సీఎం జగన్‌కు అందరూ సహకరించాలి: ఆళ్ల నాని

27 Jan, 2020 13:07 IST|Sakshi

సాక్షి, అమరాతి : చంద్రబాబు నాయుడు రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ల వైఖరి కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విడిపోవడానికి కారణమని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ధ్వజమెత్తారు. శాసన మండలి రద్దు తీర్మానంపై మంత్రి సభలో చర్చ సందర్భంగా రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని, ప్రాంతీయ అసమానతలు రాకుడదన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖ, అమరావతి, కర్నూలు రాజధానుల ఏర్పాటు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.(మండలి రద్దుకు తీర్మానం ప్రతిపాదించిన సీఎం జగన్)

చంద్రబాబుతోపాటు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు కొనుగోలు చేసిన వారికోసం బాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయ ప్రయోజనాల కోసం సోనియాతో కుమ్మకై.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనకు చంద్రబాబు సహకరించారని మండిపడ్డారు. విభజనతో హైదరాబాద్‌లాంటి మహా నగరాన్ని కోల్పోయామని, రాష్ట్రం రెండుగా విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌ పిల్లల భవిష్యత్తును కోల్పోయామని అన్నారు. గత అయిదేళ్లలో చంద్రబాబు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం సీఎం జగన్‌ అలుపెరగని పోరాటం చేశారని, హోదా కోసం పోరాటం చేసిన వారిపై చంద్రబాబు అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అమరావతి పేరుతో అభివృద్ధిని కేంద్రీకరిస్తుందని ప్రజలు భయపడ్డారని, శివరామకృష్ణ కమిటీ కూడా అమరావతిలో రాజధాని వద్దని చెప్పిందని తెలిపారు. చంద్రబాబు నారాయణ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. (అందుకే చంద్రబాబు సభకు రాలేదు: ధర్మాన)

చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆళ్ల నాని విమర్శలు గుప్పించారు. గత ఏడు నెలల్లో పశ్చిమగోదావరి జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో స్వయంగా చూపిస్తానని, అభివృద్ధిని చూసేందుకు టీడీపీ నేతలు రావాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా చేసిన ఘనత సీఎం జగన్‌ది అని, ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని బాబు ఎప్పుడైనా ప్రయత్నించారా అని ప్రశ్నించారు. మూడు నెలల్లోనే సీఎం వైఎస్‌ జగన్‌ రూ. 700 వందల కోట్లతో కిడ్నీ రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభించారని, డయాలసిస్‌ సెంటర్‌, తాగునీటి సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు. (చంద్రబాబు వాదనలో పస ఉంటే చర్చకు రావాలి)

అధికార వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆళ్లనాని పేర్కొన్నారు. రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారుల ప్రయోజనాలే బాబుకు ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవని విమర్శించారు. మండలి గ్యాలరీలో కూర్చొని సభను ప్రభావితం చేయడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు సలహాలు, సూచనలు ఇవ్వడానికే మండలి ఏర్పాటు జరిగిందని అన్నారు. మండలిలో టీడీపీ సభ్యులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకునేలా ప్రయత్నించారని, ప్రజలే చంద్రబాబుకు గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌కు అందరూ సహకరించాలని సూచించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా