బద్దలైన యూపీ ఓటు బ్యాంకులు | Sakshi
Sakshi News home page

బద్దలైన యూపీ ఓటు బ్యాంకులు

Published Fri, Jun 6 2014 3:27 AM

బద్దలైన యూపీ ఓటు బ్యాంకులు - Sakshi

బీజేపీ వంటి పార్టీకి మైనారిటీ ఓటు పడేటట్టు చేసిన ఘనతను మళీ ్ల ‘గోధ్రా అల్లర్లకు బాధ్యుడు’ మోడీకే ఇవ్వడం మరో విశేషం. అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు అంటూ మోడీ ఇచ్చిన పిలుపుతో ముస్లిం యువత ఆయనకే ఓటు వేసిందని సర్వే చెబుతోంది.
 
 ఏ విధంగా చూసినా 2014 లోక్‌సభ ఎన్నికలు అనేక రకాల ప్రత్యేకతలతో చరిత్ర ప్రసిద్ధమైనాయి. మారిన ఉత్తర ప్రదేశ్ రాజకీయ చిత్రం కూడా అందులో ఒకటి. అక్కడి ఓటింగ్ సరళినీ, పాత పోకడలనీ ఈ ఎన్నికలు పరిపూర్ణంగా మార్చివేసిన సంగతి ఇప్పుడు జరుగుతున్న సర్వేలతో బయటపడుతోంది. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్ ఊపందుకోవడం వెనుక ఉన్న కారణాలలో ఈ ‘మార్పు’కూడా ఒకటి కావచ్చు. కుల సమీకరణలకీ, మైనారిటీ ఓటు బ్యాంకులకూ, మత రాజకీయాలకూ నిలయమైన ఉత్తరప్రదేశ్ తీర్పు ఈసారి మార్పును సంతరించుకుంది. ఇప్పుడు ఈ రాష్ట్ర ముస్లింల నుంచి బీజేపీకి దక్కిన మద్దతు చరిత్రలో ఎప్పుడూ లేదు. ‘ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీ పీఠానికి’ అన్న నినాదంతో సాగుతున్న బీఎస్‌పీ దళిత రాజకీయ అజెండాకు ఈ ఎన్నికలు గండి కొట్టాయి. బీజేపీని దరి చే రనీయని వర్గాలుగా పేర్గాంచిన మైనారిటీలూ, దళితులూ, ఓబీసీలూ  దృక్పథాన్ని మార్చుకున్న సంగతి సుస్పష్టమైంది.
 
 ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఉనావ్, జాన్‌పూర్ వంటి లోక్‌సభ స్థానాలకు ప్రత్యేకత ఉంది. ఇక్కడ ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇందులో లక్నో స్థానం నుంచి గతంలో వాజపేయి గెలిచేవారు. ఆయన సంగతి వేరు. ఇప్పుడు సాక్షాత్తు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ పోటీ చేసి గెలిచారు. యూపీలో బీజేపీ 73 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని విశ్లేషకుల చేత నోరు వెళ్లబెట్టించింది. ఇందుకు ఉన్న అనేక కారణాలలో ఒకటి- బీజేపీకి ముస్లిం ఓటు.
 
 కమలం పార్టీతో ముస్లింల వైరం జగద్విదితం. కానీ ఈ ఎన్నికలలో ఆ రాష్ట్రంలో పదిశాతం ముస్లింలు ఆ పార్టీ వైపు మొగ్గారు. ఈ రాష్ట్రంలోనే సంబాల్, రాంపూర్, షహరన్‌పూర్ వంటి నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్నారు. మెజారిటీ కాస్త తక్కువే అయినా ఈ నియోజక వర్గాలలో కూడా బీజేపీ అభ్యర్థులే గెలుపొందారు. ఇది బీజేపీ మీద ఉన్న మత ముద్రను మాసిపోయేటట్టు చేయగలుగుతోందని సర్వే జరిపిన సీఎస్‌డీఎస్‌కు చెందిన ప్రొఫెసర్ అస్మెర్‌బేగ్ (అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం) వ్యాఖ్యానించారు. పైగా బీజేపీ వంటి పార్టీకి మైనారిటీ ఓటు పడేటట్టు చేసిన ఘనతను మళీ ్ల గోధ్రా అల్లర్లకు బాధ్యునిగా ప్రసిద్ధిగాంచిన నరేంద్ర మోడీకే ఇవ్వడం మరో విశేషం.
 
 అభివృద్ధి కోసం జరుగుతున్న ఎన్నికలు అంటూ మోడీ ఇచ్చిన పిలుపునకు స్పందించి  ముస్లిం యువత ఆయనకే ఓటు వేసిందని సర్వే చెబుతోంది. వీరంతా ఎన్నికల సమయంలో మోడీకి జైకొట్టకపోయినా, ఓటు వేశారని ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ ప్రముఖుడు ముఫ్తీ షామున్ ఖాస్మీ చేసిన వ్యాఖ్య నిజమనే అనిపిస్తుంది. సెక్యులర్ పార్టీలంటూ డబ్బా కొట్టుకునే ఎస్‌పీ, బీఎస్‌పీ వంటి పార్టీలకు ఈ ఎన్నికలలో మైనారిటీలు ఝలక్ ఇచ్చారంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు రషీద్ అన్సారీ చెబుతున్న మాట వాస్తవమే.
 
 కుల రాజకీయాలకు కూడా ఉత్తరప్రదేశ్ పెట్టింది పేరు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ములాయం విజయ సూత్రం  కుల, మత ప్రాతిపదికకు సంబంధించినదే. ఈ ఎన్నికలలో అక్కడ ఈ కుల సమీకరణలు కూడా చెల్లాచెదురైనాయి. దళితుల పార్టీ బీఎస్‌పీకి ఆది నుంచి అండదండలను ఇస్తున్న జాతవ్‌లు, సమాజ్‌వాదీ పార్టీకి విధేయులుగా ఉన్న యాదవులు ఈ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేశారు. అలాగే ఈ రెండు పార్టీలను నమ్ముకుని ఉన్న ఇతర దళిత వర్గాలు, ఓబీసీలు కూడా ఈసారి ఎదురు తిరిగారు. ఈ ధోరణి ఇలాగే రెండేళ్లు కనుక కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకుడు ఆదిత్య అవస్థి జోస్యం పలికారు. గత రెండు దశాబ్దాలుగా ఓబీసీ ఓట్లన్నీ ప్రాంతీయ పార్టీలకు పడుతున్నాయి. లేదా ‘సామాజిక న్యాయం’ నినాదం అందుకున్న పార్టీలకు వెళుతున్నాయి. నిజానికి ‘ఇతర వెనుకబడిన వర్గాలు’ దేశ జనాభాలో 41 శాతం ఉన్నారు. ఈ వర్గమే బీజేపీని స్వాగతించింది. 2009లో 22 శాతం ఓబీసీ ఓట్లు బీజేపీకి రాగా, 2014 ఎన్నికలలో 34 శాతానికి పెరిగాయి. కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఇదో ప్రధాన కారణం.
 
 ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. దిగువ ఓబీసీలలో 42 శాతం, ఉన్నత ఓబీసీ వర్గం నుంచి 30 శాతం బీజేపీని ఆదరించారు. గుజరాత్, ఎంపీ, రాజస్థాన్, మహారాష్ట్రలో ఓబీసీలు మరో అభిప్రాయం లేకుండా బీజేపీకి ఓటు వేశారు. అయితే దేశమంతా ఇదే ధోరణి లేదు. ఇంతకీ ఇప్పుడు హిందూ ఓటు బ్యాంకు సుస్థిరమవుతున్నదా? లేక ప్రస్తుతం బీజేపీయే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లగలదన్న ఓటర్ల నమ్మకమా? అది భవిష్యత్తులో నిర్ణయమవుతుంది.
 - కల్హణ

Advertisement
Advertisement