పోలవరం.. వ్వాట్ ప్రాజెక్ట్! | Sakshi
Sakshi News home page

పోలవరం.. వ్వాట్ ప్రాజెక్ట్!

Published Sat, Dec 19 2015 9:33 AM

పోలవరం.. వ్వాట్ ప్రాజెక్ట్! - Sakshi

పార్లమెంటులో ఏం జరిగింది- 42
 
తెలంగాణ ప్రక్రియ ప్రారంభమయ్యిందంటూ చిదంబరం చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిం చింది. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు లగడపాటి రాజగోపాల్ ప్రకటిం  చడం, హైదరాబాద్ అసెంబ్లీలో సీమాంధ్ర శాసనసభ్యులందరూ పార్టీలకతీతంగా స్పీకర్ ఆఫీస్ ముందు క్యూలో నిలబడి రాజీనామాలు అందచేయడం టీవీలన్నింటిలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

లోక్‌సభలో తెలుగుదేశం, కాంగ్రెస్ సభ్యులు కొందరు విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ‘వెల్’ లోకి వచ్చేశారు. సభ వాయిదా పడింది. సభలోంచి బైటకొస్తూ సోనియాగాంధీ నా వైపు చూశారు. సభలోంచి బైటకెళ్లటానికి ఆవిడ ఉపయోగించే ద్వారం మొదటిది. మంత్రులూ, ప్రధాని తదితరులు వాడేది రెండో ద్వారం.

నేను వాడేది మూడవది. ఎప్పుడైతే ఆమె నావైపు చూస్తూ బైటకెళ్లారో, నేనూ మూడోద్వారం నుంచి బైటకొచ్చి నిలబడ్డాను. అన్ని ద్వారాలూ ఇన్నర్ లాబీలోకే దారితీస్తాయి. ఆవిడ తన పార్లమెంటరీ పార్టీ రూంకి వెళ్తూ నన్ను రమ్మని సంజ్ఞ చేశారు! నేను ఆమె పక్కగా నడుస్తూ నమస్కారం పెట్టాను. ‘‘ఏమిటిది’’ అని సూటిగా ప్రశ్నించారు.


 ‘‘తెలంగాణా విషయమై చిదంబరం చేసిన ఏకపక్ష ప్రకటన.. కోస్తా, రాయలసీమ ప్రజల ఆగ్రహమది’’ అన్నాను.
 ‘‘ఏకపక్ష ప్రకటన ఎలాగౌతుంది’’ అని అడిగారు.
 ‘‘తెలంగాణ ప్రక్రియ ప్రారంభమయ్యింది అని చిదంబరం ప్రకటించారు. అది ఏకపక్షమే గదా. కోస్తా, రాయలసీమ వారెవ్వరితోనూ సంప్రదించలేదుగా’’ అన్నాను.
 ‘‘అసెంబ్లీ తీర్మానం కావాలని కూడా ఆ ప్రకటనలో ఉంది గదా అసెంబ్లీలో అన్ని ప్రాంతాల వారూ ఉంటారు గదా’’ అన్నారు ఆమె.
 ‘‘కె.సి.ఆర్ నిరాహార దీక్షతో ఇక్కడా అక్కడా తెలంగాణ నాయకుల హడావుడి. తెలంగాణా ఇచ్చేసినట్లే అందరూ అనుకుంటున్నారు’’ అన్నాను.
 ‘‘అందరూ అనుకుంటున్నారు. మీరు కూడా అనుకుంటే ఎలా.. అసెంబ్లీ తీర్మానంతో తెలంగాణ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టంగా ఆ ప్రకటనలో ఉన్నా మన పార్టీ వాళ్లే సభను అడ్డుకుంటే ఎలా?’’ అన్నారు.
 ‘‘కోస్తా రాయలసీమలో మూడ్ చాలా తీవ్రంగా ఉంది మేడమ్. కనీసం ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కూడా ప్రకటించి ఉంటే కొంత బాగుండేదేమో’’ అన్నాను.
 

ఇప్పటిదాకా ఆమెతోపాటు నడుస్తూనే మాట్లాడుతున్నాను. సెంట్రల్ హాల్‌లోకి సరిగ్గా ప్రవేశిస్తున్నప్పుడు, ఈ మాట అన్నాను. ఎందుకన్నానో, అకస్మాత్తుగా పోలవరం సబ్జెక్టు అప్పుడెందుకు అనాలని పించిందో.. తలుచుకుంటే, ఇప్పటికీ అర్థం కాదు.
 సడన్‌గా ఆగిపోయిందామె. ‘‘ఏంటది.. ఏమన్నావు?’’ అంటూ ప్రశ్నార్థకంగా నావైపు చూశారు.
 ‘‘పోలవరం మేడమ్.. గోదావరి ప్రాజెక్టు’’ అన్నాను.
 ‘‘వ్వాట్ ప్రాజెక్ట్’’ అని మళ్లీ అడిగారు. ఆవిడ ఆగిపోవడంతో సెక్యూరిటీ వారు, కొందరు కాంగ్రెస్ ఎంపీలు నిలబడిపోయారు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి ‘‘ఏం ప్రాజెక్టు అన్నావు’’ అని ప్రశ్నిస్తూ మళ్లీ లోక్‌సభ లాబీ వైపుకు నడవసాగారు.
 ‘‘అదే మేడమ్. పోలవరం ఇందిరా సాగర్ ప్రాజెక్ట్, గోదావరి మీద కడుతున్న రిజర్వాయర్ ప్రాజెక్ట్’’ అన్నాను. ‘‘మొన్న మీరు వచ్చారు కూడా’’ అన్నాను.

అప్పటికే ఆమె లోక్‌సభ ఇన్నర్ లాబీలోకి వచ్చేసి ఒక సోఫా మీద కూర్చుండిపోయారు. అక్కడికి సెక్యూరిటీని అనుమతించరు. వాళ్లు ఔటర్ లాబీలోనే ఆగిపోయారు. మేడమ్ వెనుక నడుస్తూ వచ్చిన కాంగ్రెస్ ఎంపీలు కూడా, ఇదేదో సీరియస్ విషయమని దూరంగా నిలబడిపోయా రు. నన్ను తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోమన్నారు సోనియా గాంధీ. ‘‘ఇప్పుడు చెప్పు. పోలవరం కడుతున్నారుగా. దానికీ తెలంగాణా ప్రక్రియకీ ఏమిటి సంబంధం’’ అన్నారావిడ. ‘‘పోలవరం జాతీయ ప్రాజె క్టుగా ప్రకటించమని ఎప్పట్నుంచో కోరుతున్నాం. కోస్తా, రాయలసీమ ప్రజల స్వప్నమది. ఈ ప్రకటనతోపాటు ఆ ప్రకటన కూడా చేసి ఉంటే ఇంత టెన్షన్ ఉండేది కాదే మోనని నా అభిప్రాయం. అదే మీకు చెప్పాను’’ అన్నాను.
 

‘‘పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ఉంటే తెలంగాణా ప్రకటన మీద వ్యతిరేకత ఉండదా’’ అని ప్రశ్నించారు.
‘‘తెలంగాణ విషయంలో మా ప్రధాన అభ్యంతరం, హైదరాబాద్ నగరం. అయినా అందరితో మాట్లాడ టానికి రోశయ్య కమిటీ వేసి, అందరి అభిప్రాయాలూ తీసుకోకుం డానే, ఈ ప్రకటన రావడంతో సహజంగానే వ్యతిరేకత వ్యక్తమౌతుంది’’ అన్నాను.
ఈలోగా లోక్‌సభ నుంచి జలవనరుల మంత్రి పవన్ కుమార్ బన్సల్ బైటకొస్తు న్నారు. ఆయన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కూడా. ఆయన బైటకి రావడం సోనియాగాంధీ చూశారు. ‘‘వెళ్లి బన్సల్‌జీని పిలు’’ అన్నారు. నేను వడివడిగా బన్సల్‌జీ దగ్గరకు వెళ్లి ‘‘మేడమ్ పిలుస్తున్నారు’’ అని చెప్పాను.

సభ వాయిదా పడగానే బైటకెళ్లిపోయిన సోనియాజీ ఇంకా అక్కడే కూర్చున్నారని ఆయన అనుకోలేదు. నావైపు ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఎవరు పిలుస్తున్నారు?’’ అన్నారు. నేను అక్కడే కూర్చున్న మేడంని చూపించాను. వెంటనే ఆయన మేడమ్ దగ్గరకి చేరుకున్నారు. కూర్చో మని సౌంజ్ఞ చేసిన సోనియాజీ ‘‘పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించే ఆలోచన ఉందా’’ అని ప్రశ్నించారు. అప్పటికే అనేకసార్లు పోలవరం గురించి తెలుగు ఎంపీలతో చర్చించి ఉన్న బన్సల్‌కి వెంటనే విషయం అర్థమైంది. ‘‘హైపవర్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ ఆగస్టులోనే పోలవరం ప్రాజెక్టును క్లియర్ చేసింది. ఇక కేబినెట్‌లో పెట్టి నిర్ణయం తీసుకోవడమే’’ అన్నారాయన. ‘‘అదే విషయం అరుణ్ కుమార్‌కి కమ్యూనికేట్ చెయ్యండి.

కోస్తా, సీమ నాయకులకు ఆతను తెలియచేస్తాడు’’ అంటూ సోఫాలోంచి లేచి వెళ్లిపోయారు. నేనూ బన్సల్ లాబీలోనే నిలబడిపోయాం. నాలుగడుగులు వేసిన సోనియాగాంధీ, వెనక్కి తిరిగి నన్ను మళ్లీ పిలిచారు. ‘‘కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదని మానిఫెస్టోలో ప్రకటించింది. ఇందాకా నువ్వు అన్నావే, ఎవ్వరితో సంప్రదించకుండా చిదంబరం తెలంగాణ ప్రకటించేశారని, అసెంబ్లీ తీర్మానం అడగటం అంటేనే అసెంబ్లీతో సంప్రదించటం... రాష్ట్రంలో అసెంబ్లీకన్నా ఉన్నతమైన వేదిక మరొకటుందా? బన్సల్‌జీతో పోలవరం విషయమై కమిట్‌మెంట్ తీసుకో’’ అని చెప్పి వెళ్లిపోయారు.

అప్పటికప్పుడు, లోక్‌సభకు ఆనుకుని ఉండే పవన్‌కుమార్ బన్సల్ ఆఫీసులో, పోలవరం మీద పరిస్థితి తెలియచేస్తూ, ఒక ఉత్తరం తయారయిపోయింది. నేను సోనియాగాంధీ గారికి పోలవరం విషయమై ఒక ఉత్తరం రాసినట్లు, ఆమె ఆ ఉత్తరాన్ని బన్సల్‌కి పంపినట్లు, దానికి సమాధానంగా బన్సల్ నాకు రిప్లై ఇచ్చినట్లు రికార్డు తయారైపోయింది. నేను సోనియాగాంధీ గారికి రాసిన ఉత్తరం, బన్సల్ గారు నాకు సమాధానం ఇచ్చిన ఉత్తరం రెండింటి మీదా తేదీ 10-12-2009.

పోలవరం ప్రాజెక్టును 20-2-2009 నాడు టెక్నికల్ ఎడ్వయిజరీ కమిటీ క్లియర్ చేసిందని, ప్లానింగ్ కమిషన్ రూ. 10,151.04 కోట్ల అంచనాలతో 25-02-2009 నాడు క్లియరెన్స్ ఇచ్చిందని, నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించే హైపవర్ కమిటీ 6-8-2009న క్లియర్ చేసిందని, విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రతిపాదన రాగానే కేబినెట్ ముందుపెట్టి పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటింపచేయటమే మిగిలి ఉందని.. బన్సల్ లేఖ సారాంశం.

(రాజశేఖరరెడ్డి గారు జీవించి ఉండగానే పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే రంగమంతా సిద్ధం చేసేశారు. ఆయన హఠాత్తుగా అంతర్ధానమవ్వకుండా ఉండివుంటే ఈ పాటికి, కచ్చితంగా పోలవరం పూర్తయిఉండేదని నా నమ్మకం.)
 సోనియాగాంధీ గారి ఆదేశాల మేరకు అప్పటికప్పుడు రిప్లై ఇచ్చేసిన బన్సల్ గారి ఆఫీసు నుంచి 2-6-2010 నాడు నా ఉత్తరానికి సమాధానం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్పమొయిలీ గారికి చేరింది. మొయిలీగారు, సోనియాగాంధీగారికి అరుణ్‌కుమార్ రాసిన ఉత్తరానికి సంబంధిత మంత్రి బన్సల్ గారిచ్చిన సమాధానం 15-6-2010న నాకు పంపించారు.
 త్రూ ప్రాపర్ ఛానల్ అంటే, 7 నెలలు పడ్తుందన్నమాట!
 
 ఉండవల్లి అరుణ్‌కుమార్
 వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు.a_vundavalli@yahoo.com
 

Advertisement
Advertisement