పదవులే సామాజిక న్యాయమా? | Sakshi
Sakshi News home page

పదవులే సామాజిక న్యాయమా?

Published Thu, Dec 18 2014 2:47 AM

పదవులే సామాజిక న్యాయమా? - Sakshi

పౌరుల సమస్యలను ఓట్లతో కొలుస్తుండటం వల్లనే సామాజిక న్యాయంలోని ఆర్థిక, సామాజిక అంశాలు తరచుగా మరుగున పడుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలను, మైనారిటీలను ఉద్ధరిస్తామంటున్న నాయకులంతా మాట్లాడేది పదవుల పంపకం గురించే. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు వారికి పట్టడం లేదు. అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించామని చెప్పుకుంటున్న నేతలు ఆ వర్గాల ప్రజలను దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేసే చర్యల పట్ల ఉపేక్ష చూపుతున్నారు. అణగారిన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకులు  పదవులను, హోదాలను తమ సామాజిక వర్గాలను దుర్భర దారిద్య్రం నుంచి, సామాజిక అణచివేత నుంచి విముక్తి చేసే సాధనాలుగా ఉపయోగించాలి.  అది వారి కనీస బాధ్యత.
 
 సామాజిక న్యాయం పేరిట తమ కులానికి, మతానికి, తెగకు, ప్రాంతానికి, జిల్లాకు పదవులు దక్కాలనే నినాదాలు, వివాదాలు పదేపదే వినపడుతుంటాయి. ప్రభుత్వాలు, పార్టీలు కూడా పదవులను ఆ ప్రాతిపదికపైనే పంపిణీ చేశామని, అదే సామాజిక న్యాయమని చెబుతుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత సామాజిక తెలంగాణ, సామాజిక ఆంధ్ర ఏర్పడాలనే చర్చ కూడా ఇటీవల సాగుతోంది. సామాజిక న్యాయం గురించి ఇప్పుడు ఎక్కువగానే మాట్లాడుతున్నాం.  కానీ, సామాజిక న్యాయం విస్తృతిని గురించి మాత్రం తక్కువగా ఆలోచిస్తున్నాం. ఇంగ్లిష్ సోషల్ జస్టిస్‌కు సమానార్థకంగా సామాజిక న్యాయం వాడుతున్నాం. రోమన్ న్యాయదేవత పేరు ‘జస్టిటియా’ నుంచే జస్టిస్ పదం వాడుకలోకి వచ్చింది. క్యాథలిక్ ఆలోచనాపరులతో 1840 నుంచి సోషల్ జస్టిస్ అనే భావన వాడుకలోకి వచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. ప్రముఖ రాజనీతి శాస్త్రవేత్త జాన్ స్టువర్ట్ మిల్ దీనిని విస్తృతంగా ఉపయోగించారు. ఆయన తన ‘యుటిలిటేరియనిజం’లో ‘‘సమా జంలోని ప్రతి వారిని సమానత్వ దృక్పథంతో చూడాలి. వనరులతో సహా సమా జంలోని అవకాశాలన్నీ సమాన ప్రాతిపదిక పైనే పంపిణీ జరగాలి’’ అని ప్రతిపాదించారు.
 
 ఆ విధంగా చూస్తే అరిస్టాటిల్ నుంచి అంబేద్కర్ వరకు సామాజిక, రాజనీతి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు చాలా మందే సామాజిక న్యాయం గురించి లోతైన వ్యాఖలు చేశారు. ‘‘సమాజంలో మానవుడు సంపూర్ణ వ్యక్తిగా రూపొందాలి. న్యాయం, చట్టం లేకుండా మనిషి బతికితే ఆ పరిస్థితులు భయానకంగా ఉంటాయి’’ అని అరిస్టాటిల్ అన్నాడు. 19, 20 శతాబ్దాలలో సోషల్ జస్టిస్‌పై విస్తృతంగా చర్చ సాగింది. బాబా సాహెబ్ అంబేద్కర్‌కు ఆచార్యులైన జాన్ డ్యూయి లాంటి వారు దీనిని బాగా ప్రచారంలోకి తీసుకొని వచ్చారు. అమెరికా మానవ హక్కుల ఉద్యమ నేత, నల్ల జాతి రత్నం మార్టిన్ లూథర్‌కింగ్ ‘‘అన్యాయం తాండవిస్తున్న ప్రతి చోటా న్యాయం లేచి నిలబడు తుంది’’ అని పలికి ఎందరికో ఉత్తేజాన్ని కలిగించారు. అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే ‘‘సామాజిక న్యాయానికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పునాదిగా ఉండాలి’’. అంటే సామాజిక న్యాయం... కులం, వర్ణం, అధికారం, హోదా, లింగ విభేదాలు సమసిపోయేట్టు చేసే ఆయుధం కావాలని ఆయన ఆకాంక్ష. సమాజంలోని ఆర్థిక వనరులు, సామాజిక రాజకీయ అవకాశాలు సమంగా పంపిణీ జరగాలనేదే ఆయన దృక్పథం. ఆ వెలుగులోనే సామాజిక న్యాయం అనే అంశాన్ని విశ్లేషించాల్సి ఉంటుంది.
 
 ఓట్ల కొలబద్ధపై సామాజిక న్యాయం
 నేటి సామాజిక న్యాయం చర్చంతా రాజకీయరంగంపైనే కేంద్రీకరించి ఉంది. కులాలు, మతాలు, తెగలు, ప్రాంతాలు తమ రాజకీయ వాటాల గురించే ఎక్కు వగా మాట్లాడుతున్నాయి. ఆయా సమూహాల్లోని అభివృద్ధి చెందిన లేదా ఎదిగి వచ్చిన శక్తులే ఈ చర్చ ఎక్కువగా చేస్తున్నాయి.  రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు, ప్రభుత్వాలు సామాజిక న్యాయంపై చర్చను పూర్తిగా పదవులు పంపకం వ్యవహారంగా మార్చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలు నడిపే వారికి అంతిమంగా కావాల్సింది ఓట్లే. అందువల్ల సమాజంలోని మెజార్టీ జనాభాగా లేదా నిర్ణయాత్మక జనాభాగా ఉన్న కులాలకు ఎక్కువ ప్రాధాన్య తనిస్తూ, తక్కువ జనాభా కలిగిన, సంఖ్యాపరంగా ప్రాధాన్యంలేని వారిని   లెక్కలోకి తీసుకోవడమే లేదు. దీంతో వారికి రాజకీయ రంగంలో కూడా సరైన ప్రాతినిధ్యం లభించడం లేదు. అందుకే రాజకీయపరమైన సామాజిక న్యాయం చాలా సమూహాలకు అందడం లేదన్నది నిర్వివాదాంశం.
 
 పౌరుల సమస్యలను ఓట్లతో కొలుస్తుండటం వల్లనే సామాజిక న్యాయం లోని విడదీయరాని అంశాలైన ఆర్థిక, సామాజిక అంశాలు తరచుగా మరుగున పడుతున్నాయి. మనదేశంలో కులాలు, తెగలు, మతాలు ఎన్నో ఏళ్లుగా ఉనికిలో ఉన్నాయి. వాటిలో కొన్ని తరతరాలుగా సర్వసౌకర్యాలూ అనుభ విస్తూ, ఆధిపత్యంలో కొనసాగుతుంటే, మరికొన్ని అభివృద్ధి ఫలాలను అందు కోలేకపోతున్నాయి. నిజానికి సామాజిక న్యాయం అవసరమయ్యేది ఇక్కడే. పార్టీలు, ప్రభుత్వాలు కొన్ని కులాలకు, తెగలకు, మతాలకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ఆచరణలో ఆయా వర్గాలలో ఎదిగి వచ్చిన నాయకులకు మాత్రమే ప్రయోజనం చేకూరడం సర్వసాధారణంగా మారింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వగైరాలను ఉద్ధరిస్తామంటున్న నాయకులంతా మాట్లాడేది పదవుల పంపకం గురించే. ఆయా వర్గాలు ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలు వారికి పట్టడం లేదు. ముస్లింలకు, క్రైస్తవులకు ప్రాతినిధ్యం కల్పించామని గొప్ప లు చెప్పుకుంటున్న నేతలు ఆ వర్గాలలోని ప్రజానీకాన్ని వారు అనుభవిస్తున్న దుర్భర పరిస్థితుల నుంచి బయటపడేసే చర్యల పట్ల ఉపేక్ష చూపుతున్నారు.  
 
 పదవులు సామాజిక న్యాయ సాధనాలు కావాలి
 ఒకవైపు అధికార వర్గాలు తమ రాజకీయ ప్రయోజనం కోసం సామాజిక న్యాయాన్ని వాడుకుంటుంటే, రెండో వైపు ‘సామాజిక న్యాయం’ పేరిట  పదవులు పొందిన నాయకులు, పొందాలనుకుంటున్న నాయకులు అదే తమ ఎజెండాగా చెప్పుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సామాజిక న్యాయం అనే పదం నేడు అపభ్రంశానికి గురైంది. నిజమైన అర్థంలో దాన్ని ఆచరింపబ డటం లేదు. అలా అని  రాజకీయ రంగంలో సామాజిక న్యాయం అమలు కానవసరం లేదని కాదు. ఆయా వర్గాలకు ఆ భాగస్వామ్యం, ప్రాతినిధ్యం దక్కాల్సిందే. కానీ అది అంత వరకే పరిమితం కారాదు. అదే పరమావధి కాకూ డదు. అది ఒక ఆరంభంగా భావించి అణగారిన వర్గాల నుంచి ఎదిగి వచ్చిన నాయకులు  పదవులను, హోదాలను తమ సామాజిక వర్గాలను దుర్భర దారి ద్య్రం నుంచి, సామాజిక అణచివేత నుంచి విముక్తి చేసే సాధనాలుగా ఉపయో గించాలి. సామాజిక న్యాయ సూత్రాన్ని ఆసరాగా చేసుకొని పదవులు పొందిన వారు నిర్వర్తించాల్సిన కనీస బాధ్యత ఇది.
 
 దేశంలోని కుల వ్యవస్థ సామాజిక న్యాయ సూత్రానికి విరుద్ధమైన భావ జాలాన్ని మన మెదళ్లలో నింపింది. మనిషి కులాన్ని బట్టి ఆర్థిక, సామాజిక స్థితిగతులు నిర్ణయమవుతున్నాయి. నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో సైతం కుల వ్యవస్థ నిచ్చెన ఎగువ  మెట్ల పైన ఉన్న శక్తులు కింద ఉన్న వారిని పైకి రానీయకుండా అడ్డుకోవడం ఆనవాయితీగానే ఉంది. దీంతో ఆ వర్గాలు సామాజిక, ఆర్థిక ఫలితాలను అందుకోలేకపోతున్నాయి. తరతరాలుగా జరుగు తున్న ఈ దుర్మార్గమైన వివక్షను పాలక వర్గాలు మరింత పెంచి పోషిస్తున్నాయి. ఆ వివక్షను రూపుమాపడానికి కృషి చేయాల్సిన అణగారిన వర్గాల రాజకీయ నాయకత్వం తమ ఉనికిని కాపాడుకోవడం కోసం ఆధిపత్య వర్గాలతో మిలా ఖత్ అవుతున్నది. ఫలితంగా అణగారిన వర్గాలు ఇంకా అణచివేతకు గురవు తున్నాయి. ఇది తీవ్ర సంక్షోభానికి దారి తీస్తున్నది. దీనిపై విస్తృతంగా చర్చ జరగాలి.
 
 అంతరాలు కూలితేనే...
 భూమి, ఉపాధి, విద్య, వైద్యం, ఉద్యోగాలు తదితర అంశాల్లో అణగారిన వర్గాలకు దక్కాల్సిన సమభాగం ఇంకా అందడంలేదు. భూమిలేని పేదలు రోజు రోజుకీ  పెరుగుతున్నారు. ఆర్థిక రంగంలో వచ్చిన పెనుమార్పులు కాస్తో, కూస్తో భూములున్న పేదలను భూమిలేని వ్యవసాయ కూలీలుగా మార్చి, బజారున పడేశాయి. ప్రైవేటు విద్యా సంస్థల ప్రయోజనం కోసం ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వాలే ధ్వంసం చేశాయి. కార్పొరేట్ వైద్య రంగం కోసం ప్రభుత్వ వైద్య వ్యవస్థకు కూడా అదే గతి పట్టించాయి. ఫలితంగా నిరుపేదలు జీవించే హక్కునే కోల్పోతున్నారు. ఆదివాసులు, దళితులు సాధారణ  జ్వరాల కు సైతం చనిపోవాల్సి వస్తోంది. సంప్రదాయక వృత్తులు దెబ్బతినడం వల్ల వెనుకబడిన కులాల వారు ఉపాధిని కోల్పోయి, ఆకలిచావులకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు కూడా రోజురోజుకీ పెరుగు తున్నాయి. నిత్యం దేశంలో ఏదో ఒక మూల దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆత్మగౌరవంతో తలెత్తి నిలిచిన యువ కుల తలలు తెగి పడుతూనే ఉన్నాయి. ఇలాంటి దురన్యాయాలు అంతం అయినప్పుడే న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం మూల సిద్ధాంతానికి సరైన అర్థం దొరుకుతుంది.
 
ఇటీవలే తుదిశ్వాస విడిచిన ప్రముఖ మానవ హక్కుల నేత జస్టిస్ కృష్ణయ్యర్ ‘‘సమాజంలో ఎవరైనా అవస్థల పాలవు తున్నారంటే మనం సిగ్గుతో తల వంచుకోవాలి’’ అని అన్నారు. అందుకే ఇటువంటి అన్ని రుగ్మతల కు విరుగుడుగా అంబేద్కర్ నాయకత్వంలో రూపొందిన భారత రాజ్యాంగం, 38వ అధికరణం ద్వారా సామాజిక న్యాయానికి చట్టబద్ధ పరిష్కారాన్ని చూపిం ది. ‘‘జాతీయ జీవన రంగాలన్నిటిలో, సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయం పెంపొందించు సామాజిక వ్యవస్థను వీలైనంత సమర్థవంతంగా సమకూర్చి దానిని కాపాడటం ద్వారా దేశ ప్రజల క్షేమాన్ని పెంపొందించడానికి ప్రభు త్వాలు కృషి చేయాలి’’ అని నిర్దేశించింది. దానిని తు.చ. తప్పక అమలు చేయగలిగితేనే సామాజిక న్యాయం సమకూరుతుంది.
- మల్లేపల్లి లక్ష్మయ్య
(వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
 మొబైల్ నం: 9705566213)

Advertisement

తప్పక చదవండి

Advertisement