ఏ మొహం పెట్టుకొని వచ్చారు..? | Sakshi
Sakshi News home page

ఏ మొహం పెట్టుకొని వచ్చారు..?

Published Thu, Mar 21 2019 9:31 AM

Attar Chand Bhasha Activists Fires On MP Nimmala Kishtappa - Sakshi

సాక్షి, కదిరి: ‘చాంద్‌బాషాకు క్యాడర్‌ లేదు. ఆయనకు టికెట్‌ ఇవ్వకండి. కందికుంటకివ్వండని చంద్రబాబునాయుడు దగ్గర చెప్పి ఇప్పుడు ఇద్దరూ ఏ మొహం పెట్టుకొని ఎమ్మెల్యే చాంద్‌బాషా ఇంటికి వచ్చారు? ముస్లింలకు టికెట్లు వద్దుగానీ తెలుగుదేశం పార్టీకి ముస్లింల ఓట్లు కావాలా?’ అని ఎమ్మెల్యే అత్తార్‌ చాంద్‌బాషా వర్గం ఎంపీ నిమ్మలతోపాటు టీడీపీ అభ్యర్థి కందికుంటపై మండిపడ్డారు. ఎంపీతోపాటు కందికుంట బుధవారం చాంద్‌ ఇంటికెళ్లి ఆయనను బుజ్జగించాలని చూశారు. అయితే వారికి అక్కడ చాంద్‌ వర్గం నుంచి చేదు అనుభవం ఎదురైంది.

‘ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో చాంద్‌బాషా నియోజకవర్గంలో తిరిగినప్పుడు ఎంపీగా మీరు చాంద్‌తోపాటు పర్యటించకుండా ఆయన చేతిలో ఓడిపోయిన కందికుంట వెంట తిరిగిన విషయం అప్పుడే మరిచిపోయారా?.. మీరు మర్చిపోయినా మేం ఎలా మరిచిపోతాం. ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు.. మిమ్మల్ని ఈసారి ఇంటికి సాగనంపే వరకూ మేము నిద్రపోము. కదిరి నియోజకవర్గంలో కందికుంట సామాజికవర్గం ఓట్లు 3 వేలకు మించి లేవు. కానీ ముస్లింల ఓట్లు సుమారు 50 వేలున్నాయి. ముస్లింలకు చంద్రబాబు కదిరిలో టికెట్‌ ఇవ్వనప్పుడు ముస్లింల ఓట్లు టీడీపీకి ఎందుకు వేయాలి?’ అని నిమ్మల కిష్టప్పను చాంద్‌బాషా అనుచరులు ప్రశ్నించడంతో నిమ్మల అవాక్కయ్యారు. చాంద్‌ అనుచరుఅ ఆగ్రహం చూసి కందికుంట అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.

నిమ్మల కిష్టప్ప మాత్రం ఈసారి కందికుంటతోపాటు తనకూ మద్దతు ఇవ్వాలని కోరుతూ అక్కడే కూర్చుండిపోయారు. కదిరి నియోజకర్గంలో మీరు చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పండని చాంద్‌ అనుచరులు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించారు. చాంద్‌బాషా తన అనుచరులను సముదాయించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘కబ్జాలు చేసేవారికి, రౌడీయిజం చేసేవారికి, ముస్లింలు, క్రిష్టియన్ల ఆస్తులకు తప్పుడు పత్రాలు పుట్టించి అమ్ముకుంటున్న వారికి టికెట్లు ఇస్తే ప్రజలు ఓట్లేయరు. మేం కూడా వేయము. మీరు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుంది. చాంద్‌బాషాకు టికెట్‌ రాకపోవడానికి మీరే ప్రధాన కారకులు’ అనడంతో నిమ్మల వెనుదిరగక తప్పలేదు. కార్యకర్తల అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని చాంద్‌బాషా నిమ్మలతో చివరిమాటగా చెప్పారు. 

Advertisement
Advertisement