‘బక్రాల’ వేటలో అసలు బాధ్యుడు | Sakshi
Sakshi News home page

‘బక్రాల’ వేటలో అసలు బాధ్యుడు

Published Fri, Jul 17 2015 1:18 AM

VIPs should come in no crowd of pilgrims at holy dip

పుష్కరాల వంటి కార్యక్రమాలకు వీఐపీలు రద్దీలేని వేళల్లోనే వచ్చి, వెంటనే వెళ్లిపోవాలనే మార్గదర్శకాలు చెబుతున్నాయి. అందుకే 1991 గోదావరి పుష్కరాలకు నాటి సీఎం నేదురుమల్లి నాలుగో రోజున వెళ్లారు. 2003లో నాటి  కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సాధారణ ఘాట్‌లో స్నానం చేస్తామంటే స్థానిక కలెక్టర్ వారించారు. ఈ సారి ఒక్క రాజమండ్రిలోనే పుష్కరాల పుణ్యమంతా సుడులు తిరుగుతోందన్నట్టుగా ప్రచారం చేశారు. అనర్థం జరిగిపోయాక గోదావరిలో ఎక్కడ చేసినా పుష్కర స్నానమేనని సెలవిస్తున్నారు.
 
‘కరాళ నృత్యం చేస్తున్న కరువు నుంచి జనాన్ని కాపాడ్డానికి అపురూపంగా పెంచుతున్న పంట చేలను మేస్తోందే!’ అని దర్బపుల్లలతో అదిలించినందుకే ఆవు చచ్చిపోయింది. అది తనను పరీక్షించడానికి వచ్చిన ‘మాయ ఆవు’ అని తెలిసినా... మహర్షి గౌతముడు చలించిపోయాడు. ఆవు చావుకు బాధ్యత వహించి ఘోర తపస్సుతో శివుడ్ని మెప్పించి, గోహత్య దోష నివారణకు శివుడి జటాజూటంలోని  గంగమ్మ పాయని వరంగా పొంది, నేలకు దించిన ఫలితమే పవిత్ర గోదావరి! ఇలాగే జరిగిందో, లేదోగానీ, ఇది విస్తృతంగా ప్రచారంలో ఉన్న కథ. అనర్థాలకు కారకులైన వారు వాటికి నైతిక బాధ్యత వహించాలని అది చెప్పే నీతి ఒక సంస్కృతిగా, సంప్రదాయంగా వేల ఏళ్లుగా ఈ నేల మీద అమలవుతోంది. గౌతమి (గోదావరి) అందుకు ప్రత్యక్ష సాక్షి. ఆ గోదావరిలో పవిత్ర పుష్కర స్నానమాచరిద్దామని వచ్చి, పాలకుల వైఫల్యా నికి ప్రాణాలు పోగొట్టుకున్న 27 మంది చావుకు ఎవరూ బాధ్యత వహించరా? ఈ మానవ తప్పి దానికి నైతిక బాధ్యత అంటూ ఉండదా? రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి లాల్‌బహదూర్ శాస్త్రి రాజీనామా చేసినది తన వల్లే రైలు ప్రమాదం జరిగిందనీ కాదు, తన రాజీనామాతో ఇక రైలు ప్రమాదాలే జరుగవనీ కాదు. సరిగ్గా అలాగే, తన పాలనలో బందిపోటు దొంగతనాలు పెరిగినందుకు ఉత్తరప్రదేశ్ సీఎం పదవి నుంచి విశ్వనాథ్ ప్రతాప్‌సింగ్ వైదొలిగారు! (తర్వాత దేశానికి ప్రధాని అయ్యారు) బస్సుల జాతీయీకరణపై ైహైకోర్టు తప్పుబట్టినందుకే నీలం సంజీవరెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీమద్యం వల్ల కొందరు చనిపోయినందుకు నైతిక బాధ్యత వహించాలంటే మంత్రి పదవికి, శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు కనుమూరి బాపిరాజు.  
 
 ఎందుకిలా జరిగింది?
 గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులకు పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలు తెలుగు ప్రజలకుగానీ, ప్రభుత్వాలకుగానీ కొత్తేమీ కాదు. ప్రభుత్వ యంత్రాం గానికి వాటిని విజయవంతంగా నిర్వహించిన అనుభవమూ ఉంది. ఈసారి భారీగా నిధుల కేటాయింపులూ జరిగాయి, అంతా ప్రణాళికాబద్ధంగా జరుగు తున్నదని చెప్పారు. కనుక రాష్ట్ర ప్రజలు సర్కారునూ, దాని ప్రచారాన్నీ నమ్మి అంతా సవ్యంగా జరుగుతుందని వచ్చారు. కానీ, తొక్కిసలాటలో వందల మంది క్షతగాత్రులయ్యారు. 27 మంది ప్రాణాలొదిలారు. ఇది మనిషి పరిధిలో లేని ప్రకృతి వైపరీత్యం కాదు. ఏ రకంగా చూసినా మానవ తప్పిదమే! నిర్వహణా లోపం వల్ల జరిగింది. ఎవరూ బాధ్యత వహించకుంటే, ఇలాంటి నిర్వహణా లోపాలు, నిర్లక్ష్యాలు, అలసత్వాలు పునరావృతమై సామాన్యులు తరచూ బలి కావాల్సి వస్తుంది. అది జరక్కూడదంటే, జరిగిన దారుణాన్ని సరిగ్గా పరిశీలించి, సమీక్షించి, విశ్లేషించాలి. అన్ని స్థాయిల్లో ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి.
 
 రాజకీయ నిందలకిది సమయం కాదనే మాట నిజమే, అంత మాత్రాన తప్పెక్కడ జరిగింది? బాధ్యులెవరు? అన్నది గుర్తించకూడదని కాదు. బాధ్యత ఎక్కడ మొదలై ఎవరి వద్ద ఆగిపోతుంది? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అన్నీ తానై నడిపించిన ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికా రులు ఈ బాధ్యతా వలయం నుంచి తప్పుకొని సాధారణ అధికారులనో, కిందిస్థాయి ఉద్యోగుల్నో బలిపశువుల్ని చేస్తారా? అదీ కాదంటే అలా దూసు కురావడం తప్పంటూ తొక్కిసలాటలో నలిగిన, ప్రాణాలొదిలిన భక్తుల్నే బాధ్యుల్ని చేస్తారో చూడాలి. అనవసర జాప్యంతో టెండర్లు పిలవకుండా, నామినేషన్ పద్ధతిన ‘అయిన వాళ్లకు’ పనులు అప్పగించడంతో భారీగా నిధులు దుర్వినియోగమయ్యాయే తప్ప చాలా చోట్ల పనులే జరగలేదు. జరి గిన అరకొర పనుల్లో నాణ్యత కొండెక్కింది. కట్టలు తెంచుకున్న అవినీతిని కళ్లారా చూస్తున్న అధికార, ఉద్యోగ వర్గాల్లో పనిలో తపన తగ్గింది. సరైన ప్రణాళికే లేక ఎక్కడికక్కడ నిర్వహణ వైఫల్యాలు, సమన్వయ లోపాలు, సౌక ర్యాల కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
 
 స్థానికాధికారులను, సిబ్బందిని సక్రమంగా పనిచేసుకోనీకుండా ఉన్నతాధికారగణం, రాజకీయ వ్యవస్థ నిరం తరం జోక్యం చేసుకున్నాయి. విపత్తు నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణకు  క్షేత్రస్థాయి సిబ్బంది హాజరు కాలేనంతగా సమీక్షలు జరిపి, నెల రోజులు ఊదరగొట్టిన మంత్రులు, ఉన్నతాధికార వర్గం ఇప్పుడేం చెబుతారు? ఇంత జరిగినా ప్రచార యావ ఇంకా తగ్గలేదు. అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాపులంటూ పుష్కరాలకొచ్చిన జనాన్ని పోగేసి ఊదరగొడుతున్నారు. తెగ హడావుడి చేస్తూ, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు.
 
 ప్రచార యావే... జనం ప్రాణాల మీదకి తెచ్చింది
 ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార యావ, తదనుగుణంగా జరిగిన నిర్వాకాలే మారణకాండకు ప్రధాన కారణం. ప్రచారం మీదున్న దృష్టిలో పదోవంతైనా పనుల మీద, వాటి నాణ్యత మీద ఉంటే ఈ దుస్థితి దాపురిం చేది కాదనే భావన సర్వత్రా వ్యక్తమౌతోంది. రూ.1,650 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేస్తే... టెండర్లెందుకు పిలవలేదు? దేనికెంత ఖర్చయింది? పనుల ప్రమాణాలు, నిర్వహణ, నాణ్యత ఎందుకిలా దిగజా రాయి? అని ప్రజలు బేరీజు వేసి వాస్తవాలను అవగాహన చేసుకోగలు గుతారు. అప్పుడు తప్పెక్కడ జరిగిందో, బాధ్యులెవరో తేలిపోతుంది. గంట న్నర సేపు తొక్కిసలాట, అదీ దఫ దఫాలుగా జరుగుతున్నా నిలువరిం చాల్సిన పోలీసులు, భద్రతా సిబ్బంది లేరు. తొక్కిసలాటలో ఊపిరాడక నాలుక పిడుచగట్టుకు పోయిన వారి గొంతు తడపడానికి కాసిని మంచి నీళ్లు లేవు.
 
 ఆపత్కాలంలో ఆదుకునే వైద్య సదుపాయాల్లేవు, కొన ఊపిరితో ఉన్న వాళ్లని తరలించడానికి అంబులెన్స్‌లు లేవు. కానీ, ఘాట్ మధ్యలో సీఎం సకుటుంబ సమేతంగా పుష్కర స్నానం చేస్తుంటే బయట లక్షలాది జన సందోహం కిక్కిరిసి వేచివుంది. అదీ నాలుగయిదు గంటల  నిరీక్షణ... ఎందుకు? జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద చంద్రబాబు కీర్తి పతాకాన్ని ఎగురవేసే లఘు చిత్రం చిత్రీకరణ కోసం! ఎంత దుర్మార్గమిది? వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సరస్వతీ ఘాట్‌కు సీఎం, ఆయన కుటుంబం ఎందుకు పరిమితం కాలేదు? అధికారులు వారిస్తున్నా... ఆఖరు నిమిషంలో ఆయన సామాన్యుల ఘాట్‌కు వచ్చి, అక్కడే పూజ, స్నానాదికాలు ఎందుకు చేశారు? ఈ అంశాన్నీ విచారణ పరిధిలోకి తెస్తారా, లేదా? జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) సమూహ నిర్వహణా మార్గదర్శకాలన్నిటినీ ఎందుకు తుంగలో తొక్కారో తేలాలిప్పుడు. సరైన ప్రణాళిక, పని విభజన, బాధ్యతల పంపకం ఎందుకు జరగలేదు? అన్నీ మంచిగా జరిగితే కీర్తిని తన ఖాతాలో వేసుకోవాలనే దృష్టితో సీఎం అన్నిటికీ తానే కేంద్ర బిందువుగా  ఉండటం వల్లే ఈ అనర్థమని ఉద్యోగవర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి.
 
 అధికారుల తెలివిడి ఏమైంది?
 రాజకీయ వ్యవస్థకు ఊడిగం చేసీ చేసీ అధికారులు తమ విధుల్ని, రాజ్యాంగ బద్ధమైున బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. రాజకీయ కారణాలతో ఓ ముఖ్యమం త్రి ఏం చెప్పినా అధికారులు తలలూపాలని లేదు. నిబంధనలు ఒప్పుకో వనో, అలా చేస్తే ఇలాంటి ఇబ్బందులొస్తాయనో.... చెప్పి ఉండాల్సింది. రాజ్యాంగం, చట్టాలు, సర్వీసు నిబంధనలకు లోబడి పని చేసే ప్రజా సేవకు లమే తప్ప రాజకీయ వ్యవస్థ చెప్పినట్టల్లా ఆడే బంట్లం కాదనే స్పృహ వారి కుండాలి. ఇటువంటి కార్యక్రమాలకు వీఐపీలు, జన సందోహం లేని వేళల్లోనే రావాలని, వచ్చి వెంటనే వెళ్లిపోవాలని ఎన్డీఎంఏ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంది. వీఐపీలొచ్చినపుడు రెవెన్యూ, పోలీసు తదితర సిబ్బంది దృష్టంతా వారిపైనే ఉంటుంది, కనుక సాధారణ విధుల నిర్వహణకు భంగం కలుగు తుందనేది దీని  ఉద్దేశం. 1991 గోదావరి పుష్కరాల ప్రారంభోత్సవానికి నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వెళ్లలేదు.
 
 పండితులు, అధికా రులతోనే పుష్కరాలను  ప్రారంభం చేయించి, 4 రోజులు తర్వాత, రద్దీ తగ్గాక పుష్కర స్నానం చేశారు. 2003లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉండగా పుష్కరాలు జరిగినపుడు స్థానిక కలెక్టర్ జవహర్‌రెడ్డి ఎన్డీఎంయే నిబంధనల్ని ఖచ్చితంగా అమలు జరిపించారు. నాటి  కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వీఐపీ ఘాట్‌లో గాక, సాధారణ భక్తుల ఘాట్‌లో స్నానం చేస్తామంటే నిర్మొ హమాటంగా కుదరదని, ఇబ్బందులొస్తాయని నచ్చజెప్పారు. కానీ, ఈ సారి ఒక్క రాజమండ్రిలోనే గోదావరి పుష్కరాలు జరుగుతున్నట్టు, పుణ్యమంతా అక్కడే సుడులు తిరుగుతున్నట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసింది.
 
 సీఎంతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు అంతా అక్కడే మోహరించారు. అదే సమయంలో తన పుష్కర స్నానానికి కొవ్వూరు ఘాట్‌ను ఎంపిక చేసుకొని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జనానికి సరైన సంకేతం పంపారు. ప్రభుత్వం హోర్డింగ్స్, టీవీ, పత్రికలు, రేడియో... అం తటా రాజమండ్రి గురించే ప్రచారం చేశారు. అనర్థం జరిగిపోయాక ఇప్పుడు ముఖ్యమంత్రి... నాసిక్ నుంచి బంగాళాఖాతం వరకు గోదావరిలో ఎక్కడ స్నానం చేసినా పుష్కర స్నానమేనని సెలవిస్తున్నారు. ఇవే మాటలను ముం దునుంచే విస్తృతంగా ప్రచారాన్ని, అందుకు ఏర్పాట్లను చేసి ఉండాల్సింది, తెలంగాణలో ఇలా వికేంద్రీకరణ జరిగింది. బాసర, ఎస్సారెస్పీ, పోచం పాడు, ధర్మపురి, కోటిలింగాల, కాళేశ్వరం, ఏటూరు నాగారం, మణుగూరు, భద్రాచలం ఇలా చాలా ప్రాంతాలలో సదుపాయాలు కల్పించి, ప్రచారం చేశారు. మంత్రులు కూడా వేర్వేరు ప్రాంతాల్లో ఉండి పర్యవేక్షిస్తున్నారు.
 
 కేంద్ర బిందువుగా బాధ్యత వహించాల్సిందే!
‘‘పాణాలు పోయాక పది లచ్చలిస్తామంటున్నారయ్యా..! కావాలంటే పది లచ్చలు నేనిస్తాను..మా పిన్నిని తీసుకురమ్మనండి..బాబూ!’’ అని హోరున విలపిస్తున్న శ్రీకాకుళం జిల్లా బలగ బత్తిన సత్తిబాబుకు ఎవరు సమాధానం చెబుతారు? అదలా ఉంచితే న్యాయవిచారణ అంటూ ముఖ్యమంత్రి దాట వేతకు యత్నిస్తున్నారు. నిస్సందే హమైన మానవ తప్పిదానికి నేరుగా ఆయనే బాధ్యత వహించాలి. పైగా రాజ్యాంగపరమైన బాధ్యతా ఉంది, వీటన్నిటి కంటే ఉన్నతమైన నైతిక బాధ్యతా ఉంది. చంద్రబాబు పరిపాలనా దక్షుడన డం ఉత్త ప్రచారమేనని మరో మారు రుజువైంది. అదే ఆయన నైజం. విజ యాల కీర్తిని తన ఖాతాలో, వైఫల్యాల అపకీర్తిని  ఇతరుల ఖాతాలో వేయడం ఆయన రివాజు. ఈ రివాజు ప్రకారమే రాజమండ్రి దుర్ఘటన నెపం ఎవరిపై నెట్టాలా? అని ఆయన ఒక బలిపశువు (బక్రా)ను వెతుకుతున్నారు.
 ఈమెయిల్: dileepreddy@sakshi.com        
సాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
- దిలీప్ రెడ్డి   
                         

Advertisement

తప్పక చదవండి

Advertisement