శివసేనతో సయోధ్య.. రంగంలోకి షా | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 5 2018 3:55 PM

Amit Shah Will Meet Uddhav Thackeray - Sakshi

న్యూఢిల్లీ : మిత్రపక్షం శివసేనతో తిరిగి సయోధ్య కుదుర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారభించింది. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేను బుధవారం సాయంత్రం కలవనున్నారు. ముంబైలోని ఉద్దవ్‌ నివాసంలోనే ఈ భేటీ జరగనున్నట్టు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. అమిత్‌ షా కోరిక మేరకే ఈ సమావేశం ఏర్పాటుచేశామని తెలిపారు.  గత కొంతకాలంగా బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడుతన్న శివసేనతో అమిత్‌ షా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర ఫలితాలు చవిచూసిన బీజేపీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టిందనే వార్తలు వెలువడుతున్నాయి. పాల్ఘర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఇరు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం  సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. బీజేపీ తమకు రాజకీయ శత్రువు అని అన్నారు. శివసేన నేతలు కూడా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2019  సార్వత్రిక ఎన్నికల్లో శివసేన మద్దతు కూడగట్టేందుకు అమిత్‌ షా ప్రయత్నాలు ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే కాలంలో రెండు పార్టీలు తిరిగి ఏకతాటిపైకి వచ్చే అవకాశం లేకపోలేదని వారు అంటున్నారు.

సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ.. పాల్ఘర్‌ ఉప ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేశామని తెలిపారు. తాము ఓడిపోయినప్పటికీ ఈ ఎన్నికల్లో భారీగా ఓట్లు సాధించామన్నారు. విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి రాజేంద్ర మెజార్టీ 29, 572 ఓట్లు మాత్రమేనని గుర్తుచేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒకదాని తర్వాత ఒకటి కూటమిని వీడుతున్నాయని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయనున్నారని మీడియా ప్రశ్నించగా.. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని రౌత్‌ వెల్లడించారు.

Advertisement
Advertisement