడం మామూలేనని ఆయన సెలవిచ్చారు. మెర్కెల్ నుంచి కాదు, ఆమెకు ముందు అధ్యక్ష పదవిలో ఉన్న జెరార్డ్ ష్రోడర్ ఫోను సమాచారం కూడా అమెరికా విన్న సంగతి కూడా బయటపడింది. సెప్టెం బర్ 11,2001 దాడుల తరువాత అమెరికా నిగూఢత, జవాబుదారీతనాలకు సంబంధిం చిన మొత్తం విలువలను విడిచిపెట్టేసిందని స్నోడెన్ పత్రం వ్యాఖ్యానించింది.
 
 దీని ఫలి తమే కావచ్చు, అమెరికా ఈయూకు చెందిన కార్యాలయాలు, ప్రముఖులకు చెందిన ఐదు లక్షల ఫోన్ కాల్సును రహస్యంగా సేకరిం చిందని తేలింది. 35 మంది ప్రపంచ ప్రముఖ రాజకీయ ప్రముఖులలో మెర్కెల్‌తో పాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకాయిస్ హోలాండ్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా వాన్ రోసెఫ్, మెక్సికో అధ్యక్షుడు ఎన్‌రిక్ పెనా నీటో వంటి వారి కాల్స్ ఎన్‌ఎస్‌ఏ చాటుగా వింటున్నదని ఆరోపణలు వచ్చాయి. ఇంకా రష్యా, ఇరాన్, రష్యా నాయకుల కాల్స్ కూడా ఆ సంస్థ లక్ష్యంగా ఎంచుకుంది. రష్యా, బ్రెజిల్ ఇప్ప టికే దీని మీది మండిపడుతుండగా, అమెరికా ఇక నమ్మకమైన దేశమేనని రుజువు చేసుకునే పని ఆ దేశానిదేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు వ్యా ఖ్యానించారు. ఈ సంవత్సరాంతంలోగా ఈ అంశం మీద అమెరికాతో చర్చలు జరపాలని మెర్కెల్ అభిప్రాయపడుతున్నారు. అయితే అమెరికాను వెలివేసే ఉద్దేశం వీరికి ఎంతమా త్రమూ లేదు. ఇప్పుడు బహుశా ప్రపంచం అంతా ఎదురు చూసేది ఒక అంశం కోసమే కావచ్చు. అది- కేపిటల్ హిల్ తరహా ఊరేగిం పులు బలపడాలి. తమ ప్రభుత్వం మీద ఆ పౌరులు వినిపిస్తున్న వ్యతిరేక నినాదాలకు పదును రావాలి.
 - కల్హణ

Advertisement
Advertisement