ఆకలి కేకలు.. ఆశల సౌధాలు | Sakshi
Sakshi News home page

ఆకలి కేకలు.. ఆశల సౌధాలు

Published Wed, Feb 4 2015 1:10 AM

ఆకలి కేకలు.. ఆశల సౌధాలు

వందల అంతస్తుల భవనాలతో విశ్వనగరాలు సిద్ధమయ్యేసరికి వాటిలో నివసించడానికి మనుషులంటూ ఉండాలని ఏలినవారు ఎందుకు మరచిపోతున్నారు? సచివాలయం తరలింపునకు కారణం వాస్తు దోషమేనని ప్రభుత్వమే చెబుతోంది. వాస్తు వంటి నమ్మకాలు వ్యక్తిగతం కావాలే తప్ప, వాటిని రాష్ర్టంపై రుద్దడం సరికాదు. కేసీఆర్ వ్యక్తిగతంగా ఎన్ని మొక్కులైనా మొక్కుకోవచ్చు, సొంత డబ్బుతోనో, పార్టీ నిధులతోనో తీర్చుకోవచ్చు. అంతేగానీ ఏలికల వ్యక్తిగత విశ్వాసాల కోసం, విలాసాల కోసం ప్రజాధనం వెచ్చిస్తామంటే కుదరదు.
 
 ‘‘తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లా భవిష్యత్తు’’ అన్న అంశం పై ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో పౌరహక్కుల నేత ప్రొఫె సర్ హరగోపాల్ మాట్లాడుతూ విలువలేని మెటల్ లాంటి తెలంగాణ కాదు, మనిషి మనిషిగా బ్రతికే రాష్ర్టం కావాలని అన్నారు. బంగారు తెలంగాణ అనే భావజాలంలోనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకోవాలంటే ముందుగా సమస్యల జాబితా తయారు చేసుకోవాలని అన్నారు. అయితే అదేమంత తేలికైన విషయం కాదని, ఎంతో జాగ్రత్తగా ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఆ సదస్సులో మాట్లాడిన పెద్దలంతా తెలంగాణ రాష్ర్ట సాధన ఆకాంక్షను తమ ఉచ్ఛ్వాసనిశ్వాసాల్లో నిండుగా నింపుకున్న వారే. అదే రోజున, అదే సమ యంలో హైదరాబాద్‌లోనే మరో చోట ‘‘తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేం ద్రం,’’ జన విజ్ఞాన  వేదికతో కలసి ‘‘శాస్త్రీయత - అశాస్త్రీయత’’ అన్న అం శంపై ఏర్పాటు చేసిన సదస్సులో జస్టిస్ చంద్రకుమార్ తదితర పెద్దలు... ప్రభుత్వం తరఫున మొక్కులు తీరుస్తామనడం, వాస్తు పేరిట కోట్ల రూపా యల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తామనడం సరికాదని వ్యాఖ్యానించారు.
 
 వృద్ధుల వ్యథలతోనే కలల సాకారమా?   
 
 సరిగ్గా ఈ రెండు సదస్సులు జరుగుతున్న సమయంలోనే నేను వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలం బొల్లికుంట గ్రామంలో బోజ్జం పెద్ద వెంకటయ్య అనే 72 ఏళ్ల వృద్ధుడితో మాట్లాడుతున్నా. వెంకట య్య ముదిరాజ్ కులస్తుడు. వృత్తిరీత్యా నీరటిగాడు. తెలంగాణలో నీరటి దనం వంశపారంపర్యంగా వస్తుంది. అయితే ఆయన వంశంలో అన్నదమ్ము లు, వాళ్ల పిల్లలు కలసి సంఖ్య ఎక్కువ కావడంతో వెంకటయ్యకు ఎనిమిదేళ్ల తరువాత ఈ ఏడు మళ్లీ నీరటి పని దక్కింది. వృద్ధాప్యం కారణంగా శక్తి చాలని వెంకటయ్య ఆ పని తన రెండో కొడుకుకు ఇచ్చేశాడు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడటానికి ముందు, నెలా నెలా అందే 200 రూపాయల ప్రభుత్వ పింఛన్‌తో ఆయన నెట్టుకొచ్చేవాడు. అది కాస్తా తర్వాత ఆగిపోయింది. పింఛన్ వస్తుందో, రాదో తెలియదు. ఈ వయసులో ఎట్లా బ్రతకాలో అర్థం కాదు. ఏం చెయ్యాలని అడగడానికి వెంకటయ్య నా దగ్గరికి వచ్చాడు. తల్లిదం డ్రులిద్దరినీ పోషించే స్థోమత కొడుకులకు లేదు. వెంకటయ్యలాంటి సంపాద నాపరులైన పిల్లలుగల వృద్ధులకు పింఛన్లక్కర్లేదన్నట్టు ప్రభుత్వం విపరీత వాదనకు దిగుతోంది. కొడుకుల ఆదాయం నుంచి కొంత తల్లిదండ్రులకు అం దేట్టు చర్యలు తీసుకుంటామని కూడా అంటున్నది. దీనివల్ల కుటుంబ సంబం ధాలు చెడిపోవడం తప్ప మేలు మాత్రం జరగదు. ఎప్పుడో నిర్మాణం జరిగే బంగారు తెలంగాణ గురించి వెంకటయ్యకు తెలియదు. భార్యాభర్తలిద్దరూ రెండుపూటలా ఇంత ముద్ద తిని, గౌరవంగా బతకగలిగితే అదే ఆయనకు బం గారం. పాలమూరు సదస్సులో హరగోపాల్ లాంటి పెద్దలు చెప్పింది అదే.
 
 ఆరు వేలకుపైగా జనాభా కలిగిన బొల్లికుంట మొదటి నుంచీ ఎంతో చైతన్యవంతమైన గామం. వరంగల్ కోట గోడను ఆనుకుని ఉండే ఆ గ్రామ పంచాయితీని ఇటీవలే వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌లో కలిపేశారు. తెలంగాణ ఉద్యమంలో అది నేడు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ వెంట నడి చిన గ్రామం. వెంకటయ్య సహా ఆ గ్రామానికి చెందిన 900 మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ కోసం కళ్లల్లో ప్రాణాలు పెట్టుకుని ఆశగా ఎదురు చూశారు.
 
 రకరకాల విన్యాసాల తరువాత వారిలో 200 మందికి మాత్రమే పింఛన్ మంజూరు అయింది. వెంకటయ్యసహా మరో 700 వందల మంది పింఛన్ వస్తుందో, రాదో తెలియని అగమ్యగోచరస్థితిలో జీవిస్త్తున్నారు. వారంతా తెలంగాణ ప్రజలే, పరాయి రాష్ర్ట పౌరులు కారు. ఇటీవలే ఆ గ్రామం సందర్శించిన స్థానిక శాసనసభ్యులు ధర్మారెడ్డికి, అధికార గణానికి వారి పరిస్థితి తెలుసు. బొల్ల్లికుంట ఒక ఉదాహరణ మాత్రమే. ఇది పది తెలంగాణ జిలాల్లోని వేలాది గ్రామాల్లోని లక్షలాది మంది వెంకటయ్యల దైన్యస్థితికి మచ్చుతునక. పింఛన్లు రావేమోనని, రేషన్ కార్డులు తీసేస్తారేమోనని బెంగతో గుండెపగిలి చనిపోయిన ఘటనల గురించి ఈ తొమ్మిది నెలల కాలంలో పలు వార్తలు విన్నాం, చదివాం. ఆంధ్ర పాలకులు ధ్వంసం చేసిన తెలంగాణ పునర్నిర్మాణానికి సమయం కావాలి కదా, ప్రణాళికలు రచిస్తు న్నాం కదా అంటే చెల్లదు. ఆ దూర దృష్టి ఎన్నికలకు ముందే ఉండాల్సింది. రూ. 200 పింఛన్ తీసుకుంటున్న నిస్సహాయులకు వెయ్యి రూపాయలు ఇస్తామని ఆశ చూపాల్సింది కాదు.
 
 వెనుక నుంచి ముందుకు నడక!
 
 కోదండరామ్ సూచించినట్టే రాష్ట్ర ప్రభుత్వం సమస్యల జాబితాలను తయా రు చేసుకునే తెలంగాణ పునర్నిర్మాణానికి పూనుకున్నా... వందలాది అంత స్తుల భవనాలను నిర్మించి, విశ్వనగరాలను తయారుచేసేసరికి వాటిలో నివసించడానికి మనుషులంటూ ఉండాలని ఏలిన వారు ఎందుకు మరచిపో తున్నారు? ముందుగా ప్రజల కనీస అవసరాలు తీర్చి, ఆ తరువాత విశ్వ నగరాల నిర్మాణానికి ఆలోచనలు చేస్తే మంచిది. తెలంగాణ ప్రభుత్వం వెనక నుండి ముందుకు నడిచే ప్రయత్నం చేస్తున్నట్టు  కనిపిస్తున్నది. ఆ కోణం నుంచే రాష్ర్ట మంత్రివర్గ సమావేశం గతవారం తీసుకున్న నిర్ణయాలను చర్చించవలసి ఉన్నది. వాటిలో కొన్ని అభ్యంతరకరమైనవి కాగా, మరి కొన్ని వివాదాస్పదమైనవి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అనే రెండే అంశాలు తలలో గూడు కట్టుకుపోవడం వల్లనే ప్రభుత్వం ఇలా అస్తవ్యస్త నిర్ణయాలు చేస్తోం దనే  అభిప్రాయం సర్వత్రా వినవస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌రావు చెపుతున్నట్టు ఆ రెండు నగరాల్లో ఒకటి డల్లాస్, మరొకటి న్యూయార్క్ నగరాలయితే సంతోషమే. కానీ ప్రజల కనీస అవసరాలను పట్టించుకోకుండా ఇలా అర చేతి స్వర్గాలను చూపిస్తే ప్రజలు నమ్మరు.
 
 నేతల నమ్మకాలను ప్రజలపై రుద్దుతారా?  
 
 హుస్సేన్‌సాగర్ ఒడ్డున ఉన్న సచివాలయాన్ని ఎర్రగడ్డకు మార్చి, అక్కడి ఛాతీ వ్యాధుల కేంద్రాన్ని 70 కిలోమీటర్ల దూరాన ఉన్న వికారాబాద్‌లోని అనం తగిరి కొండల మీదికి తరలించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. పరి పాలనా సౌలభ్యం కోసం సచివాలయాన్ని మరింత విశాలంగా కట్టుకోవా లంటే ఎవరికీ అభ్యంతరం ఉండదు. సచివాలయం తరలింపునకు కారణం వాస్తు దోషమేనని ప్రభుత్వమే చెబుతోంది. వాస్తు, జ్యోతిష్యం వంటి నమ్మ కాలు వ్యక్తిగతం కావాలె తప్ప, ప్రభుత్వాలు వాటిని రాష్ర్టం మీద రుద్దడం సరికాదు. ప్రస్తుత సచివాలయ భవన సముదాయానికి వాస్తు దోషం ఉన్న మాట నిజమే కానీ, దానిని కొన్ని మార్పు, చేర్పులతో సరిచేసి, అక్కడి నుంచే నిరభ్యంతరంగా పాలన సాగించవచ్చునని కొందరు వాస్తు నిపుణులు చెబు తున్నారు. అలాంటి వారందరిపైనా అధికార పార్టీ వారు తమ వ్యతిరేకులనే ముద్రలు వేస్తున్నారు. పోనీ ఎర్రగడ్డ ప్రాంగణం వాస్తు బ్రహ్మాండంగా ఉం దా? అంటే అక్కడ ఇంతకంటే ఘోరమైన వాస్త్తు దోషాలున్నాయని ఆ రంగం లోని నిపుణులే చెబుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కరుణానిధి భారీ వ్యయంతో నిర్మించిన నూతన సచివాలయాన్ని తరువాత అధికారం లోకి వచ్చిన జయలలిత ఉపయోగించకుండా వదిలేసిన వైనం రాష్ట్ర ప్రభు త్వానికి, ముఖ్యమంత్రికి తెలియదని అనుకుందామా? లేక ఈ సృష్టి అంత రించే వరకూ టీఆర్‌ఎస్  అధికారంలో ఉంటుందని ఏ జ్యోతిష్యులైనా చెప్పా రా? లేకపోతే వికారాబాద్‌లో ఉన్న నిజాం కాలంనాటి  క్షయవ్యాధి చికిత్సా కేంద్రం ప్రస్తుతం ఎలాంటి దుస్థితిలో ఉందో తెలిసి కూడా, అక్కడికే ప్రజ లకు అందుబాటులో ఉన్న ఎర్రగడ్డ ఛాతీ వ్యాధుల ఆస్పత్రి సముదాయాన్ని తరలించాలని ఎందుకు భీష్మించుకు కూచున్నట్టు? ఎవరినీ ఒప్పించ లేని ఈ నిర్ణయం వెనక వేరే కారణాలు ఉన్నాయన్న అపవాదాన్ని లేదా విమర్శను ప్రభుత్వం మొండిగా ఎందుకు మోస్తున్నట్టు? ప్రజలకు ఐదేళ్ల పాటూ తాత్కా లిక ధర్మకర్తలుగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు తమ నమ్మకాలను ఇలా ప్రజల నెత్తిన రుద్ద్దుతామనడం సమంజసం కాదు.  
 
 ఇక తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం జరుగుతున్న కాలంలో తాను మొక్కిన దేవుళ్లందరికీ ప్రజాధనం వెచ్చించి మొక్కులు తీర్చాలని ముఖ్య మంత్రి తన మంత్రివర్గం చేత నిర్ణయం చేయించారు. తిరుపతి వెంకన్నకు, విజయవాడ కనకదుర్గకు, వరంగల్ భద్రకాళికి, శ్రీశైలం మల్లన్నకు ఇంకా ముక్కోటి దేవతలకు కేసీఆర్ మొక్కుకుని ఉండొచ్చు. వాటికి, రాష్ట్ర ముఖ్య మంత్రికి ఏ సంబంధమూ లేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వ్యక్తిగతంగా ఎన్ని మొక్కులైనా మొక్కుకోవచ్చు, తన సొంత డబ్బుతోనో లేదా తమ పార్టీ నిధులతోనో నిరభ్యంతరంగా వాటిని తీర్చుకోవచ్చు. అంతేగానీ ఏలికల వ్యక్తి గత విశ్వాసాలకోసం, విలాసాలకోసం ప్రజాధనం వెచ్చిస్తామంటే కుదరదు.  

డేట్లైన్ హైదరాబాద్: దేవులపల్లి అమర్,  datelinehyderabad@gmail.com
 

Advertisement
Advertisement