టీడీపీతో తెగదెంపులు.. బీజేపీ కీలక నిర్ణయం! | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 5:07 PM

AP BJP Leaders meet Amit Shah - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్డీయేతో టీడీపీ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలను బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్‌కు అప్పగిస్తూ.. నిర్ణయించింది. ఏపీ టీడీపీ నేతలు శనివారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో భేటీ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అమిత్‌ షాతో జరిగిన ఈ భేటీలో ఏపీ నేతలు రాం మాధవ్, పురందేశ్వరీ, హరిబాబు, కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాల రావు, సతీష్ జీ, విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలగడం.. బీజేపీతో దోస్తీ కటీఫ్‌ చెప్పి.. ఆ పార్టీనే టార్గెట్‌గా చేస్తూ.. సైకిల్‌ పార్టీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహం, టీడీపీని ఎలా ఎదుర్కోవాలి? బీజేపీపై, కేంద్రంపై  విమర్శలు చేస్తున్న ఇతర పార్టీలపై ఎలాంటి వైఖరి అనుసరించాలనే దానిపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని భావించారు. బీజేపీపై ఆరోపణలు చేయడమే కాకుండా ఏకంగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టేందుకు చంద్రబాబు సిద్ధపడటంతో ఇక ఆ పార్టీ విషయంలో దూకుడుగా ముందుకువెళ్లాలని, చంద్రబాబు పరిపాలనలోని అవకతవకలను టార్గెట్‌ చేయాలని బీజేపీ ఏపీ నేతలు భావిస్తున్నారు.

ఏపీ బీజేపీలో నాయకత్వ మార్పు
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న హరిబాబు పదవీకాలం ముగిసిపోయింది. అయినా, కొన్నివర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆయననే బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా అధిష్టానం కొనసాగించింది. ఇప్పుడు మారిన పరిస్థితులు, టీడీపీ తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్తవారిని నియమించే అవకాశముందని, ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి చెందిన మాణిక్యాలరావు, ఆకుల సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్ష పదవి రేసులో ముందున్నట్టు తెలుస్తోంది.

Advertisement
Advertisement