పాలనాదక్షుడు... | Sakshi
Sakshi News home page

పాలనాదక్షుడు...

Published Fri, Aug 17 2018 5:49 AM

Atal Bihari Vajpayee is a Powerful Politician - Sakshi

స్వేచ్ఛా వాణిజ్యానికీ, సరళతర ఆర్థిక విధానాలకు దన్ను ఇచ్చిన వాజ్‌పేయి ఆర్థిక సంస్కరణల్లో తనదైన ముద్రవేశారు. 1991లో పీవీ నరసింహరావు ప్రవేశపెట్టిన సరళీకరణ ఆర్థిక విధానాల స్ఫూర్తిని వాజ్‌పేయి కొనసాగించారు. వాజ్‌పేయి ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలనే తరువాతి ప్రధానులు కొనసాగించారు. దేశాన్ని నూతన శకంవైపు నడిపించడానికి రాజమార్గాలు వేశారు. ప్రధానంగా ‘పెట్టుబడుల ఉపసంహరణ’‘ఆర్థిక దుబారా’లాంటి ఆర్థిక సంస్కరణలను ప్రస్తుతం మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది.  

వాజ్‌పేయి హయాంలో ఆర్థిక సంస్కరణలు..
మౌలిక సదుపాయాల కల్పన: మౌలిక సదుపాయాల కల్పనకు వాజ్‌పేయి ప్రభుత్వం పెట్టింది పేరు. ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన పథకం ద్వారా దేశవ్యాప్తంగా విడివడి ఉన్న గ్రామాలన్నింటినీ కలిపే గొప్పకార్యాన్ని చేపట్టారు. దీంతో గ్రామాల నుంచి వ్యవసాయ ఉత్పాదనలు దేశ వ్యాప్తంగా రవాణా చేసేందుకు వీలు అయ్యింది. అలాగే చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబైలను కలుపుతూ గోల్డెన్‌ క్వాడ్రిలేటరల్‌ హైవే నిర్మించడంలో కృత కృత్యులయ్యారు.  
ఆర్థిక దుబారా నియంత్రణకు చట్టం...  
ఆర్థిక దుబారాని నియంత్రించేందుకు వాజ్‌పేయి ప్రభుత్వం కృషి చేసింది. ఫిస్కల్‌ రెస్పాన్సిబిలిటీ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఆర్థిక దుబారా నియంత్రణకు వాజ్‌పేయి ప్రభుత్వం పూనుకుంది. 2000 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 0.8 శాతంగా ఉన్న ప్రభుత్వ రంగ పొదుపుని 2005 కల్లా 2.3 శాతానికి వృద్ధి చేసిన ఘనత వాజ్‌పేయిదే. జీడీపీ సైతం రెండంకెల స్థాయికి చేరువయ్యింది. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది.  
ప్రైవేటైజేషన్‌...
వ్యాపార రంగంలో ప్రభుత్వ పాత్రను వాజ్‌పేయి వ్యతిరేకించేవారు. అందులో భాగంగానే పెట్టుబడుల ఉపసంహరణను ప్రోత్సహించారు. దానికి ప్రత్యేకించి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశారు. ప్రస్తుత ఆర్థికశాఖా మంత్రి అరున్‌జైట్లీయే ఆ శాఖకు తొలి మంత్రి. భారత్‌ అల్యూమినియం కంపెనీ, హిందూస్థాన్‌ జింక్, ఇండియన్‌ పెట్రో కెమికల్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అలాగే వీఎస్‌ఎన్‌ఎల్‌లు నాటి ప్రధాన పెట్టుబడుల ఉపసంహరణల్లోనివి.  

టెలికం విప్లవం...
దేశంలో మొబైల్‌ ఫోన్‌ విప్లవానికి ఆద్యుడు వాజ్‌పేయి. కాల్‌రేట్లను తగ్గించి, టెలికాం కంపెనీల మధ్య ఆరోగ్యకరమైన పోటీకి దారులువేస్తూ సరికొత్త టెలికాం విధానానికి శ్రీకారం చుట్టారు. నిర్ణీత లైసెన్స్‌ ఫీజు, ఆదాయం పంచుకునే పద్ధతి స్థానంలో సరికొత్త టెలికాం విధానాన్ని ప్రవేశపెట్టి విప్లవాత్మకమైన మార్పులకు కారణమయ్యారు వాజ్‌పేయి. టెలికాం రంగంలో వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ని ఏర్పాటుచేసి, ప్రభుత్వ నియంత్రణ, వివాదాల పరిష్కారాల పాత్రను వేరుచేసారు. ఇప్పుడు మొబైల్‌ కనెక్టివిటీ ఎంతగా ఎదిగిందంటే ప్రస్తుత ప్రభుత్వ అభివృద్ధి మంత్రం అయిన జన్‌ధన్, ఆధార్, మొబైల్‌ (జేఏఎం–జామ్‌)లో ఇది ప్రధాన పాత్ర పోషిస్తున్నది.

ఢిల్లీ మెట్రో రైలుకి అంకురార్పణ...
ఢిల్లీలో మెట్రో రైలు నిర్మాణానికి అంకురార్పణ జరిగింది వాజ్‌పేయి హయాంలోనే. మెట్రో రాకతో పట్టణ ప్రజల రవాణా సమస్య పరిష్కార మైంది.

టెలికం విధానం ప్రవేశపెట్టడం ద్వారా టెలికాం రంగంలో విప్లవాన్ని సృష్టించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టుల్లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టారు.
ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కి నిధులు ... భారతదేశంలోనే తొలి ఆధునిక మెట్రోరైలు ప్రాజెక్టుకి అంకురార్పణ.
విద్యా హక్కును ప్రాథమిక హక్కుల్లో భాగం చేశారు.
పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలు విక్రయించి ప్రభుత్వానికి ఆదాయం పెంచారు.  
ఈశాన్య రాష్ట్రాల ప్రాధాన్యాన్ని గర్తించి ప్రత్యేక మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేశారు.  
ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం
ఢిల్లీ లాహోర్‌ బస్సు ప్రారంభంతో పాకిస్తాన్‌తో స్నేహానికి దారులు వేసారు...

1/4

ముగ్గురు మిత్రులు: అద్వానీ, బైరాన్‌సింగ్‌ షెకావత్, వాజ్‌పేయి

2/4

మొరార్జీ దేశాయ్, చంద్రశేఖర్, సుబ్రమణ్య స్వామితో...

3/4

భారతీయ జనసంఘ్‌ సమావేశంలో అద్వానీ, ఇతర నేతలతో...

4/4

1984 సంక్షోభంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా విజయవాడ సభలో

Advertisement
Advertisement