అడుగడుగునా అధికార దుర్వినియోగం | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అధికార దుర్వినియోగం

Published Sat, Apr 21 2018 1:43 AM

Abuse of power at every step - Sakshi

సాక్షి, అమరావతి: అడుగడుగునా అధికార దుర్వినియోగం.. మంచినీళ్లలా ప్రజాధనం ఖర్చు. ఇదీ ‘ధర్మ పోరాటం’ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఒక పూట నిరసన దీక్ష జరిగిన తీరు. మరోవైపు చంద్రబాబు నిర్వహించిన దీక్షకు రాజకీయ పక్షాల నుంచి మద్దతు కూడా కరువవటం కచ్చితంగా ముఖ్యమంత్రి వైఫల్యమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీక్ష పేరుతో ఓ రాజకీయ కార్యక్రమం కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చి పార్టీ కార్యకర్తల మాదిరిగా పని చేయించటం ఏమిటని జనం మండిపడుతున్నారు. ఉద్యోగులను ఒక రోజంతా రాజకీయ అవసరానికి వినియోగించడం ద్వారా ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొంటున్నారు. 

12 గంటల దీక్షకు రూ.30 కోట్లకుపైనే
‘ధర్మ పోరాటం’ పేరుతో శుక్రవారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో కొద్దిగంటల పాటు జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష కోసం రూ.30 కోట్లకు పైనే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వం కష్టాల్లో ఉందంటూ మరోవైపు జనం డబ్బును మంచినీళ్లలా వెదజల్లి దీక్ష చేయడం ఎంతవరకూ సమంజసమని సాధారణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు బంద్‌లు, ఆందోళనలు చేయడం వల్ల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని చెబుతున్న చంద్రబాబు తన ఒకరోజు దీక్ష కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకుని అంతకంటె నాలుగైదు రెట్లు ఎక్కువ నష్టం కలిగించారు. స్వీయ రాజకీయ ఎజెండాలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారని విమర్శకులు పేర్కొంటున్నారు. 

ఎటు చూసినా ఏసీలే
వేదిక చుట్టూ అడుగడుగునా ఏసీలు, సిలిండర్‌ దిండ్లపై కూర్చోని చంద్రబాబు విలాసవంతమైన దీక్ష చేయడం చర్చనీయాంశమైంది. చంద్రబాబుతోపాటు ముఖ్యనేతలు కూర్చున్న వేదిక వద్ద నాలుగు భారీ ఏసీలు, మరో 14 సాధారణ ఏసీలను అమర్చారు. సీఎం కూర్చోవడానికి ఆరు సిలెండర్‌ దిండ్లు, నాలుగు మామూలు పిల్లోస్‌తోపాటు బయో స్ప్రింగ్‌ పరుపులను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఏడు గ్యాలరీల్లో అడుగడుగునా భారీ వాటర్‌ కూలర్లు ఉంచారు. 

అధికారులు అంతా స్టేడియంలోనే
చంద్రబాబు చేపట్టిన 12 గంటల ధర్మపోరాట దీక్ష కోసం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కేరాఫ్‌ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంగా మారింది. తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్‌ వచ్చి బాబుకు సంఘీభావం తెలపగా తర్వాత నుంచి మిగిలిన అధికారులు క్యూ కట్టారు. తమ పరిధిలోని ఉద్యోగులను అధికారులు బలవంతంగా దీక్షకు తరలించారు. కృష్ణాజిల్లా యంత్రాంగమైతే నాలుగు రోజుల నుంచి పూర్తిగా ఇదే పనిలో లీనమైంది. దీక్షా వేదికపై ప్రసంగించిన డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పిడుగు బాబూరావు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్ష చేస్తారని కేవలం 72 గంటల ముందు చెప్పారని, సీఎం దీక్ష ఎలా విజయవంతం చేయాలి? అసలు జనం వస్తారో? రారో? అనే భయం పట్టుకుందని, ఎలాగోలా ఏర్పాట్లు చేసామని బాబూరావు చెప్పడం గమనార్హం.

జనంలేక వెలవెల:  ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో ఉదయం సీఎం దీక్ష ప్రారంభమైన నాటి నుంచి జనం కనిపించేలా చేయడానికి అధికారులు నానా తంటాలు పడ్డారు. ముఖ్యమంత్రి దీక్ష చేసే 12 గంటల్లో ప్రతి నాలుగు గంటలకు ఒక షిఫ్టు చొప్పున కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులను తరలించారు. కుర్చీలు ఖాళీగా కనిపిస్తాయనే భయంతో వచ్చిన వారిని బయటకు వెళ్లనివ్వలేదు. గుంటూరు జిల్లాలో 1,090 ఆర్టీసీ బస్సులు ఉండగా సగం బస్సులను దీక్షకు జనాన్ని తరలించేందుకు కేటాయించారు. సాయంత్రం మూడు గంటలకు సభా  ప్రాంగణం సగానికిపైగా ఖాళీ కావడం గమనార్హం. సీఎం ఉపన్యాసం ప్రారంభించేసరికి జనం పల్చగానే మిగిలారు. 

ఫలితం దక్కని ‘దీక్ష’
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన ధర్మపోరాట దీక్షకు రాజకీయంగా మద్దతు కరువైంది. ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కూడా చంద్రబాబు దీక్షకు మద్దతు తెలపకపోగా అసలు ఆయన దీక్షను నమ్మలేమని తేల్చి చెప్పాయి. ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు ఒకరోజు  దీక్ష చేసినా ప్రతిపక్ష పార్టీలేవీ పట్టించుకోకపోవడం టీడీపీకి చెంపపెట్టు లాంటిదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  

Advertisement
Advertisement