ఆప్‌కు కీలక నేత రాజీనామా... | Sakshi
Sakshi News home page

ఆప్‌కు కీలక నేత రాజీనామా...

Published Thu, Aug 16 2018 3:39 AM

Ashutosh resigns from Aam Aadmi Party - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ వ్యవస్థాపక నేతల్లో ఒకరైన అశుతోష్‌ బుధవారం ఆప్‌కు రాజీనామా చేశారు. అత్యంత వ్యక్తిగత కారణాలరీత్యా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ‘ప్రతి ప్రయా ణానికి ముగింపు ఉంటుంది. ఆమ్‌ ఆద్మీ పార్టీతో నా అనుబంధం చాలా అందమైనది, విప్లవాత్మకమైంది. దీనికి కూడా ముగింపు ఉంటుంది. పార్టీకి రాజీనామా చేశా. పార్టీకి, నాకు ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు’ అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓ వ్యాపార వేత్తను పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా పంపడంపై అశుతోష్‌ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. అంతేగాక తనకు ఆ టికెట్‌ ఇవ్వలేదని కినుక వహిస్తున్నట్లు కొందరు పేర్కొంటున్నారు. అయితే ఈ వార్తలను ఆప్‌ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ కొట్టిపారేశారు. రాజీనామాపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. ‘‘మీ రాజీనామాను ఎలా ఆమోదించాలి. నా, ఇస్‌ జన్మ్‌ మే తో నహీ(ఈ జన్మలో ఇది సాధ్యం కాదు)’’అంటూ వివరించారు. అశుతోష్‌ జర్నలిస్ట్‌ నుంచి రాజకీయ నేతగా మారారు. రాజీనామాను వెనక్కు తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ తెలిపారు.

Advertisement
Advertisement