ఆ త్యాగం వృథా కారాదు | Sakshi
Sakshi News home page

ఆ త్యాగం వృథా కారాదు

Published Tue, Sep 16 2014 11:53 PM

ఆ త్యాగం వృథా కారాదు

ఆగస్టు 15, 1947  బ్రిటిష్ దాస్య శృంఖలాల నుంచి భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన రోజు. కానీ తెలంగాణ మాత్రం నిజాం నిరంకుశ పరిపాలనలో క్రూర భూస్వాముల, దేశ్‌ముఖ్‌ల, జాగీర్‌దారుల కబంధ హస్తాల్లోనే ఉండిపోయింది.
 
రోమన్ సామ్రాజ్యంలో బానిసల కంటే దుర్భరమైన పరిస్థితిని తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్నారు.  నిజాంకు వ్యతిరేకంగా మాట్లాడినా, సభలూ సమావేశాలూ నిర్వహిం చినా కఠిన కారాగార శిక్షలు కాదు, రజాకార్ల కసాయి కత్తులకు బలికావలసిందే. ఆగస్టు 26, 1948న బైరాన్‌పల్లి గ్రామం మీద వందల మంది రజాకార్లు దాడిచేసి 118 మందిని ఒకే వరుసలో నిల్చోబెట్టి, తాళ్లతో బంధించి తుపాకులతో కాల్చి చంపిన ఘటన నిజాం నిరంకుశత్వానికి ఒక ఉదాహరణ మాత్రమే.
 
1947, సెప్టెంబర్ 2న పరకాల నడిబొడ్డున త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి వచ్చిన 2 వేల మంది ఉద్యమకారులపై రెండు లారీల మిలటరీ దళాలు, రజాకార్లు ఎటువంటి హెచ్చరికలు చేయకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపితే 16 మంది చనిపోయారు. వందల మంది గాయపడ్డారు.

‘నిజాం పాలనలో రాష్ట్రం తగులబడుతోంది. ఊళ్లకు ఊళ్లు భస్మీపటలం అవుతు న్నాయి. ప్రజల రక్తం నదులై ప్రవహిస్తోంది’ అని తన పత్రిక ‘ఇమ్రోజ్’లో పేర్కొన్న ఎడిటర్ షోయిబుల్లాఖాన్‌ను  ఆగస్టు 21, 1948న హైదరాబాద్ నడిబొడ్డున కాచిగూడ ప్రాంతంలో రాత్రి 10 గంటలకు రెండు చేతులు నరికి హత్యచేశారు. అప్పటికే నిజాం సర్కార్  పత్రికలపై ఉక్కుపాదం మోపింది. నిజాం అండతో దేశ్‌ముఖ్‌లు, జాగీర్‌దార్లు, జమీందార్లు పల్లెల్లో రైతుల రక్తం తాగుతూ వెట్టి చాకిరీ చేయించకునేవారు. ఈ ఫ్యూడల్ వ్యవస్థలో రైతులు దొరల భూములను దున్నిన తర్వాతనే తమ భూములను దున్నుకోవాలె, దొరల పొలాల్లో నాట్లు అయినంకనే రైతుల పొలాల్లో నాట్లు చేపట్టాలె. అనేక బహుజన కులాలు ఒక్క పైసా ప్రతిఫలం లేకుండా వెట్టి చాకిరీ చేయాల్సిందే. నిజాం రాజుకు భూస్వాములు నజరానాలు, కానుకలు ఇచ్చి వేల ఎకరాల భూములు హస్తగతం చేసుకొనేవారు.

ఈ ఆగడాలను, అరాచకాలను భరించలేని ప్రజలు గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి దేశ్‌ముఖ్‌లకు, జమీందారులకు, భూస్వాములకు వ్యతిరేకంగా ఎదురు తిరిగారు. బక్క రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చి, దేశ్‌ముఖ్ గొడ్డలి వేటుకు బలయిన బందగి త్యాగం, పంట చేతికొచ్చే సమయానికి కాజేయాలని చూసిన విసునూర్ దేశ్‌ముఖ్ గూండాలను తరిమిన వీరనారి చాకలి ఐలమ్మ సాహసం, పండించిన ధాన్యం బండ్లను తరలించుకుపోతున్న నిజాం గూండాలపై తిరగబడి తుపాకీ తూటాలకు బలైన దొడ్డి కొమరయ్య వీరత్వం, వరంగల్ కోటలో రజాకార్ల కసాయి కత్తులకు బలైన బహుజన సూర్యుడు బత్తిని మొగిలయ్య గౌడ్ సాహసం తెలంగాణ ప్రాంతంలో అగ్నిజ్వాలలు రగిలించాయి.

అడవి బిడ్డలకు హక్కులు సాధించి పెట్టిన కొమరం భీం, బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె పోతవు కొడుకో నైజాం సర్కరోడ! అని ప్రజల భాషలో రాసి విప్లవ జ్వాలలు వెదజల్లిన బండి యాదగిరి, సూరీడు ఎరుపు, సింధూరం ఎరుపు, కొండగోగులు ఎరుపు చిందిన రక్తం ఎరుపంటూ భూస్వాములను గడగడలాడించిన నల్లా నర్సింహులు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, వట్టికోట ఆళ్వారుస్వామి మరెందరో నిజాం నిరంకుశ ప్రభుత్వంపై మడమతిప్పని పోరాటం చేయడం జరిగింది. నాలుగు వేల మంది ఉద్యమకారులు రక్తతర్పణ చేశారు. ఫలితంగా భారత ప్రభుత్వ మిలిటరీ దళాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదేశంతో ఆపరేషన్ పోలో నిర్వహించి నిజాం రాజ్యాన్ని నలువైపుల నుంచి ముట్టడించాయి. నిజాం 1948, సెప్టెంబర్ 17న సాయంత్రం ఆసఫియా పతాకాన్ని అవనతం చేసి లొంగుబాటును ప్రకటించాడు.

నెత్తుటి ధారలతో, త్యాగాలతో  ప్రపంచంలోనే మహత్తర విప్లవంగా వినుతికెక్కిన తెలంగాణ పోరు చరిత్ర ఇంతదాకా  ఎందుకు కనుమరుగయింది? 10 లక్షల ఎకరాల భూపంపిణీకి స్ఫూర్తినిచ్చిన తెలంగాణ చరిత్ర ఎందుకు మరుగునపడుతోంది? సాధారణ ప్రజలు, అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి తిరుగుబాటు చేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు తెలియకపోవడానికి కారణం ఎవరు? ఇకనైనా సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని ఆ విప్లవ వీరులు చూపిన దారుల్లో అడుగులేద్దాం!

 న్యాతకాల ప్రసాద్, అధ్యాపకుడు
 
 

Advertisement
Advertisement