తెలుగువారి ‘హోం’కు ‘వర్క్’ | Sakshi
Sakshi News home page

తెలుగువారి ‘హోం’కు ‘వర్క్’

Published Tue, Oct 29 2013 1:30 AM

తెలుగువారి ‘హోం’కు ‘వర్క్’ - Sakshi

విశ్లేషణ: ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి చూస్తే సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పుడున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా!
 
 సునామీలు, కుంభవృష్టి, పెనుతుపానులు, టార్నా డోలు, టార్పీడోలు వాటికి తెలియకుండానే దిశలూ దిక్కులూ మార్చుకుంటాయి. ఆంధ్రపదేశ్ విభజన ప్రక్రియ కూడా అగమ్యగోచరంగా మారి భిన్నమైన దిక్కులలో ప్రయాణిస్తూ అన్నిటినీ ప్రశ్నార్థకం చేస్తోం ది! ‘విభజన’ ప్రతిపాదనకు ఎలాంటి ప్రత్యామ్నా యాలతో పరిష్కారం వెతకాలా అన్న మీమాంసలో యూపీయే కొట్టుమిట్టాడుతోంది! ఏ పరిష్కారమూ దొరకక చేస్తున్న పని - తల్లినీ తండ్రినీ చంపిన ఓ ప్రబుద్ధుడు ‘అయ్యా నేను తల్లీ తండ్రీ లేనివాణ్ణి, భిక్షపెట్ట’మని అడుక్కున్న ట్టుగా ప్రభుత్వ శాఖలలోని గడప గడపా తిరుగుతోంది! స్వార్ధ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌ను చీల్చడానికి సాహసించిన కాంగ్రెస్ పాలకులు నేడు దిక్కు తోచని ‘కంగారు’ల్లాగా పరుగులు పెడుతున్నారు! సుశీల్ కుమార్ షిండేకు ఆయన హోంశాఖ అధికారులే విచిత్రమైన ‘గమనిక’ను (‘నోట్’ను) సమర్పిం చబోవటం ఈ కంగారులో భాగమే.
 
 ‘నోట్’లో పంచదార!
 ‘హోం’వర్క్ ఫలితంగా మంత్రికి సమర్పించిన ఆ ‘నోట్’లో మూడు ప్రతి పాదనలు ఉన్నాయని తెలుస్తోంది.  ఇందులో విచిత్రమైన ప్రతిపాదన కూడా ఉంది. మొదటి పరిష్కారం ‘తెలంగాణలోని పది జిల్లాలకు తోడుగా స్వచ్ఛం దంగా వచ్చి చేరగోరే ఇతర జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకుని అన్నిం టినీ కలిపి తెలంగాణగానే ఏర్పాటు చేయండి!’ అంటే మొదటి ఎస్‌ఆర్‌సీ (ఫజల్ అలీ), శ్రీకృష్ణ కమిటీల మొదటి ప్రతిపాదన సమైక్యాంధ్రనే హోంశాఖ అభిలషిస్తోందా?! ఈ ‘నోట్’ను ఎవరు తయారు చేశారోగాని సదరు పత్రకా రుడు మహా‘సరసుడే’ కాదు, హోంశాఖలో బహుశా ప్రజలను విభజించి పాలిం చడం తెలియని అజ్ఞాత సమైక్యవాది అయి ఉండాలి! బహుశా రాష్ట్ర మెజారిటీ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ఈ ‘నోట్’ డ్రాఫ్టింగ్ జరిగినట్టుంది. ఈ ‘నోట్’ పిండితార్థాన్ని బట్టి సీమాంధ్రలోని 13 జిల్లాలు కూడా (స్వచ్ఛందంగా చేరగోరే ఇతర జిల్లాలను కూడా కలుపుకుని) తెలంగాణలో చేరడమంటే ఇప్పు డున్న రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడమనేగదా!
 
 పేరు మార్చుకుందాం!
 ఈ సందర్భంగా రాజ్యాంగ పరిశీలకులందరి దృష్టికీ రావలసిన అంశం ఉంది. ఏ కేంద్ర పాలక పక్షం, ఏ‘3’వ అధికరణ ఆధారంగా ఏ తెలుగు జాతిని చీల్చా లని ఉవ్విళ్లూరుతోందో సరిగ్గా అదే అధికరణలోని ‘ఇ’ క్లాజు అవసరాన్ని బట్టి ‘రాష్ట్రం పేరును మార్చకునే’ హక్కును కూడా ప్రసాదించిందని మరచిపోరాదు! అంటే, తెలంగాణ పది జిల్లాలతో పాటు ఎన్ని జిల్లాలు వచ్చి చేరితే అన్ని జిల్లా లూ కలిసిన ‘తెలంగాణ రాష్ర్టం’గా ఏర్పడవచ్చునని బాహాటంగానే ప్రకటించి నట్టయింది! ఆ లెక్కన మిగిలిన 13 జిల్లాలూ, ఆ పది జిల్లాలతోనూ కలిసి వెరసి - అక్షరాలా ‘తెలంగాణ’యే అవుతుందిగదా! నిజానికి యావత్తు రాష్ట్రమూ ‘తెలంగాణ’యే. ‘తెలంగాణ’ అంటే, తెలుగులకు (తెలుగు వారికి) ఆణెము / ఆణియము, అంటే తెలుగు వారు నివసించే చోటు అనీ, ప్రాంతం అనీ, స్థిర నివాసమనీ అనే అర్థం.

 

సుమారు 300 ఏళ్లు సీమాంధ్ర ప్రాంతాలతోపాటు దక్కన్ వరకూ ఏలిన మహమ్మదీయ (ముసల్మాన్) పాలకులు (చరిత్ర జ్ఞాన శూన్యులైన నేటి నేతలకంటె) నాడేతెలివిగా వ్యవహరించారు కాబట్టే ఈ తెలుగు ప్రాంతాన్ని ‘తెలంగాణ’ అని పిలిచారు. (చూ: ఇండియా; ఎ హిస్టరీ ‘గ్రంథంలో జాన్‌కేయి 2000, హార్వర్ కాలిన్స్ పబ్లిషర్స్ ప్రచురించిన దేశ పటం: పేజీ:280)! బహుశా హోంశాఖ ‘నోట్’ కూడా తెలంగాణలో అన్ని జిల్లాలూ (ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్ దట్ కమ్ ఫార్వర్డ్ టు జాయిన్ ఇన్ తెలంగాణ విల్ బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ టు ఫామ్ తెలంగాణ) వచ్చి చేరమని ఆహ్వానం పలికి ఉంటుంది!
 
 అర్థవంతంగా ఉంటుంది!
 రాజ్యాంగంలోని 3వ అధికరణం ‘ఇ’ సెక్షన్ ప్రకారం ‘ఆంధ్రప్రదేశ్’ను కృత్రి మంగా విభజించకుండానే అర్థవంతంగానూ, సహజంగానూ, చారిత్రికంగానూ జాతి-భాషాపరంగానూ సుఖంగా అమరగల ‘తెలంగాణ’ అని పేరు మార్చు కోవచ్చుగదా! దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా తెలుగు రాష్ట్రం ఏర్పడి నప్పుడు - అకారాది క్రమం కోసమని అటు ఇంగ్లీష్ వర్ణమాలకు, ఇటు తెలుగు వర్ణమాలకు సమస్థాయిలో ఉన్న తొలి అక్షరాలతో ‘ఎ’ / ‘ఆ’ ఆంధ్రప్రదేశ్ ఏర్ప డటం శుభదాయకం అనుకున్నారు నాటి పెద్దలు. ఆ ఆశతోనే (ఆంధ్రప్రదేశ్) తప్పు సమాసం అయినా ఎంచుకున్నారు.
 
 ‘ప్రజాప్రతినిధుల’ వేషంలో దేశ, రాష్ట్రాల వివిధ పాలక పక్షాలు, ముఖ్యం గా కాంగ్రెస్ సహా కొన్ని ప్రధాన ప్రతిపక్షాలూ ఇన్నేళ్లుగా భారత రాజ్యాంగ చట్టాన్ని సహితం తమ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని తప్పుడు సవరణలతో పక్కదారులు పట్టించడానికి కూడా వెనుదీయలేదు. వాటిల్లో కొన్ని రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి, బ్రూట్ మెజారిటీ ద్వారా పార్లమెంటును చాటు చేసుకుని నేటి రేపటి పాలక పక్షాల స్వార్థ ప్రయోజనాల కోసం చేసిన సవరణలే! ఈ సవరణలేవీ డాక్టర్ అంబేద్కర్ లేదా తొల్లింటి ముసాయిదా రాజ్యాంగం తలపెట్టినవి కావు! స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పాలకులూ, మతరాజకీయాలను నిరసించిన ఆ రాజ్యాంగ సభ నిర్ణయాలనే అవమానించి ఉల్లంఘిస్తూ వచ్చిన బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలూ, వాటి సంకీర్ణ పాలనా వ్యవస్థలూ రాజ్యాంగాన్ని వక్రమార్గం పట్టిస్తూ రాజ్యాంగం ఫెడరల్ (సమాఖ్య) స్వభావానికీ, దాని ప్రజాహిత స్ఫూర్తికీ బద్ధ విరుద్ధమైన సవరణ చట్టాలూ తీసుకొచ్చారు! వాటిలో నేటి రాష్ట్ర సమస్యకు ప్రత్యక్షంగా సంబంధం కలవి రాజ్యాంగంలోని 3వ, 4వ అధికరణలు.
 
 దేహభక్తే తప్ప దేశభక్తి ఏది!
 కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన 3వ అధికరణ భాషా ప్రయుక్తంగా ఏర్పడిన రాష్ట్రానికి రాజకీయ ప్రయోజనాలు, ఈడేర్చుకోవడానికి ఉద్దేశించింది కాదు కనుకనే ప్రత్యేకంగా మన రాష్ట్రం సుస్థిరత కోసం 371 అధికరణకు ‘డి’ క్లాజు ద్వారా రాజ్యాంగాన్ని సవరణ చట్టం తీసుకొచ్చి, దానికి భాష్యం చెప్పా లన్నా, వ్యతిరేకంగా తీర్పు చెప్పాలన్నా ఒక్క సుప్రీంకోర్టుకు తప్ప, మిగతా ఏ కోర్టుకూ, చివరికి ఉద్యోగాలకు చెందిన మార్పులకూ, ప్రమోషన్లకూ మరే ఇతర సంబంధిత సమస్యలపైనా తీర్పులుగానీ, వ్యాఖ్యానాలు గాని చేసే హక్కు లేకుండా చేసింది! అంటే, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసే హక్కును పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి సంక్రమింపజేస్తున్న 3వ అధికరణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చడానికి వినియోగించే ముందు 371(డి) సవరణ చట్టానికి మూడింట రెండు వంతుల మెజారిటీ ద్వారానే పార్లమెంటుకు, దాని ద్వారా కేంద్ర కేబినెట్‌కూ, సాధ్యమవుతుందిగాని అడ్డదారుల్లో కాదు! పైగా హోంశాఖ చూపిస్తున్న ‘నోట్’లో నేడు వ్యతిరేకులుగా మారి ప్రజల కోసం పదవుల్ని త్యాగం చేయలేని ‘దేహభక్తి’కి తప్ప దేశభక్తికి దూరమైన నాయకులకు తెలియని రెండవ అంశంగా ఉంది. ఆ అంశం నిజానికి రాజ్యాంగంలోని 3వ అధికరణకు సంబంధించి ఇచ్చిన ‘ఒకటవ వివరణ’లోనే ఉంది. ఇది రెండు రకాల భాష్యాలకి అవకాశమిస్తోంది. ఎలా అంటే, 3వ అధికరణలో ‘ఎ’ నుంచి ‘ఇ’ వరకూ ఉన్న క్లాజుల్లో ‘రాష్ట్రం’ అనే పదంలో కేంద్రపాలిత (యూనియన్ టెరిటరీ - యూటీ) ప్రాంతం అనే పదం కూడా చేరి ఉంది!
 
 మిగిలిన సూత్రాలు
 అందుకే, ఇదే అదననుకొని రాజధాని యూటీగా మార్చి క్రమంగా అన్ని హం గుల్నీ కేంద్రం గుప్పిట్లో పెట్టుకోవాలన్నది హోంశాఖ రెండవ సూత్రం! అయితే, జనాన్ని పాలక పక్షాలు గందరగోళపరచడం కోసం చేసిన ప్రయత్నం - మినహాయింపు ‘క్లాజు’ పేరిట ’రాష్ట్రం’ అనే పదంలో ‘కేంద్రపాలిత ప్రాంతం ‘చేరి ఉండగా పేర్కొనడమూ! ఇటీవల కొందరు పార్లమెంటు సభ్యులూ, రాష్ట్ర ప్రజలూ, రాష్ట్రేతర స్థానిక వ్యాపారులూ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ప్రజలూ దశాబ్దాలుగా పెంచి, అభివృద్ధి చేసిన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని ‘కేంద్రపాలిత ప్రాంతం’గానో (యూటీ) లేదా దేశానికి రెండవ రాజధానిగానో ప్రకటించిన తరువాతనే రాష్ర్ట ‘విభజన’ గురించి ఆలోచించాలి గాని అంతకుముందు కాదని ప్రతిపాదించడానికి కారణం 3వ అధికరణంలోని ఈ అయోమయపు ‘వివరణ-1’ కాబట్టి - ఇంతకూ రాజ్యాం గం సాధికార షెడ్యూల్‌కు బద్ధమై మైదాన ప్రాంతాల మోతుబరుల దోపిడీకి గురవుతున్న ఆదివాసీ గిరిజన తెగలు తమ లిపి, ప్రత్యేక సంస్కృతి పరిరక్షణకు విశాఖ, తూర్పుగోదావరి, ఉత్తర తెలంగాణలోని గిరిజన ప్రాంతాలన్నింటినీ విడగొట్టి భద్రాచలం రాజధానిగా మన్య రాష్ట్రం ఏర్పరచాలన్న డిమాండ్‌ను మరి ఎందుకు నిరాకరిస్తున్నట్లు?
 
 అర్థం తెలియకే...
 కాబట్టి మొత్తం తెలుగు జాతి ఉనికినీ, భారతదేశ చరిత్రలో దాని విశిష్టతనూ సంరక్షించి కాపాడుకోవడానికి గాను, ‘ఆంధ్ర’ అనే పదం (తెలుగు అనేది తెలి యక) పట్ల అజ్ఞానంతో కొందరు ‘ఎలర్జీ’ పెంచుకున్నారు. తద్వారా తెలుగు జాతి మూలాలనే నరుక్కోబోయే వారిని కూడా కలుపుకుని వచ్చేందుకు వీలుగా రాష్ట్రాన్ని మొత్తంగానే 3వ అధికరణలోని ‘ఇ’ క్లాజు ప్రకారం ‘తెలంగాణ’ అని గానీ, ‘తెలుగు నాడు’ అని గానీ నామకరణం చేయడానికి ఏ ఆంధ్రుడికీ ఏ తెలుగు వాడికీ అభ్యంతరం ఉండదు. మనసారా ఆహ్వానించి తీరుతాడు!   

Advertisement

తప్పక చదవండి

Advertisement