ఒక గాలిబ్ ఒక దాశరథి | Sakshi
Sakshi News home page

ఒక గాలిబ్ ఒక దాశరథి

Published Sat, Mar 8 2014 1:05 AM

ఒక గాలిబ్ ఒక దాశరథి

పునః జ్ఞాపకం: ఉర్దూ గజల్ కవితా సంప్రదాయంలో రెండు రకాలున్నాయి. ఒకటి హకీకి, రెండోది మజాజీ. హకీకి అంటే దైవభక్తి. గజల్ రచనల్లో హకీకి రకం ఎప్పుడో గాని కనబడదు. ఎక్కువమంది గజల్ కవుల కవిత్వంలో ప్రముఖంగా కనబడేది మజాజీయే. మజాజీ అంటే నాయికా నాయకుల ప్రేమ.
 
 వేదనతో కవితా వేదాలు సృష్టించిన మహాకవి గాలిబ్. ఆయన కవిత్వాన్ని అదే ధాటితో తెనిగించి, తెలుగులో గజల్ సంప్రదాయాన్ని ప్రారంభించిన మహాకవి దాశరథి. గాలిబ్ గీతాల్ని దాశరథి తెలుగులో చేస్తే ఆయనను ఎవరూ అనువాదకుడిలా చూడలేదు. ఒక స్వతంత్ర రచన చేసినవాడిలా గౌరవించారు. అంటే అనుసృజన ఆ స్థాయిలో ఉందని అర్థం చేసుకోవాలి. హైద్రాబాద్ స్టేట్ నిజాం పాలనలో ఉన్నందువల్ల, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాబోధన ఉర్దూలో ప్రారంభం కావడంవల్ల ఇక్కడి ఉర్దూ, హిందీ, తెలుగు, మరికొన్ని భాషా పదాలు కలగలిసి ఒక మిశ్రమ భాష ఏర్పడింది. అదే దక్కన్ ఉర్దూ అయ్యింది. హిందూ ముస్లిం అనే బేధం లేకుండా అందరూ ఉర్దూ భాషా సాహిత్యాన్ని  నెత్తికెత్తుకున్నారు. ఇక్కడి ప్రజలంతా ముషాయిరాలకు మురిసిపోయారు. ఇలాంటి నేపథ్యంలోంచి ఎదిగిన మహాకవి దాశరథి ఉర్దూ కవిత్వాన్ని తెలుగులోకి తేవడానికి నడుం బిగించారు. అందులో ‘గాలిబ్ గీతాలు’ ఒక అద్భుతమైన అనువాదం.
 ‘గజల్’ అంటే అసలైన శృంగారాత్మక భావ కవిత. గజల్ రాసేవారికి ముఖ్యంగా కల్పనాశక్తి, అనుభూతులు, ఊహలు అవసరమౌతాయి. వాటికి కొంత వ్యంగ్యం, కొంత రహస్యం, శృంగార భావన, భావోద్వేగం జోడిస్తే అది అద్భుతమైన గజల్‌గా రూపుదిద్దుకుంటుంది.  
 గాలిబ్ రచనల్లో మానవ జీవితాన్ని ప్రతిబించించే గీతాలెన్నో ఉన్నాయి. కానీ ప్రేమకు, ప్రేయసికి, విరహానికి సంబంధించిన కొన్ని గీతాల్ని మాత్రమే ఎన్నుకుని, దాశరథి తెలుగు చేశారు. మీర్జా గాలిబ్ వాడే సాధారణ శబ్దాలు, సాధారణార్థాన్ని దాటి విస్తృతార్థాన్నిస్తాయి. ‘కరెన్సీ నోటు సాధారణమైన కాగితంతో చేయబడినదైనా, సాధారణమైన కాగితంకన్నా అనేక రెట్లు విలువెక్కువ. అలాగే గాలిబ్ కవిత్వం!’ అని దాశరథి చమత్కరించారు. ‘గాయాలను పూలుగా మార్చుకుని నవ్వుతూ వధ్యశిలకు వెళతాను’ అని అంటాడొక షేర్‌లో గాలిబ్. లోకంలో సుఖదుఃఖాలుంటాయిగానీ, తనకు ఆ దేవుడు సుఖాలెన్నడూ ఇవ్వలేదట. ఆయన ఆక్షేపణ దాశరథి తెలుగు అక్షరాల్లో ఈ విధంగా వచ్చింది.
 లోకమున సుఖము శోకమ్ము కలవండ్రు
 శోకమొకటె ఇచ్చె నాకు బ్రహ్మ
 సాధారణంగా కవులు పగటిని జీవితంతోనూ, రాత్రిని మృత్యువుతోనూ పోలుస్తారు. కానీ ఇక్కడ గాలిబ్ ప్రత్యేకత ఏమిటంటే వేకువనే మృత్యువంటాడు.
 వెతలు పోద్రోలు మందేది, మృతియెగాక?
 ఉదయమగుదాక దివ్వె వెల్గొందవలయు
 ఉదయమనే చావు వచ్చేవరకు, రాత్రి మొత్తం జీవితజ్యోతి ఎలాగో దుఃఖం సహిస్తూ వెలగాల్సిందే. జీవితం విషాద సాగరంలో మునుగుతున్నప్పుడు కవిత్వంలో కూడా విషాదం, నిరాశ చోటుచేసుకున్నాయి. కానీ అది మరిచేందుకు గాలిబ్ ఎప్పుడూ ఊహల్లో విహరించలేదు. స్వర్గం గురించి కలలు కనలేదు.
 స్వర్గమును గూర్చి నాకు సర్వమ్ము తెలియు
 మనసు సంతస పడుటకు మంచి ఊహ
 విరహబాధ వల్ల ఏర్పడిన గాయం బాగుపడడానికి శస్త్ర చికిత్స చేయించుకోబోతే.. కత్తి సైతం గుండె వ్రణాన్ని చూసి, నెత్తుటి కన్నీరు కార్చిందట! ప్రియురాలు మాత్రం కరగలేదట!! అబ్బా ఎంత బాధ? పాఠకుని గుండె నిజంగా గాయపడుతుంది.
 శస్త్ర వైద్యు కత్తి సైతము రక్తాశ్రు
 కణములొలికె, నీవు కరగలేమె?
 మరొక షేర్‌లో ‘ఓరి భగవంతుడా! ఇన్ని బాధలిచ్చి అనుభవించడానికి ఒక్క హృదయమే ఇచ్చావు. ఓ పది ఇవ్వలేక పోయావా?’ అని వాపోతాడు గాలిబ్.
 నన్ను గూర్చి వార్త నాకె అందనిచోట
 నేను వాసముండినాను నేడు-
 బాధను, దౌర్భాగ్యాన్ని, ఒంటరి తనాన్ని ఇంతకంటే బాగా ఏ కవీ చెప్పలేడేమో! పాఠకునికి అతని దీనస్థితి కళ్ళకు కనిపిస్తుంది.
 ‘నా రోదనము నిన్ను చేరినంతటనె
 మారిపోవును గదే మధురగానముగ’
 ‘కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి
 ఇంతి కెవ్వడసువు లీయకుండు?’
 ‘ప్రళయ ముండెగాని తలపనద్ది వియోగ
 రాత్రికన్న దుర్భరమ్ముగాదు’
 ఈ కవితలు చాలు గాలిబ్ వేదనను అర్థం చేసుకోవడానికి. ఈ వేదనని అనువదించిన దాశరథి అనువాద శైలిని పరిశీలించడానికి.
 వెతలు మైదానమున వేరు గతియె లేదు
 బాష్పవారి ధారాసిక్త పధముగాక!
 వెతల మైదానములో ప్రయాణించువానికి కన్నీళ్ళలో తడిసిన దారితప్ప వేరే లేదు అని చెప్పాడు. మరోచోట కన్నీళ్ళను దారంవలె వర్ణించాడు.
 నాదు గుండె గాయము కట్టు సూదికంట
 అశ్రు జలధార దారమై అవతరించె
 గుండె గాయం పెద్దదై, మృత్యువు రాకుండా కుట్టడానికి కన్నీళ్ళు సూదికి సూత్రంగా మారుతాయట. ఈ చరణాలు మనసును కరిగించేవిగా ఉన్నాయి.
 నీటి చుక్క ముత్తెమౌట వర్ణించెను
 కనులలోన నిలువగలిగె తాను
 నీటి చుక్క ముత్యమై హారంలో చేరిపోవడం కన్నా, సర్వేంద్రియాలలో ప్రధానమైన నయన సింహాసనంపై కూర్చుని మెరవడం గొప్ప అదృష్టం. ముత్యంకన్నా కన్నీటికి గొప్ప స్థానం కలిగించాడు గాలిబ్. ఇదో గొప్ప కల్పన. మరొకటి అలాంటిదే-
 మొర పెట్టుకొనుటకై స్వరతాళములు లేవు
 కన్నీటి పాటలో గణయతులు కనరావు
 తెలుగు జాతికి ‘గాలిబ్ గీతాల్ని’ అందించిన దాశరథిని తెలుగు లోకం ప్రశంసించింది. ఆ పుస్తకానికి బొమ్మలు గీసిన బాపు చిత్రాలు సార్థకమయ్యాయి. మహాకవి గాలిబ్ రచనల వల్ల కవులు, చిత్రకారులు, గాయకులు, సంగీతకారులు, చరిత్రకారులు ఎందరో ఎన్నో రకాలుగా ఉత్తేజితులయ్యారు.
 - డాక్టర్ దేవరాజు మహారాజు

Advertisement
Advertisement