‘బీజేపీకి అతిపెద్ద సవాల్‌’ | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఇది అతిపెద్ద సవాల్‌: శత్రుఘ్న సిన్హా

Published Sat, Jun 16 2018 7:42 PM

Arvind Kejriwal Gentleman Politician Support From Shatrughan Sinha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రం హక్కుల్ని కేంద్రం కాలరాస్తుందని, ఢిల్లీలో ఐఏఎస్‌ అధికారులు ఆందోళన విరమింపజేసే విషయంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ చొరవతీసుకోవడం లేదంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, రాష్ట్రమంత్రులు ఐదురోజులుగా బైజాల్‌ ఇంట్లో  ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌ ధర్నాకు జాతీయ నాయకులు నుంచి మద్దతు అభిస్తోంది. తాజాగా బీజేపీ ఎంపీ శత్రుఘ్న సిన్హా కేజ్రీవాల్‌కు మద్దతుగా ట్వీట్‌ చేశారు.

ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్‌ చాలా బలమైనది, బీజేపీకి ఇది అతి పెద్ద సవాల్‌ అని ట్వీట్‌ చేశారు. కేజ్రీవాల్‌ పరిపాలన, ప్రభుత్వ పథకాలపై ప్రశంశలు కురిపిస్తూ.. ప్రస్తుత రాజకీయ పార్టీలకు ఆప్‌ తండ్రిలాంటి పార్టీ అని పొగడ్తల్లో ముంచెత్తారు. కేజ్రీవాల్‌ను జంటిల్‌మాన్‌గా సిన్హా అభివర్ణించాడు. ఢిల్లీలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యం హత్య కంటే అధ్వాన్నంగా ఉందని యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ విమర్శించారు.

గత ఇరవైఏళ్లుగా ఢిల్లీలో అధికారానికి దూరంగా ఉన్నందున ఢిల్లీ ప్రజలపై బీజేపీ ప్రతీకారం తీర్చుకుంటోందని ఆర్జేడీ ఛీప్, బిహార్‌ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌ ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో ప్రజా ప్రభుత్వం నడవకుండా లెఫ్టనెంట్‌ గవర్నర్‌ను అడ్డుపెట్టకుని కేంద్రం రాజకీయం చేయడం తగదని సీపీఎం జాతీయ కార్యదర్శి సితారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. 

కేజ్రీవాల్‌ ధర్నాకు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మద్దతు తెలిపారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల నుంచి కేజ్రీవాల్‌కు మద్దతు లభిస్తుంచే కాంగ్రెస్‌ మాత్రం  భిన్నంగా స్పందించింది.  ప్రజలు  ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం ఎల్‌జీ ఇంట్లో ధర్నాకి కూర్చోడం సరికాదని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్‌ కేజ్రీవాల్‌పై మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపిస్తే పాలన గాలికొదిలేసి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు.

Advertisement
Advertisement