పునఃసమీక్ష తక్షణ అవసరం | Sakshi
Sakshi News home page

పునఃసమీక్ష తక్షణ అవసరం

Published Mon, Jan 26 2015 2:12 AM

వడ్డే శోభనాద్రీశ్వరరావు - Sakshi

విశ్లేషణ
 మండు వేసవిలోనూ పచ్చగా కనువిందు చేసే భూములను సమీకరించి రాజధానిని నిర్మిస్తామనీ, రైతుల వాటాకు వచ్చే భూమి కోట్లు పలుకుతుందనీ చంద్రబాబు ప్రభుత్వం అంటోంది. లక్ష ఎకరాల భూమి అభివృద్ధికి యాభై నుంచి వంద ఏళ్లయినా పడుతుంది. రాజధాని ఆకారం వచ్చేసరికే 20 ఏళ్లు దాటుతుంది. నాలుగు ప్రభుత్వాలు మారి, వాటి ప్రాధాన్యాలు మారితే? అన్నీ జరుగుతాయనే నమ్మకం ప్రభుత్వానికే ఉంటే.. ఎవరూ కొనకపోతే తామే ఎకరాను రెండు కోట్లకు కొంటామని హామీ ఎందుకు ఇవ్వదు?
 
 నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేసి, అన్ని జిల్లాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించినప్పుడు కొద్ది మంది మినహా అంతా హర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లోనే రాష్ట్ర అభివృద్ధి అంతా కేం ద్రీకృతమైంది. దాని పర్యవసానంగానే రాష్ట్ర విభజన జరిగిందనేది విస్మరిం చరాని కఠోర వాస్తవం. అందుకే నవ్యాంధ్రలో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రకట నకు సార్వత్రిక హర్షం వ్యక్తమైంది. జిల్లాల వారీగా ఏయే జిల్లాల్లో ఏయే అభి వృద్ధి పథకాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నదో కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ఆలోచనా ధోరణి పూర్తిగా విరుద్ధంగా సాగుతోంది. హైదరాబాద్‌లోలాగే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లోనే మొత్తం అభివృద్ధిని కేంద్రీకృతం చేసే పంథాను అనుసరిస్తున్నట్టు అనిపిస్తోంది. 52,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధానిని ఏర్పాటు చేసి, ఆ తదు పరి లక్షా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని లక్ష ఎకరాలకు విస్తరింప చేస్తామంటున్నారు. తొలిదశలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 29 గ్రామాల నుంచి పట్టా భూములు సహా 30 వేల ఎకరాల ను సమీకరిస్తామంటున్నారు.

 బంగారు పంటల జరీబు భూముల సేకరణా?
 రాజధాని కోసం కృష్ణానది కరకట్టకు ఆనుకుని ఉండి, ఏడాదికి మూడు లేక నాలుగు పంటలు పండే అత్యంత సారవంతమైన జరీబు భూములే, రైతులు వ్యతిరేకిస్తున్నా ఎందుకు కావాలి? భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి, మం డు వేసవిలో కూడా పచ్చదనంతో కనువిందు చేసే ఆ ప్రాంతంలో దాదాపు వంద రకాల పంటలు పండిస్తారు. ఎకరాకు రూ.75,000 నుంచి లక్షన్నరకు పైగా ఆదాయం లభిస్తుంది. అదే ప్రాంతం లోని తాడేపల్లి, పెనుమాక గ్రామా లలో భూసేకరణకు ‘ఉడా’ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు కోసం లోగడ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆందోళన జరిపారు. నేడు ఆయనే బోరుపాలెం నుండి ఉండవల్లి వరకు కృష్ణా కరకట్టకు ఆనుకుని ఉన్న గ్రామాల జరీబు భూముల సమీకరణకు దిగారు. భూసేకరణ/సమీకరణకు పూనుకున్నారు.

 తుళ్లూరు పరిసరాలలో ఉన్న మెట్ట భూములు, తరచుగా కొండవీటి వాగు ముంపునకు గురయ్యే భూములు. వాటిని ఇచ్చేందుకు రైతులు సుము ఖమే. వారి నుంచి గరిష్టంగా 20 వేల ఎకరాలు సేకరించి అధునాతన రాజధా నిని నిర్మించుకోవచ్చు. 15వేల ఎకరాలలో ఏర్పాటైన చండీగఢ్ రాజధానిలో... అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాలు మున్నగు నవి ఉండే ‘‘కోర్ క్యాపిటల్’’/‘‘క్యాపిటల్ కాంప్లెక్స్’’  విస్తీర్ణం 500 నుండి 750 ఎకరాలు మాత్రమే. నవ్యాంధ్ర రాజధాని కోర్ క్యాపిటల్ విస్తీర్ణం 2,000 ఎకరాలని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి 50 వేలు లేదా లక్ష ఎకరాలు ఎందుకు? గాంధీనగర్, నయా రాయ్‌పూర్‌లలో ‘‘సోషల్ లైఫ్’’ లేదని ఆయన వాదన.  విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్నది ‘‘సామాజిక జీవనం’’ కాదా? స్టార్ హోటల్స్, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి సామాన్యు లకు అందుబాటులో ఉండే సదుపాయాలు కూడా విరివిగా ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు తదితర విద్యాసంస్థలున్నాయి. రెండు నగరా ల విస్తీర్ణం మొత్తం 28,500 ఎకరాలు. అంతకన్నా పెద్ద రాజధాని ఎందుకు?  

 సమస్యను పక్కదారి పట్టించడం తగదు?
 ‘క్రీడా’ (క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) బిల్లుపై శాసనసభ చర్చలో దాదాపు అన్ని పక్షాలు తుళ్లూరు ప్రాంతంలో రాజధానికి తాము వ్యతిరేకులం కాదని స్పష్టం చేశారు. కాకపోతే 50 వేలు లేదా లక్ష ఎకరాల విస్తీ ర్ణం అవసరమా? అని నిలదీశారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని, దాని పారదర్శకత లేని నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. దీనిని తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించడమేనని ప్రభుత్వం వక్రీకరిం చడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. భారీగా సేకరిస్తామంటున్న భూమి ని ఏఏ అవసరాలకు, ఎంతెంత, ఎవరెవరికి కేటాయిస్తారో చెప్పడం లేదు. వాటిని విదేశీ లేక స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారడాన్ని రైతాంగం సహించదు.

 లక్ష కోట్ల రూపాయలు ఎలా వస్తాయి?
 ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని విభజన చట్టం పేర్కొంది. కానీ రాజధాని కోసం ఉత్తరాఖండ్‌కు రూ. 460 కోట్లు, జార్ఖండ్‌కు రూ. 800 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.600 కోట్లు మాత్రమే కేంద్రం అందించింది. ఏపీకి ‘‘ప్రత్యేక హోదా’’పై విభజన చట్టంలోని హామీ అమలు కే ఇతర రాష్ట్రాల అంగీకారం తప్పనిసరని కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. అంటే ఆ ఆశ లూ లేనట్టే. ఈ నేపథ్యంలో లక్షా 26 వేల కోట్ల రూపాయలు ఎలా సమకూరుతాయి? ఎలా ఖర్చు చేస్తారు?  సీఎం తొలి సంతకం చేసిన ‘రుణమాఫీ’ అమలే ఇంకా కాగితాల మీద ఉంది. ఇలాంటి స్థితిలో సింగపూర్‌ను మించిన రాజధాని నిర్మాణానికి అవరోధాలు ఏర్పడితే భూము లు కోల్పోయిన రైతుల పరిస్థితి ఏం కావాలి? 2008 నుంచి మొదలైన నయా రాయ్‌పూర్ నిర్మాణం పూర్తికావడానికి ఇంకా కనీసం 6 ఏళ్లు పట్టొచ్చు. 2000లో ఏర్పడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్ర పాలన  డెహ్రాడూన్ నుంచే సాగుతోంది. మన రాజధాని నిర్మాణం కూడా ఇలా దీర్ఘకాలం సాగి, అప్పటికి అధికారం లోకి వచ్చే ప్రభుత్వాల ప్రాధాన్యాలు మారితే? ఇప్పుడు వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న రైతులు, కౌలు రైతులు, కూలీలు తదితర గ్రామీణ ప్రజలు వలస కూలీలుగా, దిన కూలీలుగా నగరాల బాట పట్టక తప్పుతుం దా? అందువల్లనేగా ఈ భూ సేకరణను అత్యధిక  రైతాంగం వ్యతిరేకిస్తున్నది?

 రాజధానిపై ‘శివరామకృష్ణన్ కమిటీ’ నివేదిక కొన్ని ఉపయోగకరమైన సూచనలను చేసింది. వాటిపై అన్నివర్గాలతో చర్చించకుండానే గత అక్టోబర్ లో ‘ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ను (ఈ.ఓ.ఐ) ప్రకటించి, నవంబర్ మొదటి వారానికి సింగపూర్ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుని, రాజధానికి మాస్టర్ ప్లాన్ బాధ్యతను అప్పజెప్పేశారు! ఏ కారణాలతో, ఏ షరతులపై సింగపూర్ సంస్థకు ఆ పని పురమాయించారు? ఇవే కాదు, మెకెన్సీ సంస్థ రిపోర్టునూ బహిర్గతం చేయలేదు. దరిమిలా జపాన్ సంస్థలతో అవగాహన కుదుర్చుకున్నారు. అంతా గోప్యమే. కాబట్టే అన్నీ ఇనుమానాలే. ‘‘బూర్జ్ దుబాయ్’’ నిర్మాణంలో పాల్గొన్న భారతీయ సంస్థలుండగా, టెండర్ ప్రక్రియ లేకుండా హడావుడిగా సింగపూర్, జపాన్ సంస్థలతో ఒప్పందాలు ఎందుకు? ఆగమేఘాల మీద భూసమీకరణకు దిగడం ఏమిటి?  

 లాండ్ పూలింగ్ రైతుకు లాభమా?
 ‘‘రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్‌మెంట్ చట్టం 2013’’ ప్రకారం భూ యజమానులకు న్యాయమైన నష్టపరిహారం పొందు హక్కు లభించింది. నీటి వసతి కల భూములను సేకరించరాదు, నిర్వాసితులకు గృహనిర్మాణం, మౌలిక వసతుల కల్పన, కుటుంబాలకు  పరిహారం, 20 ఏళ్ల భృతి వంటి పలు ప్రయోజనాలకు ఆ చట్టం హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు మార్కెట్ విలువకు 4 నుంచి 5 రెట్లు నష్టపరిహారమే గాక, 20 శాతం అభివృద్ధి చేసిన భూమిని  కోరుకునే హక్కును రైతులకు ఇచ్చింది. ఈ వాస్తవాలను దాచిపెట్టి భూసేకరణ కన్నా, భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) వల్లనే రైతులకు అధిక ప్రయోజనమని ప్రభుత్వ వర్గాలు మోసపూరిత ప్రచారం చేశాయి. అమాయక రైతులు కొందరు అందుకే అంగీకార పత్రాలు ఇచ్చారు. అయినా, రెండున్నర మాసాలుగా మంత్రులు, అధికార యంత్రాం గం ఎంతగా ప్రయత్నించినా అది 3,600 ఎకరాలకు మించలేదు.

 2013 చట్టం ప్రకారం సేకరించిన భూమిని సదరు పనికి 5 ఏళ్ల లోపు ఉపయోగించకపోతే తిరిగి సొంతదారుల వశం అవుతుంది.  2014 సీఆర్‌డీఏ చట్టం వల్ల రైతులకు తక్కువ పరిహారం లభించడమే కాదు, మిగతా ప్రయోజ నాలు చాలా వరకు కోల్పోతారు. రైతు నుండి తీసుకున్న భూమిపైనే బ్యాం కుల నుంచి రుణాలు తీసుకుని, దాన్ని డెవలప్ చేసి రైతుల దగ్గరు నుంచి డెవలప్‌మెంట్ చార్జీలు రాబడతారు. సీఆర్‌డీఏ ల్యాండ్ పూలింగ్ విధానం 2013 భూసేకరణ చట్టానికి, రాజ్యాంగంలోని 300-ఏ అధికరణకు పూర్తి విరుద్ధం. సమీకరిస్తామంటున్న లక్ష ఎకరాల భూమి అభివృద్ధికి 50 నుంచి వందేళ్లైనా కావాలి. రాజధాని ఆకారం రావడానికే కనీసం 20 ఏళ్లు పడుతుంది. నాలుగు ప్రభుత్వాలు మారి, వాటి ప్రాధాన్యాలు మారితే? కాదు, అంతా అనుకున్నట్లు జరిగినా వాణిజ్య ప్రాంతంలో కేటాయించే ప్లాట్లకు మాత్రమే విలువ పెరుగుతుంది. రైతుల వాటాకు వచ్చే భూముల విలువ కోట్ల రూపాయలు పలుకుతుందంటున్న ప్రభుత్వం... ఎవరూ కొనని పక్షంలో తామే ఎకరాకు రూ. 2 కోట్లు చెల్లించి కొంటామనే హామీని మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కృష్ణా కరకట్టను ఆనుకుని ఉన్న పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసే ఆలోచనకు స్వస్తి చెప్పాలి. అమరావతి, ధరణికోట వైకుంఠపురం ప్రాంతాల్లో,  భవాని ఐలాండ్, కొండపల్లి ఖిల్లా, కనకదుర్గమ్మ గుడి, మంగళగిరి పానకాల స్వామి, ఉండవల్లి గుహలు మొదలైన ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తే రైతులు న్యాయస్థానాల ద్వారా తమ న్యాయమైన హక్కులను పరిరక్షించుకోవాల్సి వస్తుంది.
     (వ్యాసకర్త, మాజీ మంత్రి, వ్యవసాయ రంగ నిపుణులు)

Advertisement
Advertisement