142వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

142వ రోజు పాదయాత్ర డైరీ

Published Mon, Apr 23 2018 2:54 AM

142rd day padayatra diary - Sakshi

22–04–2018, ఆదివారం
ఆగిరిపల్లి, కృష్ణా జిల్లా

చంద్రబాబు వంచనను ఎండగట్టాలని నిర్ణయించాం
ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా సంకల్పిస్తే ఎవరి నమ్మకాన్నయినా చూరగొనవచ్చని ఆ పడమటి దేశపు ఆడపడుచు మాటలు విన్నాక అనిపించింది. రెండు దశాబ్దాల కిందట ఇక్కడ స్థిరపడ్డ ఆ అమెరికా సోదరి పేరు మెలోడి. ‘మీ గురించి విన్నాను. ఈ పాదయాత్ర గురించి తెలుసుకుని మిమ్మల్ని కలవాలని వచ్చాను. ప్రజలతో మీరు మమేకమవుతున్న తీరు, వారికి మంచి చేయాలని పడుతున్న తపన, కష్టం చూశాక.. మీలో నిజమైన ప్రజా సేవకుడు కనిపిస్తున్నాడు’ అని ఆ సోదరి చెబుతుంటే.. ఎంతోమంది నా మీద పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతటి కష్టాన్నయినా భరించగలననిపించింది. 

పెన్షనర్ల బాధలు ఇన్నిన్ని కాదయా.. అంటూ వచ్చాడు షేక్‌ అజమ్‌ అలీ అనే పెద్దాయన. పెన్షనర్లకు బాబుగారిచ్చిన హెల్త్‌కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదట. చాలా వ్యాధులు ఆ హెల్త్‌కార్డు లిస్టులోనే లేవంటూ ఆస్పత్రులవారు తిప్పి పంపుతున్నారట. ‘సార్‌.. మాకు ఆరోగ్యశ్రీ వర్తించదు,  హెల్త్‌కార్డులూ పనిచేయవు. ఈ వయసులో ఆరోగ్య సమస్యలు తలెత్తితే మా పరిస్థితేంటి? ఆస్పత్రులకెళ్లాలంటేనే భయంగా ఉంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి ప్రభుత్వ సర్వీసు చేసి.. వృద్ధాప్యంలో ఆరోగ్యానికి కనీస భరోసా లేని బతుకులీడుస్తున్న ఆ పెద్దల పరిస్థితిని చూసి చాలా జాలేసింది. 

వెంకటేశ్‌నాయక్‌ అనే ఉపాధ్యాయుడు తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిశాడు. ముఖంలో విషాదచ్ఛాయలు. తన ఆరేళ్ల కొడుకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడట. ఆ అబ్బాయికి చికిత్స చేయించాలంటే రూ.25 లక్షలు ఖర్చవుతుందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయట. ‘సార్‌.. ఆరోగ్యశ్రీ పనిచేయదు.. మందులకే నెలకు రూ.18 వేలు ఖర్చవుతోంది. బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడానికి బాలుడి సోదరి.. ఈ నాలుగేళ్ల చిన్నారే దాత. అప్పులు చేసి కొంత, విరాళాల రూపంలో మరికొంత సమకూర్చుకున్నాను. ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు మంజూరయ్యాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు’ అని ఆ తండ్రి తన కన్నీటి వేదనను పంచుకున్నాడు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళితే.. ఆస్పత్రికి లెటర్‌ ఇస్తున్నారట. చెక్‌ ఇవ్వాల్సిన చోట లెటర్‌ ఇస్తే.. ఏ ఆస్పత్రి అయినా వైద్యం ఎలా చేస్తుంది? 

హోదా కోసం పదవులను త్యజించి, ఆమరణ దీక్షలు చేసి, మా పార్టీ చిత్తశుద్ధిని దేశమంతా చాటిన నా సహచరులు, పార్టీకి చెందిన ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించాను. హోదాపై హామీ ఇచ్చిన అన్ని పార్టీలూ నేటి రాష్ట్ర పరిస్థితికి బాధ్యత వహించాలి. అన్నింటినీ మించి హోదా రాకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబు వంచనే. 25కు 25 మంది ఎంపీలు రాజీనామా చేసి, ఆమరణ దీక్షలు చేసుంటే కేంద్రం దిగొచ్చి హోదా ఇచ్చేదని తెలిసి కూడా.. ఆ పనిచేయకుండా దీక్షలు, సభలు, సైకిల్‌ యాత్రల పేరుతో ప్రజల్ని మరోసారి మోసగించాలని బాబుగారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ వంచనను ఎండగట్టాలని, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలని నేటి సమావేశంలో నిర్ణయించాం. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. పేదవాడికి పెద్ద జబ్బు చేసినప్పుడు.. ఆరోగ్యశ్రీ వర్తించక, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేయూత అందకపోతే.. వారి పరిస్థితేంటి? వారి ప్రాణాలు గాలిలో దీపాలేనా? 
- వైఎస్‌ జగన్‌

Advertisement
Advertisement