1974 నాటికి నేటికి తేడా ఉందా? | Sakshi
Sakshi News home page

1974 నాటికి నేటికి తేడా ఉందా?

Published Wed, Jun 27 2018 4:00 PM

Is Any Difference Between 1974 And Todays Situation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి) విధించడం కాంగ్రెస్‌ చేసిన పాపమంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విమర్శించడమే కాకుండా అది రాజ్యాంగాన్ని కాలరాయడం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని కూడా ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం కూడా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యారోపణలు చేసింది. ఇందులో ఎవరి మాటల్లో ఎంత నిజం ఉంది? నాడు ఎమర్జెన్సీ విధించడానికి దారితీసిన 1974 పరిస్థితులు నేడున్నాయా?

తాను కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం కోసం నాటి ఎమర్జెన్సీ గురించి ప్రస్థావించడం లేదని, నాటి పరిస్థితులు గురించి తెలుసుకొని భవిష్యత్తులో మరోసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం, బాధ్యత నేటి, భవిష్యత్‌ తరాలపై ఉందని కూడా మోదీ వ్యాఖ్యానించారు.

ఇంతకు ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు ఏమిటీ? నేటి పరిస్థితులకు నాటి పరిస్థితులకు పోలికలేమైనా ఉన్నాయా? కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తున్నట్లు నేడు అప్రకటిత అత్యయిక పరిస్థితి ఉందా? దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం నేటి లేదా భవిష్యత్‌ తరాలకు వస్తుందా?

1973లో పలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల పాలనపై ప్రజలు విసిగెత్తారు. ముఖ్యంగా అవినీతికి వ్యతిరేకంగా ముందుగా గుజరాత్‌లో, ఆ తర్వాత బీహార్‌లో తిరుగుబాటు తలెత్తింది. కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు రాజీనామా చేయాలంటూ, ప్రభుత్వాలను రద్దు చేయాలంటూ పట్టణ మధ్య తరగతికి చెందిన యువకులు తిరుగుబాటు లేవనెత్తారు. ఇందిరాగాంధీ రాజకీయ విధానాలను వ్యతిరేకిస్తున్న అగ్రవర్ణాల వారు, ఉన్నత వర్గాల వారు, వ్యాపారస్థులు, పారిశ్రామికవేత్తలు, ప్రొఫెషనల్స్‌ తిరుగుబాటుకు మద్దతు తెలిపారు.

ఇందిర ప్రభుత్వం దళితులు, ఎస్సీలు, ఎస్టీలను రాజకీయ రంగంలోకి తీసుకరావడం, వారి సంక్షేమం కోసం ఉచిత, ఆకర్షణీయ పథకాలను అమలు చేయడం కూడా వారికి ఆగ్రహం తెప్పించింది. అప్పటికే పాలనా వ్యవస్థలో పేరుకు పోయిన అవినీతిని ఆయుధంగా చేసుకొని ఆ వర్గాల వారంతా తిరుగుబాటు లేవనెత్తారు. 1974లో జరిగిన రైల్వే సమ్మెను అణచివేయడం ఉద్యమాలకు మరింత ఊపునిచ్చింది.

దళితులు, బడుగువర్గాల సంక్షేమం పేరిట సీపీఐతో సత్ససంబంధాలు పెట్టుకున్న ఇందిరాగాంధీ వామపక్ష భావాలు కలిగిన వీఆర్‌ కృష్ణ అయ్యర్‌ను 1973లో సుప్రీం కోర్టు జడ్జీగా నియమించారు. ముగ్గురు జడ్జీల సీనియారిటీ కాదని ఆయన్ని సుప్రీం కోర్టు జడ్జీగా నియమించడం వివాదాస్పదమైంది(పేదలు, బడుగు వర్గాల ప్రజలకు న్యాయం అందుబాటులో ఉండాలన్న ఉద్దోశంతో ఎన్నో న్యాయ సంస్కరణలను తీసుకొచ్చిన కృష్ణ అయ్యర్‌ కేరళ వామపక్షాల ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1971 నుంచి 1973 వరకు లా కమిషన్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు).

1975లో పార్లమెంట్‌ సభ్యురాలిగా ఇందిరాగాంధీ ఎన్నికను అలహాబాద్‌ హైకోర్టు కొట్టివేసి ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. ఈ తీర్పును ఇందిర సుప్రీం కోర్టులో సవాల్‌ చేయగా, ఆమె నియమించిన జడ్జీ వీఆర్‌ కృష్ణ అయ్యర్‌ అలహాబాద్‌ తీర్పుపై షరతులతో కూడిన స్టేను మంజూరు చేశారు. బేషరతుగా స్టేను ఇవ్వనందుకు అప్పట్లో ఆయన్ని ప్రశంసించిన ప్రజలు కూడా ఉన్నారు. ఈ తీర్పు నేపథ్యంలో ఇందిరను ప్రధాని పదవికి రాజీనామా చేయలంటూ ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడంతో ఆ మరుసటి రోజే ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే వీఆర్‌ కృష్ణ అయ్యర్‌ తీర్పును వ్యతిరేకిస్తూ నలుగురు సుప్రీం జడ్జీలు తమ పదవులకు రాజీనామా చేశారు.

1971లో ఇందిరాగాంధీ నాయకత్వాన కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ దేశంలో ఆర్థిక ప్రగతి మందగించడం, నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, గుజరాత్, బీహార్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై అంతులేని అవినీతి ఆరోపణలు రావడం ఇందిర పాలన పట్ల ప్రజల్లో అసంతృప్తి రాజేసింది. పార్టీలో ఇందిర ఏకఛత్రాదిపత్యం చెలాయించడం పార్టీ సీనియర్‌ నాయకులకు, రాష్ట్రాల నాయకులకు ఏమాత్రం నచ్చలేదు. తోటి నాయకుల అభిప్రాలను కాదని ఆమె ఆనాడు వివి గిరిని రాష్ట్రపతిని చేశారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను ముందే దెబ్బతీసిన ఇందిర ఎమర్జెన్సీ పేరిట ఇటు న్యాయవ్యవస్థ, అటు పత్రికా స్వేచ్ఛను హరించి వేశారు.

మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఉండే కార్లను దేశీయంగా ఉత్పత్తి చేయాలనుకున్న ఇందిర పెద్ద కుమారుడు సంజయ్‌ గాంధీ ‘1971’లో మారుతి సంస్థను తీసుకొచ్చి అందులో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలపై ఒత్తిడి తెచ్చారు. అది కూడా పారిశ్రామిక వేత్తల ఆగ్రహానికి కారణమైంది(సంజయ్‌ సూచన మేరకు ‘పీపుల్స్‌ కార్‌’ను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు ఇందిర కేబినెట్‌ ఆమోదించింది. సూర్యరామ్‌ మారుతి టెక్నికల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌గా ఏర్పడిన ఆ సంస్థకు సంజయ్‌ తొలి డైరెక్టర్‌గా వ్యవహరించారు).

దేశ పురోభివృద్ధికి పెరుగుతున్న అధిక జనాభే కారణమన్న ఉద్దేశంతో కుటుంబ నియంత్రణను దౌర్జన్యంగా సంజయ్‌ గాంధీ అమలు చేయించడం కూడా ప్రజల ఆగ్రహానికి కారణమైంది.  మానవ హక్కులు కూడా పూర్తిగా హరించుకు పోవడంతో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జనసంఘ్, సీపీఎం, నక్సలైట్లు, జయప్రకాష్‌ నారాయణ్‌ తదితరులు ఉద్యమాలు నిర్మించారు. జయప్రకాష్‌ నారాయణ్‌ 1974లోనే బీహార్, గుజరాత్‌ ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

నాటి పరిస్థితులు నేడున్నాయా?
నాటి లాగే నేడు కూడా ఆర్థిక మాంద్య పరిస్థితులు దేశంలో కొనసాగుతున్నాయి. జాతీయ స్థూల ఉత్పత్తి ఏడు శాతాన్ని దాటలేదు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలను కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అందులో మూడో వంతు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. నాటి ఇందిర ‘గరీబీ హఠావో’ నినాదం లాగానే నేడు మోదీ ‘సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌’ అబాసు పాలయింది. నాటి అవినీతి మరకలు నేడు లేకున్నా ‘పెద్ద నోట్ల రద్దు’తో బీజేపీ నేతలు లాభ పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి.

నాడు కాంగ్రెస్‌ ప్రాభవానికి వన్నె తగ్గినట్లే నేడు బీజేపీ ప్రాభవం పడిపోతోంది. నాడు కాంగ్రెస్‌పై మధ్య తరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు తిరుగుబాటు చేయగా, నేడు బీజేపీకి వ్యతిరేకంగా దిగువ తరగతి, దళితులు, నిమ్న వర్గాల ప్రజలు, కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఆనాటి స్థాయిలో ఆందోళనలు, అరెస్ట్‌లు నేడు కనిపించకపోయినా అశాంతి పరిస్థితులు మాత్రం ఉన్నాయి.

గోరక్షణ పేరిట, హిందూత్వం పేరిట దాడులు జరుగుతున్నాయి. కోర్టు పాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా నలుగురు సీనియర్‌ సుప్రీం కోర్టు జడ్జీలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం, కొలీజియం చేసిన సిఫార్సులను రెండు సార్లు ప్రధాని కార్యాలయం తిరస్కరించడం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను ప్రశ్నిస్తోంది. మీడియాపై కూడా అప్రకటిత ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇందిరకు మోదీకి తేడా ఏమిటీ?
నాడు ఇందిరా గాంధీ ఏకఛత్రాధిపత్యంగానే దేశాన్ని పాలించారు. దాదాపు అదే స్థాయిలో నేడు నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారు. ఎలాంటి కఠోర నిర్ణయాలను తీసుకోవడానికైనా వెనకాడని మనస్తత్వం ఆమెది. ఆచితూచి వ్యవహరించకపోయినా అంతటి కఠిన నిర్ణయాలు తీసుకునే సాహసం మోదీ చేయలేరు.

Advertisement

తప్పక చదవండి

Advertisement