ఏవి ఆ సోవియెట్ రోజులు... | Sakshi
Sakshi News home page

ఏవి ఆ సోవియెట్ రోజులు...

Published Sat, May 24 2014 1:04 AM

ఏవి ఆ సోవియెట్ రోజులు...

తెలుసుకోదగ్గ పుస్తకం:  ఆదోని డిగ్రీ కాలేజి వార్షికోత్సవానికి వెళ్లినప్పుడు అక్కడి లైబ్రరీలో ఉన్న ఎన్నో మంచి పుస్తకాల్లో ‘ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్’ (ప్రోగెస్ పబ్లిషర్స్ - 1974) చూడగానే నాకెందుకో బెంగగా అనిపించింది. డెబ్బైల్లోనూ ఎనబైల్లో కొంతకాలం దాకా సోవియెట్ పుస్తకాలు, కవిత్వం, కథలు ఎంతో చౌకగా విరివిగా దొరికేవి. నా చిన్నప్పుడు సత్తెనపల్లిలో జరిగిన జిల్లా సైన్సు ఫెయిర్‌లో నాకు బహుమతిగా దొరికిన మూడు పుస్తకాలూ సోవియెట్ పుస్తకాలే. యాకోవ్ పెరొల్మాన్ రాసిన నిత్య జీవితంలో భౌతిక శాస్త్రం నా హైస్కూలు రోజుల్లో ఎన్నిసార్లు చదివానో. మార్క్స్, ఎంగెల్సు రచనలు, లెనిన్ రచనలు పూర్తి సంపుటాలతో పాటు గోర్కీ అమ్మ, టాల్‌స్టాయ్ కొసక్కులు, అన్నా కెరెనినా, డాస్టవిస్కీ పేదజనం-స్వేతరాత్రులు, తుర్గనెవ్ తండ్రులూ-కొడుకులూ, కుప్రిన్ రాళ్లవంకీ కథలు, చింగిజ్ అయిత్‌మాతోవ్ నవలలు, ఆర్మేనియన్ కథలు ‘కొండగాలీ-కొత్త జీవితం’, పిల్లల బొమ్మల పుస్తకాలూ ఆ రోజుల్లో దాదాపుగా ప్రతి సాహిత్యమిత్రుడి భాండాగారంలోనూ కనిపించేవి. రష్యన్ కవిత్వం కన్నా సోవియెట్ కవిత్వం, ముఖ్యంగా రసూల్ గాంజటవ్, జైసన్ కులియెన్ వంటి వారి పుస్తకాలు ఎంతో అందమైన ముద్రణల్లో కనిపించేవి. చెకోవ్ మొత్తం కథలు నాలుగు సంపుటాల్లో వచ్చిన అందమైన ప్రచురణలో మూడు సంపుటాలు ఇప్పటికీ భద్రంగా నా దగ్గరున్నాయి.
 
 ఫిఫ్టీ సోవియెట్ పొయెట్స్ పుస్తకం చూడగానే ఈ జ్ఞాపకాలు మనసులో మెదలడంతో కలిగిన బెంగ కొంతమాత్రమే కాని అసలు సోవియెట్ ప్రయోగమే నా హృదయాన్ని కలచివేసింది. ఇరవయ్యవ శతాబ్దం చూసిన మహత్తర మానవ సామాజిక ప్రయోగాల్లో సోవియెట్ రష్యా ఆవిర్భావం కూడా ఒకటి. శతాబ్దం ముగియకుండా ఆ ప్రయోగం కుప్పకూలిపోవడం మరొకటి. సోవియెట్ రష్యా ఏర్పడినప్పుడు అది శ్రీశ్రీ స్తుతించినట్టుగా ‘భావికాల స్వర్ణభవన నిర్మాతగా మారుతుందనే’ ప్రపంచమంతా ఎదురుచూసింది. రెండవ ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ దగ్గర నాజీ సైన్యాల్ని సోవియెట్లు నిలవరించి ఉండకపోతే ప్రపంచ చరిత్ర మరోలా ఉండేదని మా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెంకటరత్నంగారు ఎంతో ఉద్వేగంగా చెప్పేవారు. కాని ఇప్పుడదంతా ఒక గతంగా జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోవడం నా బెంగకి కారణం.
 ఎనభైలలో గోర్బచెవ్ పెరిస్త్రోయికా గురించి మాట్లాడినప్పుడు ఆర్‌ఎస్ సుదర్శనం దగ్గరకు వెళ్లి గ్లాస్ నోస్త్, పెరిస్త్రోయికా అంటే ఏమిటని అడిగితే ఆ పదాలు సోవియెట్ గోడలు పగుళ్లు బారుతున్నాయనడానికి సంకేతమనీ, ఆ వ్యవస్థ తొందర్లోనే కూలిపోనున్నదనీ వివరించారాయన.
 
 అవన్నీ తలంపులోకి రాగా ఇప్పుడీ యాభై మంది సోవియెట్ కవుల కవితా సంకలనం తెరవగానే రష్యన్ స్టెప్పీల పచ్చగడ్డి వాసనతో పాటు అందులోని యుద్ధాల పొగా, సైబీరియన్ ఖై దీల అశ్రువుల వెచ్చదనం కూడా నా చుట్టూ ముసురుకున్నాయి.  ఈ పుస్తకం ముందుమాటలో ఇలా ఉంటుంది - ‘హింసకీ శత్రుత్వానికీ వ్యతిరేకంగా ఇది గళం విప్పింది. ప్రపంచంలో శాశ్వతంగా కనవచ్చే కాయకష్టం, మాతృత్వం, ప్రకృతితో తాదాత్మ్యంలో మనిషి పొందే సంతోషం, ప్రజల మధ్య సంభవించే స్నేహం వంటి వాటి కోసమే ఈ కవిత్వం నిలబడుతున్నది’
 
 సమకాలీన సోవియెట్ సంకలనల్లాగా కాకుండా ఈ సంకలనంలో అన్నా అఖ్మతోవా, సాస్టర్నాక్ వంటి కవులకి కూడా చోటు దొరికింది. తల్లి హృదయం అనుభవించే క్షోభ ఏమిటో అన్నా అఖమతోవా, మేరియా త్సెతావా వంటి వారికన్నా ఎక్కువ ఎవరికి తెలుస్తుంది? తన పిల్లల ఆకలి తీర్చడం కోసం సోవియెట్ రష్యాలో మేరియా త్సెతావా దొంగతనానికి కూడా వెనకాడలేదని మనకు తెలుసు. ఇక స్టాలిన్ ప్రభుత్వం అక్రమంగా నిర్బందించిన తన కొడుకుని చూసుకోవడం కోసం, విడిపించుకోవడం కోసం అన్నా అఖ్మతోవా ఏళ్ల తరబడి వీధుల్లో ప్రభుత్వ కార్యాలయ్యాలో జైళ్ల ముందట పడిగాపులు పడింది. యుద్ధం, దుఃఖం, భగ్న ఆశలకు గుర్తు ఈ పుస్తకం.
 - వాడ్రేవు చినవీరభద్రుడు
 
 లిటరరీ ఫిక్షన్‌కు వేరే ప్రత్యేకత లేదు...
 ఇలా అన్నారు: కాల్పనిక సాహిత్యాన్ని ‘లిటరరీ ఫిక్షన్’ (సీరియస్ సాహిత్యం), ‘జ్ఛట్ఛ ఫిక్షన్’ (కాలక్షేప సాహిత్యం) అని రెండుగా వర్గీకరించారు. నా దృష్టిలో లిటరరీ ఫిక్షన్ కూడా ఒక జ్ఛట్ఛ (జానర్/కేటగిరీ) మాత్రమే. తక్కిన అన్ని రకాల కాల్పనిక సాహిత్యానికి ఉన్నట్టే లిటరరీ ఫిక్షన్‌గా పిలవబడే సీరియస్ సాహిత్యానికీ తనదంటూ ఓ పాఠక సమూహం ఉంది. అంతకు మించి దానికేం ప్రత్యేకత లేదు.
 
 పాఠకుడిగా నా వయసు పాతికేళ్లు. ఈ పాతికేళ్లలో గమనించిందేమంటే- తెలుగు కథల్లో లిటరరీ ఫిక్షన్ ఆధిపత్యం క్రమంగా పెరుగుతూ పోయి, చివరికి వేరే రకాల కథలు దాదాపు మృగ్యమైపోయాయి. భావోద్వేగాల ప్రకటనకి, అంతరంగాల ఆవిష్కరణకి ప్రాముఖ్యతనిస్తూ ప్లాట్ డెవలప్‌మెంట్, స్ట్రక్చర్ వంటి శషబిషలు పెద్దగా పెట్టుకోని ఈ తరహా కథల మీద నాకు అంతగా ఆసక్తి లేదు. నాలోని పాఠకుడికి తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి, దాని పోకడల గురించి, మనుషుల మనస్తత్వాల గురించి కథల్లోనే చదివి తెలుసుకోవాలనే కోరిక లేదు. దానికి మరింత ప్రభావశీలమైన దారులు వేరే ఉన్నాయి. మెదడుకి పదును పెట్టే అబ్బుర పరిచే కథలే నాకు కావాలి. కథల్లో పుష్కలంగా ఇమాజినేషన్ ఉండాలి. అందుకోసం ఊహాశక్తే ఊపిరిగా నడిచే జ్ఛట్ఛ ఫిక్షన్‌కు మించినదేది?
 
 దురదృష్టవశాత్తు తెలుగులో ప్రస్తుతం హారర్, క్రైమ్, మిస్టరీ, చారిత్రకం, సాహసం, థ్రిల్లర్, ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ వగైరా విభాగాలకి చెందిన కథలు దాదాపు రావటం లేదు. అడపాదడపా ఏవన్నా వచ్చినా వాటిలో నాణ్యతనాస్తి. ఈ అసంతృప్తి తరచూ స్నేహితులతో పంచుకుంటుండేవాడిని.  ‘ఉత్తినే విమర్శించే బదులు అవేవో నువ్వే రాయొచ్చు కదా’ అన్న వారి సూచనతో, నేను రాయటం మొదలుపెట్టాను.
 - అనిల్ ఎస్. రాయల్
 సైన్స్ ఫిక్షన్ కథా రచయిత
 (కినిగె ఇంటర్వ్యూ నుంచి)  
 
  డైరీ
     మే 30 హైదరాబాద్ త్యాగరాయ గానసభలో మహాకవి శేషేంద్ర 7వ వర్ధంతి సభ. రామా చంద్రమౌళి, అనుమాండ్ల భూమయ్య, కోయి కోటేశ్వరరావు తదితరులు పాల్గొంటారు.
     మే 25  ఆదివారం ఉదయం 10.30 గం.లకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కార్టూనిస్ట్ శేఖర్ సంస్మరణ సభ. నిర్వహణ టి.కొండబాబు - 9490792047
     మే 30 శుక్రవారం సాయంత్రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో యింద్రవెల్లి రమేశ్ - ‘వెల్లడి’ (వచనం మరియు కవిత్వం) ఆవిష్కరణ. అల్లం నారాయణ, ఎ.విద్యాసాగర్, జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొంటారు.
 
 సాక్షి సాహిత్య పేజీ మీద మీ అభిప్రాయాలను సలహాలను సూచనలను రాయండి. సాహిత్యం పేజీలో మీరు కోరుకుంటున్న శీర్షికలను తెలియచేయండి. ఎటువంటి వ్యాసాలను కోరుకుంటున్నారో రాయండి.
 మా చిరునామా: ఎడిటర్
 సాక్షి  రోడ్ నం.1, బంజారా హిల్స్
 హైదరాబాద్.
 సాక్షిలో పుస్తక సమీక్షకు రెండు కాపీలు పంపాలి.
 sakshiliterature@gmail.com

Advertisement
Advertisement