ముగ్గురు మొనగాళ్ల ఆదిలాబాద్‌ ఎవరికో ఆదాబ్‌

29 Mar, 2019 08:18 IST|Sakshi

టీఆర్‌ఎస్‌– కాంగ్రెస్‌– బీజేపీ మధ్య ముక్కోణ పోటీ

పార్టీల కంటే వ్యక్తుల ప్రభావమే అధికం..

లోక్‌సభ పరిధిలోని అన్ని సెగ్మెంట్లలో ‘కారు’దే స్పీడ్‌

ఆదిలాబాద్‌ అంటే గుర్తొచ్చేవి కుంతల జలపాతం.. కవ్వాల్‌ అభయారణ్యం.. గిరిపుత్రుల జనాభాతో నిండిన ఈ లోక్‌సభ స్థానంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఈ స్థానం ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. 2009 ఎన్నికల్లో ఈ సీటును టీడీపీ కైవసం చేసుకోగా, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ గోడెం నగేశ్‌ మరోసారి బరిలో నిలిచారు. ఆదివాసీల ప్రాబల్యం ఎక్కువున్న ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం రెండు పార్టీల నుంచి ఆదివాసీ తెగకు చెందిన వారు పోటీ చేస్తున్నారు. మరోవైపు లంబాడీ వర్గానికి చెందిన అభ్యర్థి పోటీ పడుతుండడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పాగా వేయడంతో పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు ఖాయమని ఆ పార్టీ ధీమాగా ఉంది. గత ఎన్నికల్లో నగేశ్‌ 1,71,290 మెజార్టీతో గెలుపొందారు. మెజార్టీ మరింత పెంచుకునేందుకు టీఆర్‌ఎస్‌ పక్కాగా పావులు కదుపుతోంది.

లోక్‌సభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌
ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున ఆదివాసీ వర్గానికి చెందిన గోడెం నగేశ్‌ బరిలో ఉండగా.. బీజేపీ నుంచి సోయం బాపూరావు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి లంబాడీ వర్గానికి చెందిన రమేశ్‌ రాథోడ్‌ నిలబడ్డారు. ఆదివాసీ వర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో ఆదివాసీల మద్దతుపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, తెలంగాణ సెంటిమెంట్‌తో టీఆర్‌ఎస్‌కు ఆదరణ పెరుగుతోంది. కేంద్రంలో మోదీ మాయాజాలాన్ని వినియోగిస్తున్న బీజేపీ.. దేశభక్తి, దేశాభివృద్ధి నినాదంతో ముందుకెళ్తోంది. ఇద్దరు అభ్యర్థులు ఆదివాసీ ఓట్లను చీలిస్తే విజయం వరిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. క్షేత్రస్థాయిలో కొంత బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఏ మేరకు విజయతీరాలకు చేరుతుందో చూడాలి.

నిర్మల్‌: టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు కంచుకోటైన ఈ సెగ్మెంట్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి టీఆర్‌ఎస్‌ గెలుపొందింది. అంతకు ముందు ఎన్నికల్లో బీఎస్‌పీ నుంచి పోటీచేసి గెలుపొందిన ఇంద్రకరణ్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లోనూ ఆయన మరోసారి గెలుపొందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమా ఆ పార్టీలో ఉంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి గత ఎన్నికల్లో 9 వేల ఓట్లతో ఓడిపోయారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పెద్దగా పాల్గొనడం లేదు. మరోవైపు కాంగ్రెస్‌ అభ్యర్థి సైతం ఇక్కడ పెద్దగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించలేదు. సంప్రదాయ ఓటుబ్యాంకుపైనే ఆ పార్టీ నమ్మకం పెట్టుకున్నట్టుంది. ఈ  నియోజకవర్గంతో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మంచి సంబంధాలున్నాయి. ఇది ఎంతోకొంత లాభిస్తుందని బీజేపీ అంచనా. నిర్మల్‌ పట్టణ ప్రాంతంలోనూ బీజేపీకి కొంత పట్టుంది.

ముథోల్‌: 2014 ఎన్నికల్లో గెలుపొందిన జి.విఠల్‌రెడ్డి (కాంగ్రెస్‌) ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేసి మరోసారి గెలిచారు. ఆయన పార్టీ మారడంతో ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ బలహీనమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పతనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కిందిస్థాయి కేడర్‌ బలంగా ఉండడంతో టీఆర్‌ఎస్‌ బలీయశక్తిగా మారింది. గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో ఉంది.

బోథ్‌: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. బాపూరావు 7 వేల ఓట్లతో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. మరోవైపు ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గోడెం నగేశ్‌ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇంకోవైపు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతారనే ప్రచారం ఉంది. నాయకత్వలేమితో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో మరింత బలహీనమైంది. ఈ నియోజకవర్గంలో గిరిజన ఓట్లు చీలే అవకాశం ఉంది.

ఆదిలాబాద్‌: ఈ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మారుతోంది. టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరిన జోగు రామన్న వరుసగా మూడుసార్లు గెలుపొందా రు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ  30వేల ఓట్లతో గెలుపొందారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఓట్లు కురిపిస్తాయని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ఇక్కడ మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌ పార్టీ.. క్షేత్రస్థాయిలో కేడర్‌ సైతం బలహీనం కావడంతో ఎదురీదుతోంది. ఈ పార్టీ కంటే బీజేపీ కాస్తంత ఇక్కడ బలంగానే ఉంది.

ఆసిఫాబాద్‌: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆత్రం సక్కు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవా లక్ష్మిపై 170 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తాజాగా ఈయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. ఎమ్మెల్యే పార్టీ మారడం, కింది స్థాయిలో చెప్పుకోదగ్గ నాయకత్వం లేకపోవడంతో పార్టీ మరింత బలహీనపడింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ కేడర్‌ పెంచుకుంటోంది. బీజేపీకి పెద్దగా బలం లేకున్నా.. ఆ పార్టీ అభ్యర్థికి చెందిన సామాజిక వర్గం ఓట్లు కలిసి వస్తాయనే ఆశతో ఉంది.

సిర్పూర్‌: ఈ సెగ్మెంట్‌లో గిరిజన ఓట్లు ప్రభావితం చేస్తాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప (టీఆర్‌ఎస్‌) గెలుపొందారు. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన పాల్వాయి హరిబాబు రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రమేశ్‌ రాథోడ్‌కు ఈ నియోజకవర్గంతో సత్సంబంధాలున్నాయి. హరిబాబుకు సైతం నియోజకవర్గంలో ఇమేజ్‌ ఉండడం కాంగ్రెస్‌కు అనుకూలించే అంశం. బీజేపీకి ఇక్కడ పట్టుంది.

ఖానాపూర్‌: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన రమేశ్‌ రాథోడ్‌ ప్రస్తుతం అదే పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆయనపై కొంత సానుభూతి ఉందని అంచనా. అయితే ఇది ఓటుగా మారుతుందా లేదా చూడాలి. మరోవైపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆ పార్టీ అభ్యర్థికి లాభం చేకూర్చే అవకాశం ఉంది. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థికి కూడా గణనీయంగా ఓట్లు లభించే అవకాశాలున్నాయి.

దేశమంతా ఇటువైపే చూస్తోంది– గోడెం నగేశ్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు యావత్‌ దేశాన్ని ఆకర్షించాయి. రైతుబంధు కార్యక్రమాన్ని ఏకంగా కేంద్ర ప్రభుత్వమే అనుకరిస్తోంది. ఆసరా పింఛన్లు, ఉచిత కరెంటు తదితర వాటన్నిటినీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేస్తున్నాయి. దేశానికి దిక్సూచిగా రాష్ట్ర పాలన సాగుతోంది. ఇంతటి ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుంది. అలాంటి నేత జాతీయ స్థాయిలో ముందుకెళ్లాలంటే అత్యధిక సీట్లు గెలిపించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిని దక్కించుకోవాలి. కొత్తగా మరింత అభివృద్ధి జరగాలంటే ఇక్కడున్న పార్టీకే ప్రజలు మద్దతునివ్వాలి. క్షేత్రస్థాయిలో టీఆర్‌ఎస్‌కు అనూహ్య మద్దతు వస్తోంది. మళ్లీ టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నాం. తప్పకుండా ఎక్కువ సీట్లు గెలుస్తాం. రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి వైపు తీసుకెళ్తాం.

సామాన్యుడు నిలవాలంటే కాంగ్రెస్‌ గెలవాలి– రమేశ్‌ రాథోడ్, కాంగ్రెస్‌ అభ్యర్థి
కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ సామాన్యుడికి వాతలు పెడుతోంది. నోట్లరద్దు, జీఎస్టీతో కార్పొరేట్లకే లబ్ధి కలిగింది. సామాన్యుడు మరింత పతనమయ్యాడు. కాంగ్రెస్‌ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది. పన్నుల సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్‌తోనే సాధ్యం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తాం. పేదలకు నెలవారీ ఆదాయం రూ.6 వేలు ఇస్తాం. 2014 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో 14 మంది ఎంపీలు ఉంటే ఏం చేశారో చెప్పాలి. ప్రస్తుత ఎంపీ తన నియోజకవర్గంలోని ఎన్ని గ్రామాలు తిరిగాడో చెప్పాలి. గెలిచిన తర్వాత ఊరెరగని ఆయన ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతడు?. డబ్బు రాజకీయాలు చేసే టీఆర్‌ఎస్‌ మోసçపు∙చర్యలను ప్రజలు గుర్తిస్తున్నారు.

దేశాభివృద్ధికి మోదీ అవసరం –  సోయం బాపూరావు, బీజేపీ అభ్యర్థి
గడిచిన ఐదేళ్లలో భారత్‌ అనూహ్య వృద్ధి సాధించింది. ప్రపంచ దేశాల్లోనే మనం ముందు వరుసలో నిలబడ్డామంటే అందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీనే కారణం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశ అభివృద్ధి, రక్షణ, సమగ్రతకు సంబంధించినవి. ఐదేళ్లలో కేంద్రం రాష్ట్రానికి సంతృప్తికర స్థాయిలో నిధులిచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం బదనాం చేసింది. ఆదిలాబాద్‌ టు హైదరాబాద్‌ వయా ఆర్మూర్‌ రైల్వేలైన్‌ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వలేదు. రిమ్స్‌కు కేంద్రం వాటా విడుదలైనా.. రాష్ట్ర సర్కారు ఖర్చు చేయలేదు. ఎండాకాలంలో బాసర లో గోదావరి వట్టిపోతోంది. దేవాదాయ మంత్రి జిల్లా వాడే అయినా బాసర సరస్వతీ దేవాలయ అభివృద్ధి మాత్రం జరగదు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఆసిఫాబాద్‌లో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తాం.

బాధ్యతగా ఉపాధి కల్పన– ఇందారపు రాజేశ్వర్‌రావు, పేపర్‌ మిల్లు ఉద్యోగి
సిర్పూర్‌ పేపర్‌ మిల్లు తెరుచుకోవడంతో నాలుగు వేల మందికి తిరిగి ఉపాధి లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కార్యక్రమాలకు పెద్దపీట వేసింది. పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఖాయిలా పడ్డ వాటిని తిరిగి తెరిపించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏళ్లుగా మూతపడ్డ పేపర్‌ మిల్లు తెరుచుకుంది. రాష్ట్ర ప్రభుత్వ రాయితీతోనే మిల్లు తిరిగి ప్రారంభమైంది.

నాలుగేళ్ల యాతన తీరింది..– అమర్‌కుమార్, కార్మికుడు
పేపర్‌ మిల్లు మూత పడడంతో నాలుగేళ్ల పాటు ఉపాధి కోసం ఎక్కడెక్కడో తిరిగి నరకయాతన పడ్డాం. పిల్లల చదువులు, కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో సమస్యకు పరిష్కారం దొరికింది. సీఎం కేసీఆర్‌ చొరవతో మిల్లు తెరుచుకుంది. వేలాది కుటుంబాలకు మళ్లీ ఉపాధి లభించింది.

రైతు సంక్షేమ సర్కారు – జే.మారన్న, రైతు, కొట్టపల్లి(కే), లక్ష్మణచాంద మండలం
రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. రైతుబంధు దేశంలోనే ఎక్కడా లేదు. ప్రభుత్వం ఇచ్చే డబ్బు పెట్టుబడి సాయం కింద బాగా ఉపయోగపడుతుంది. రైతుబీమా కూడా మంచి కార్యక్రమం. రైతు చనిపోతే అతని కుటుంబానికి ఆర్థిక సాయం దక్కుతుంది. గతంతో పోలిస్తే పంటల మద్దతు ధర పెరిగింది.

ఆసరా అందుతుంది – టి.సారిక, తానూరు, బీడీ కార్మికురాలు
ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడంతో బీడీ కార్మికులుగా మారుతున్నాం. ఈ వృత్తిలో వచ్చే ఆదాయం అంతంతే. అందుకు ఆసరాగా ప్రభుత్వం పెన్షన్‌ ఇస్తోంది. వచ్చే నెల నుంచి రూ.2 వేలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మద్దతిస్తే భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ పథకాలు చేపడతారని ఆశిస్తున్నాం.

గిరిజన జిల్లాపై చొరవ తీసుకోవాలి.– తుల అరుణ్‌కుమార్, సోనాల, బోథ్‌
గిరిజన జిల్లా ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రోడ్డు సౌకర్యాలు కల్పించింది. ఇంకా కొన్ని పల్లెల్లో రోడ్లు వేయాలి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కడా పరిశ్రమలు లేవు. ఇక్కడ నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. గోదావరి పారే ఈ జిల్లాలో ప్రాజెక్టులు లేవు. దీంతో రైతులు కరువుతో నష్టాల పాలవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం జిల్లాలో సరిగా అమలు కావడం లేదు. పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేస్తే ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది.

అభివృద్ధి చేసే వాళ్లకే మద్దతు– సుభాశ్, పెంబి మండలం, ఖానాపూర్‌ నియోజకవర్గం
పూర్తిగా గిరిజన ప్రాంతమైన ఖానాపూర్‌ అభివృద్ధిలో చాలా వెనుకబడింది. మెజార్టీ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా అభివృద్ధి కార్యక్రమాలు అంతంతగానే సాగుతున్నాయి. చాలా పల్లెలకు ఆర్టీసీ బస్సులు కూడా వెళ్లలేని పరిస్థితి. మా ప్రాంతం అభివృద్ధి కోసం పోరాడే వాళ్లకే మద్దతు ఇస్తాం.

రాయితీ రుణాలేవీ..– ఉపాలి, రైతు, ఖానాపూర్‌
సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం పలు రకాల రాయితీ రుణాలిస్తున్నట్లు చెబుతోంది. కానీ అవి కిందిస్థాయిలోని ప్రజలకు చేరడం లేదు. వీటిని నిజమైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలి. పక్కా ప్రణాళికతో ఎంపిక చేసి అమలు చేస్తే నిరుద్యోగులకు లబ్ధి కలుగుతుంది.

మాకు ప్రత్యేక సాయం చేయాలి– బి.శేఖర్, కొయ్యబొమ్మల కళాకారుడు, నిర్మల్‌
వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఆసరా పింఛన్లతో వృద్ధులు, కళాకారులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. అదే తరహాలో నిర్మల్‌ కొయ్యబొమ్మ కళాకారులకు కూడా ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అందిస్తే బాగుంటుంది. ప్రత్యేక రాయితీలు ఇస్తే కొయ్యబొమ్మల పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుంది. అదేవిధంగా చిన్నతరహా పరిశ్రమల కింద రుణాలు ఇస్తే కొయ్యబొమ్మల పరిశ్రమను మరింత విస్తరించొచ్చు. వేలాది కుటుం బాలకు ఉపాధి దొరుకుతుంది.- గ్రౌండ్‌ రిపోర్టు.: చిలుకూరి అయ్యప్ప

లోక్‌సభలోని సెగ్మెంట్లు
సిర్పూర్‌ కాగజ్‌నగర్,ఆసిఫాబాద్‌ (ఎస్టీ),ఖానాపూర్‌ (ఎస్టీ), ఆదిలాబాద్,బోథ్‌ (ఎస్టీ), నిర్మల్, ముథోల్‌

లోక్‌సభ ఓటర్లు
పురుషులు 7,52,649
మహిళలు 7,25,961
ఇతరులు 52
మొత్తం ఓటర్లు 14,78,662

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు