రూటు మారిన ఓటు | Sakshi
Sakshi News home page

రూటు మారిన ఓటు

Published Tue, Dec 24 2013 11:43 PM

రూటు మారిన ఓటు - Sakshi

విశ్లేషణ: నాంచారయ్య మెరుగుమాల

 ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు పూర్తయి కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారం నిలబెట్టు కోవడమే కాక కొత్తగా రాజస్థాన్‌ను కూడా కైవసం చేసుకుంది. ఢిల్లీలో పదిహేనేళ్లుగా అధికారం చలాయిస్తున్న కాంగ్రెస్‌ను ఓడించి అక్కడ అతి పెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌కు మిజోరం ఒక్కటే దక్కింది. ఎన్నికల ఫలితాలను చూడగానే కనిపించే వాస్తవం ఇది. అయితే, ఏ వర్గాల ఓటర్లు ఎవరిై వెపు మొగ్గుచూపారు... ఏ పార్టీ తన సంప్రదాయ ఓటర్లను నిలుపుకోగలిగిందన్న అంశాలు ఆసక్తి కలిగిస్తాయి. మరో నాలుగు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు, పరిణామాలు ఆందోళన కలిగించే రీతిలో ఉన్నాయి. అధికారంలోకి రావడానికి తోడ్పడే, కాంగ్రెస్ సంప్రదాయ ఓటర్లుగా భావించే దళితులు, ఆదివాసీలు, ముస్లింలు మొన్నటి శాసనసభల ఎన్నికల్లో ఈ పార్టీకి దూరమయ్యారని ఎన్నికల అనంతర సర్వేలు చెబు తున్నాయి. దళితులు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోవడం దీనికి సాక్ష్యం. ఈ నాలుగు రాష్ట్రాల్లో మొత్తం 72 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

ఎంపీలో ఊహించని షాక్!

 జనాభా రీత్యా పెద్ద రాష్ర్టమైన మధ్యప్రదేశ్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఊహిం చని షాకిచ్చాయి. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపలేకపోవ డం ఒక దెబ్బయితే, ఉన్న సీట్ల కన్నా తక్కువ తెచ్చుకుని కాంగ్రెస్ కుదేలైంది. ఆదివాసీలు పెద్ద సంఖ్యలో ఉన్న ఈ రాష్టంలో ఎస్సీ, ఎస్టీల నుంచి పడే ఓట్లు బీజేపీకి బాగా పెరిగాయి. అంతేకాదు- ఏడెనిమిది శాతం జనాభాగా ఉన్న ముస్లింల మద్దతును కూడా కాంగ్రెస్ కొంత వరకు కోల్పోయింది. అన్నిటికీ మించి ముస్లింలు అధికసంఖ్యలో నివసించే అనేక నగర, పట్టణ ప్రాంతాల్లో పాలక పక్షమైన బీజేపీకి 25 నుంచి 30 శాతం ముస్లింలు ఓటేశారని ఇక్కడి ఎన్ని కల ఫలితాలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలను తేల్చే సంఖ్యలో ముస్లింలు ఉన్న కనీసం 22 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ ఉన్నాయి. ఈ సీట్లలో బీజేపీ అభ్య ర్థులే ఎక్కువ గెలిచారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసించే ఇండోర్, జబల్ పూర్, భోపాల్ నగరాల్లో సైతం కాషాయ పార్టీదే ఆధిపత్యం. మొత్తం మీద బీజేపీ గతంలో కన్నా ఈసారి 22 సీట్లు అదనంగా గెల్చుకుంది.

 రాజస్థాన్‌లో చరిత్రాత్మక ఓటమి

 అత్యధిక ఆదివాసీ(ఎస్టీ) జనాభా ఉన్న రాజస్థాన్‌లో ఈ వర్గానికి 34 అసెంబ్లీ స్థానాలు రిజర్వ్ చేశారు. ఈ వర్గం ప్రజల మొగ్గు ఎప్పుడూ కాంగ్రెస్ వైపే. అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు గత ఐదేళ్లలో ఆదివాసీల అభి వృద్ధికి ఎన్నో పథకాలు అమలు చేసింది. అయినా గతంలో ఎన్నడూలేని స్థాయిలో ఈ పార్టీ కేవలం 21 సీట్లే సాధించడం ఓ రికార్డు. మిగిలిన, బడుగు వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం చివరి రెండేళ్లలో ఎన్నో కార్యక్రమాలు హడావిడిగా అమలు చేసినా అన్ని వర్గాల ప్రజలతోపాటు ఎస్సీ, ఎస్టీలు దూర మయ్యారు. 9-11 శాతం జనాభా ఉన్న ముస్లింలు సైతం ఇక్కడ కాంగ్రెస్‌ను అంతగా ఆదుకోలేదు. మధ్యప్రదేశ్‌లో మాదిరిగానే నాలుగోవంతు ముస్లింలు బీజేపీ అభ్యర్థులకు ఓటేయడానికి వెనుకాడలేదు. అందుకే, బీజేపీ నిలిపిన నలు గురు ముస్లిం అభ్యర్థుల్లో ఇద్దరు విజయం సాధించారు. ముస్లింలకు కేంద్ర స్థానంగా ఉన్న పుణ్య యాత్రాస్థలం అజ్మీర్ నగరంలోని నాలుగు సీట్లు బీజేపీ ఖాతాలోపడ్డాయి. ఆదివాసీల్లో అతి పెద్ద వర్గమైన మీణాల నేత కిరోడి లాల్ మీణా నేషనల్ పీపుల్స్ పార్టీ పేరుతో 150 సీట్లలో పోటీ చేసి కేవలం నాలుగు స్థానాలే సాధించగలిగారు. దీంతో కేవలం కులం పేరుతో గెలవడం సాధ్యం కాదని ఈ ఎన్నికలు నిరూపించాయి. ఈ సామాజికవర్గం ప్రజలు కూడా బీజేపీకే పట్టం కట్టారని ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. 2008తో పోల్చితే ఈసారి ఏడు శాతం ఎక్కవ ఓట్లు పోలైన ఈ రాష్ట్రంలో తొలిసారి ఓటేసినవారి మొగ్గు బీజేపీపైనే అని తేలింది. ఇలా అన్ని వర్గాల ప్రజల నుంచి లభించిన మద్దతుతో బీజేపీ రికార్డు స్థాయిలో మొత్తం 200 సీట్లకుగాను 164 సంపాదిం చగలిగింది. దాదాపు 12 శాతం ఓట్లు అదనంగా దక్కించుకుంది. అందరికీ దూరమైన కాంగ్రెస్ 21 సీట్లకే పరిమితమైంది.

 మార్పులేని ఛత్తీస్‌గఢ్

 మొత్తం జనాభాలో దాదాపు 30 శాతం ఆదివాసీలున్న మన సరిహద్దు రాష్ర్టం ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి బీజేపీ, కాంగ్రెస్ బలాబలాల్లో పెద్ద మార్పురాలేదు. బీజేపీ .7 శాతం ఓట్లు మాత్రమే అదనంగా గెలుచుకున్నా కొత్త అసెంబ్లీలో బలం 50 నుంచి 49 సీట్లకు తగ్గింది. ఆదివాసీల్లో గతంలో మంచి పట్టున్న ప్రతిపక్ష కాం గ్రెస్ తాజా ఎన్నికల్లో కొంతవరకూ ఆధిక్యం సాధించినా గ్రామీణ ప్రాంతాల్లో ముందుకుసాగలేకపోయింది. ఆదివాసీ ప్రాంతాల్లో ప్రత్యేకించి బస్తర్ డివిజన్ లో కాంగ్రెస్ బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకుంది. అయితే, రాయ్‌పూర్, బిలాస్‌పూర్ డివిజన్లలో బీజేపీ అదనంగా పది సీట్లు సాధించింది. ఆదివాసీ ప్రాంతాల్లో 9 సీట్లు కోల్పోయింది. ముస్లింలు రెండు శాతం కూడా లేని ఈ ప్రాంతంలో తాజా ఎన్నికల్లో ఈ వర్గం అభ్యర్థులెవరూ అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న రాజధాని రాయ్‌పూర్‌లో సైతం బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆహార ధాన్యాల పంపిణీ పథకం కారణంగా బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టు నిలబెట్టుకుంది. ఏదేమైనా ఆదివాసీల మద్ద తును బీజేపీ పెద్దగా కోల్పోలేదని ఫలితాలు నిరూపిస్తున్నాయి.

 అంచనాలకు అందని ఢిల్లీ

 కులం, మతం, ఇతర ఓటు బ్యాంకు రాజకీయలకు అతీతంగా ఎన్నికల బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అందరినీ విస్మయపరిచే రీతిలో, దాదాపు అన్ని వర్గాల మద్దతుతో అనూహ్య విజయం సాధించింది. తొలి సారి పోటీ చేసిన ఈ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ వైశ్యవర్గానికి చెందిన ప్పటికీ దీన్ని వ్యాపారుల పార్టీగా ఎవరూ పరిగణించలేదు. రాజధానిలో అధికారుల అవినీతికి బలయ్యే దుకాణదారులు ఇతర వర్గాల ప్రజలతో పాటు ఈ పార్టీకే ఓటేశారు. సంపన్నులు, చదువుకున్న మధ్య తరగతి వర్గం ప్రజలు నివసించే ప్రాంతాలతో పాటు, పేదలు, మురికి వాడలు ఉన్న చోట్ల కూడా ఈ పార్టీకి మంచి ఆదరణ లభించింది. ఈ పార్టీ నేతలు కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్‌ల సొంత రాష్ట్రమైన హర్యానాకు చెందిన వారితోపాటు, యూపీ, బీహార్ వంటి హిందీ ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి బాగానే ఓట్లు వేశారు.
 
 మారిన మైనారిటీల వైఖరి

 ఒక్క ముస్లింలు మినహా అన్ని వర్గాల ప్రజల మద్దతును కాంగ్రెస్ కోల్పోయిం ది. ఫలితంగా కాంగ్రెస్ ఓట్లు 16 శాతానికి పడిపోయి, 8 సీట్లకే పరిమితమైంది. ఈ ఎనిమిది మందిలో నలుగురు ముస్లిం అభ్యర్థులే. కొత్తగా రంగంలోకి దిగిన ‘ఆప్’కు హిందువుల్లో ఆదరణ కనిపించదని ముస్లింలు అంచనాకు రావడం వల్లే వారు తమ అభ్యర్థులకు ఓటేయకుండా కాంగ్రెస్ వెంట నడిచారని కేజ్రీ వాల్ విశ్లేషించారు. ఇక ఢిల్లీ గ్రామీణ ప్రాంతాల్లోని స్థానాల్లో ప్రధానంగా జాట్ ఓటర్లు బీజేపీకే పట్టంగట్టారు. ముస్లింలు అతి తక్కువ సంఖ్యలో ఉన్న మధ్య తరగతి స్థానమైన రామకృష్ణాపురంలో ‘ఆప్’ అభ్యర్థి షాజియా ఇల్మీ అనే మాజీ టీవీ యాంకర్(ముస్లిం) కేవలం 300 ఓట్ల తేడాతో ఓడిపోవడం రాజధాని ఓటర్లు పాత సంప్రదాయాలకు అతీతంగా ఓటేశారనడానికి మంచి ఉదాహ రణ. మీడియా... మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా సృష్టిగా అందరూ అభి వర్ణించిన కేజ్రీవాల్ పార్టీ చూపిన ఈ చొరవ ఇతర నగరాల్లో సైతం చూపించడా నికి ఆదర్శంగా నిలుస్తుంది. 7 లోక్‌సభ సీట్లున్న ఢిల్లీలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు పడిన ఓట్లను బట్టి అంచనావేస్తే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 5, ‘ఆప్’కు 2 సీట్లు వచ్చే అవకాశముంది. కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా దక్కదు.
 
 తగ్గిన ముస్లింల ప్రాతినిధ్యం

 యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం వంటి రాష్ట్రాల్లో ముస్లింలు 20 శాతానికి పైగా ఉంటే పైన చెప్పిన నాలుగు హిందీ రాష్ట్రాల్లో మొత్తంగా సగటున ముస్లింలు 7 శాతం. 2008లో జరిగిన ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 20 మంది ముస్లింలు ఎన్నికయ్యారు. ఈసారి అనేక కారణాల వల్ల ఆ సంఖ్య 8కి పడిపోయింది. ఛత్తీస్‌గఢ్‌లో గత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులుండగా నిన్నటి ఎన్నికల్లో ఒక్కరూ గెలవలేదు. రాజస్థాన్‌లో బీజేపీ టికెట్‌పై ముస్లింలు ఇద్దరు గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ముస్లిం నేతలెవరూ విజ యం సాధించలేదు. ఢిల్లీలో కాంగ్రెస్ టికెట్‌పై నలుగురు, జనతాదళ్(యూ) ఒకరు ఎన్నికయ్యారు. 2014 పార్లమెంటు ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ ఓటర్లలో వచ్చిన మార్పును సూచిస్తున్నాయి. అవినీతి, ధరల పెరుగుదల, స్త్రీలకు రక్షణ వంటి సమస్యలు ముందుకు రావడంతో ప్రస్తుతానికి మతం, కులం వంటి అంశాలకు పెద్దగా చోటు లేదని ఈ ఫలితాలను బట్టి అంచనావేయవచ్చు.    
 

Advertisement
Advertisement