ఏపీతో నాది కుటుంబ సంబంధం | Sakshi
Sakshi News home page

ఏపీతో నాది కుటుంబ సంబంధం

Published Mon, Apr 1 2019 8:25 AM

AICC Chief Rahul Gandhi Election Campaign In Anatapur - Sakshi

సాక్షి, అనంతపురం:  ‘‘నాన్నమ్మ కాలం నుంచి ఆంధ్రప్రదేశ్‌తో మా కుటుంబానికి కేవలం రాజకీయ సంబంధమే కాకుండా కుటుంబ సంబంధం ఉంది’’ అని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాహుల్‌గాంధీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పర్యటించారు. కళ్యాణదుర్గం పట్టణ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. అయితే ఆయన షెడ్యూలు కన్నా గంట ఆలస్యంగా 4 గంటలకు వేదిక వద్దకు వచ్చారు. దీంతో ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో వచ్చిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆయన రాకముందు వేదికపైనున్న కాంగ్రెస్‌ పార్టీ అనంతపురం, హిందూపురం పార్లమెంటు అభ్యర్థులతో పాటు వివిధ అసెంబ్లీ అభ్యర్థులు ప్రసంగించారు.

కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డిని గెలిపించాలంటూ అభ్యర్థించారు. రాహుల్‌గాంధీ ప్రసంగానికి ముందు కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధిని కోరుకుంటున్న వ్యక్తి రాహుల్‌ అన్నారు. పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి కూతురు అమృతావీర్‌ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తు కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ ఇక్కడికి వచ్చారని, మళ్లీ ప్రధాని అయిన తర్వాత కళ్యాణదుర్గం రావాలని కోరారు.  



నీళ్ల కోసం ఇబ్బందులు 
రాహుల్‌గాంధీ పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సబాస్థలికి  కనీసం నీటిప్యాకెట్లను కూడా అనుమతించలేదు. గంటలపాటు ఎదురుచూసిన ప్రజలు తీవ్ర దాహంతో అల్లాడిపోయారు. ఎండలో బందోబస్తులో ఉన్న పోలీసులు, చివరికి కవరేజీకి వెళ్లిన మీడియా ప్రతినిధులు కూడా తాగునీళ్లకు ఇబ్బందులు పడ్డారు. కనీసం కూర్చోవడానికి చైర్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో మీడియాప్రతినిధులు రెండు గంటలపాటు నిలుచునే ప్రోగ్రాం కవర్‌ చేశారు.  

పాపం రఘువీరా 
కళ్యాణదుర్గం అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘువీరారెడ్డికి ఓట్లు వేయాలని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్‌ అభ్యర్థించకపోవడంతో రఘువీరా బిక్కమొహం వేశారు. దాదాపు 35 నిముషాలు ఆంగ్లంలో ప్రసంగించిన రాహుల్‌ గాంధీ మాటలను... రఘువీరారెడ్డి తెలుగులో అనువాదం చేశారు. రాష్ట్రంలో పార్టీని గెలిపించాలని కోరారు తప్ప కళ్యాణదుర్గంలో రఘువీరారెడ్డిని గెలిపించాలని రాహుల్‌ కోరలేదు. రాహుల్‌ వైఖరిపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులతో పాటు ప్రజలు చర్చించుకోవడం కనిపించింది.    

క్వాటర్‌ బాటిల్‌.. కర్ణాటక జనం 
కళ్యాణదుర్గం: ఎన్ని...వ్యూహాలు రచించినా...ఆదరణ లభించలేదు. ఓటు బ్యాంకు పెరగలేదు. తాయిలాలతో ఎర చూపినా బలం పుంజుకోలేదు. చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని ఎన్నికల ప్రచార సభకు తీసుకువచ్చి కాంగ్రెస్‌కు బలముందని, ప్రత్యేకించి రఘువీరారెడ్డికి జనాదరణ ఉందని చాటుకోవడానికి పీసీసీ అధ్యక్షుడు పడరాని పాట్లు పడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మొదటిసారిగా కళ్యాణదుర్గం వస్తుండటంతో భారీ జనసమీకరణచేయాలని భావించారు. అయితే స్వచ్ఛందంగా జనం వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో రఘువీరారెడ్డి భారీగా డబ్బు ఖర్చు చేశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఒక్కో వ్యక్తికి క్వాటర్‌ బాటిల్‌ మద్యం, బిర్యానీలు, రూ.200 కూలీ ముట్టజెప్పి జనాన్ని తీసుకువచ్చారు.

మరోవైపు  కర్ణాటకలోని పరుశురాంపురం, చెళ్ళికెర, చిత్రదుర్గం, జాజూరు తదితర ప్రాంతాల స్థానిక కాంగ్రెస్‌ నాయకులు భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. ఉదయం నుంచి పలు వాహనాల్లో శెట్టూరు మీదుగా కర్ణాటక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తరలి రావడం కనిపించింది. అందువల్లే రాహుల్‌ సభ ఆవరణలో వందలాది కర్ణాటక వాహనాలు కనిపించాయి. వచ్చిన వారంతా కన్నడలో మాట్లాడటం కనిపించింది. అయినా ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి తగ్గట్టుగా జనం రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.   

Advertisement
Advertisement