మంత్రివర్గంలోకి తీసుకోవద్దు జైట్లీ వినతి | Sakshi
Sakshi News home page

మంత్రివర్గంలోకి తీసుకోవద్దు జైట్లీ వినతి

Published Wed, May 29 2019 2:03 PM

Arun Jaitley Letter To Narendra Modi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించవద్దని మోదీని కోరారు. తీవ్రమైన ఆనారోగ్యం కారణంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేకపోతున్నానని జైట్లీ వివరించారు. అనధికారికంగా పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తానని తెలిపారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు కూడా జైట్లీ దూరంగా ఉన్నారు. కాగా కాన్సర్‌తో బాధపడుతున్న జైట్లీ జనవరిలో న్యూయార్క్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో తాత్కాలిక ఆర్థికమంత్రిగా పియూష్‌ గోయల్‌  జైట్లీ స్థానంలో బాధ‍్యతలను నిర్వహించారు.  ఫిబ్రవరి1న పార్లమెంటులో సమర్పించాల్సిన కేంద్ర మధ్యంతర బడ్జెట్‌ను కూడా గోయల్‌ ప్రవేశపెట్టారు.

జైట్లీ చాలా బలహీనంగా ఉన్నారని, అనారోగ్యం కారణంగానే ప్రధాని మోదీ రెండోసారి ఏర్పాటు చేయబోయే కేబినెట్‌లో ఉండే అవకాశాలు లేవని ఇదివరకే వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. మరింత మెరుగైన వైద్యం కోసం ఆయన బ్రిటన్‌ లేదా అమెరికా వెళ్లాల్సి ఉంటుందని తెలుస్తోంది. బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఎన్నికల అనంతరం బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎన్నికల విజయోత్సవాల్లో ఆయన పాల్గొనలేదు. జైట్లీ తప్పుకోవడంతో నూతన మంత్రివర్గంలో కీలకమైన ఆర్థికశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయంపై సర్వత్రా  ఉత్కంఠ నెలకొంది.  

కాగా బీజేపీలో సీనియర్‌ నేత అయిన జైట్లీ.. మంత్రివర్గంలో లేకపోవడం లోటేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక నిపుణిడిగా, సుప్రీంకోర్టు న్యాయవాదిగా జైట్లీ పార్టీలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. పార్టీలోనే కాదు ప్రధాని మోదీకి జైట్లీ అత్యంత సన్నిహితుడు. ఆర్థిక మంత్రిగానే కాకుండా  న్యాయవాది కావడంతో పార్టీకి, ప్రభుత్వానికి ఎన్నో కేసుల్లో లీగల్‌ సలహాదారుడిగా జైట్లీ వ్యవహరించారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించినప్పుడు రాజ్యాంగ సవరణ చేయకుండా.. కేవలం పార్లమెంట్‌ ఆమోదంతో చట్టాన్ని రూపొందించవచ్చని జైట్లీ చేసిన సూచన బీజేపీ ప్రభుత్వానికి ఎలాంటి సమస్యలు లేకుండా చేసింది. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు రూపకల్పనలో కూడా జైట్లీ పాత్ర ఎంతో ఉంది. 


 

Advertisement

తప్పక చదవండి

Advertisement