లెనిన్‌ విగ్రహం కూల్చివేత | Sakshi
Sakshi News home page

లెనిన్‌ విగ్రహం కూల్చివేత

Published Wed, Mar 7 2018 1:42 AM

2 Lenin statues brought down in Tripura; CPM blames BJP workers - Sakshi

అగర్తలా/న్యూఢిల్లీ:  ఈశాన్య రాష్ట్రం త్రిపుర వేడెక్కుతోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి సీపీఎం, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడింది. పలు చోట్ల సీపీఎం కార్యాలయాలను ధ్వంసం చేసిన ఘటనలూ చోటు చేసుకున్నాయి. తాజాగా రాష్ట్రంలోని బెలోనియా పట్టణంలోని సోవియట్‌ రష్యా విప్లవ నేత వ్లాదిమర్‌ లెనిన్‌ విగ్రహాన్ని సోమవారం గుర్తుతెలియని దుండగులు జేసీబీతో కూల్చివేసిన ఘటన ఉద్రిక్తతలను మరింత పెంచింది.

అంతకుముందు, ఆదివారం సబూన్‌లోని లెనిన్‌ విగ్రహాన్ని కూడా కొందరు ధ్వంసం చేసి కూల్చేశారు. బెలోనియాలోని కాలేజీ స్క్వేర్‌లో నెలకొల్పిన లెనిన్‌ విగ్రహాన్ని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్‌ ఇటీవలే ఆవిష్కరించారు. లెనిన్‌ విగ్రహ కూల్చివేతలపై దేశవ్యాప్తంగా పలుచోట్ల సీపీఎం శ్రేణులు నిరసనలు నిర్వహించాయి. ఈ ఘటనకు బీజేపీయే కారణమని ఆరోపించాయి. ఎన్నికల్లో విజయంతో బీజేపీ, దాని మిత్రపక్షమైన ఐపీఎఫ్‌టీ రాష్ట్రంలో దాడులకు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బిజన్‌ ధర్‌ ఆరోపించారు.

లెనిన్‌ విగ్రహం కూల్చివేసిన అనంతరం దుండగులు ‘భారత్‌ మాతాకీ జై’ అని నినదించారన్నారు. తమ పార్టీకి చెందిన వారిపై దాడులు చేయడంతో పాటు ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కాగా, లెనిన్‌ విగ్రహాన్ని కూల్చిన జేసీబీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ త్రిపుర గవర్నర్‌ తథాగత్‌ రాయ్, డీజీపీ ఏకే శుక్లాలకు ఫోన్‌ చేసి పరిస్థితిని సమీక్షించారు.  

లెనిన్‌ తీవ్రవాది: సుబ్రమణ్యస్వామి
మహాత్మాగాంధీ, బీఆర్‌ అంబేద్కర్, స్వామి వివేకానంద, జన్‌సంఘ్‌ వ్యవస్థాపకుడు దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ వంటి ఎందరో స్వదేశీ నేతలు, ఆదర్శప్రాయులు మనకు ఉండగా,, విదేశీయుల విగ్రహాలు ఎందుకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ వ్యాఖ్యానించారు. లెనిన్‌ విగ్రహం కూల్చివేతను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సమర్థించారు. రష్యాకు చెందిన లెనిన్‌ తీవ్రవాది అంటూ.. ఆయన విగ్రహాన్ని మన దేశంలో ఏర్పాటు చేయటమేంటని ప్రశ్నించారు.

కావాలంటే, లెనిన్‌ విగ్రహాన్ని పార్టీ కార్యాలయాల్లో పెట్టుకుని, పూజించుకోవాలని కమ్యూనిస్టు నాయకులకు సూచించారు. లెనిన్‌ నిరంకుశ పాలనలో రష్యాలో ఎంతో మంది మరణించారన్నారు. అలాంటి వ్యక్తి విగ్రహాన్ని మన దేశంలో నెలకొల్పుతారా అని ప్రశ్నించారు. త్రిపురలో వామపక్ష ప్రభుత్వ అణచివేతకు గురైన ప్రజలే లెనిన్‌ విగ్రహాన్ని కూల్చి ప్రతీకారం తీర్చుకున్నారని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. కాశీ, అయోధ్య, మధుర తదితర దేవాలయాల ధ్వంసంపై ఈ నేతలు మాట్లాడినట్లు తానెప్పుడూ వినలేదన్నారు.

ప్రతీకారం.. ప్రజాస్వామ్యం కాదు: మమత
‘సీపీఎం, ఆ పార్టీ అకృత్యాలకు నేను వ్యతిరేకం. మార్క్స్, లెనిన్‌లు నాకు నచ్చరు. అలాగే, బీజేపీ దౌర్జన్యాలను కూడా సహించను’ అని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ప్రతీకారం.. ప్రజాస్వామ్యం కానేకాదన్నారు. ప్రపంచ నేతల్లో ఒకరైన లెనిన్‌ను గౌరవించటం సంప్రదాయమని సీపీఐ నేత డి.రాజా అన్నారు.  


కోల్‌కతాలో ర్యాలీ: లెనిన్‌ విగ్రహం కూల్చివేతకు నిరసనగా కోల్‌కతాలో సీపీఎం చేపట్టిన ర్యాలీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్, బృందా కారత్, బిమన్‌ బోస్‌ పాల్గొన్నారు. త్రిపురలో సీపీఎం కార్యకర్తలపై దాడులను వారు ఖండించారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లౌకిక, ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని ఏచూరి పిలుపునిచ్చారు.
 

Advertisement
Advertisement