‘బాబు’ మార్కు రాజకీయం | Sakshi
Sakshi News home page

‘బాబు’ మార్కు రాజకీయం

Published Fri, Mar 8 2019 1:18 PM

Babu Playing His Mark Political Game In West Godavari - Sakshi

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ్యవహారశైలి ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అసమ్మతులను ప్రోత్సహిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, అభ్యర్ధులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చింతలపూడిలో పీతల సుజాతకు వ్యతిరేకంగా ఉన్న వారిని ప్రోత్సహించి వారిని అమరావతి సీఎం వద్దకు పంపి సీటు రాకుండా చక్రం తిప్పుతున్నారు.

మరోవైపు పోలవరం అభ్యర్థికి వ్యతిరేకంగా ఉన్న వారిని తనవద్దకు పిలిపించుకుని మరీ వినతిపత్రాలు తీసుకుంటున్నారు. నూజివీడులో మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా మాగంటి బాబు వ్యవహారశైలిపై అసంతృప్తిగా ఉన్నారు. అసలు తనకు సీటు వస్తుందో లేదో తెలియకుండానే తమ నియోజకవర్గాల్లో చెయ్యి పెడుతున్నాడంటూ వారు మండిపడుతున్నారు.  ఎమ్మెల్యే పీతల సుజాత, ఎంపీ మాగంటి బాబు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

మొదటి నుంచి ఆ నియోజకవర్గంలో తన మాటే నెగ్గాలనే వైఖరితో నాలుగున్నరేళ్లపాటు ఏఎంసీ ఛైర్మన్‌ను నియమించకుండా మాగంటి బాబు అడ్డం పడ్డారు. ఆ నియోజకవర్గంలో అసమ్మతిని పెంచి పోషించారు. దీనికి పక్కనే ఉన్న మరో ఎమ్మెల్యేతో పాటు జెడ్పీ ఛైర్మన్‌ కూడా ఆజ్యం పోశారు.  ప్రస్తుత ఎమ్మెల్యే సుజాతకు టిక్కెట్‌ ఇస్తే ఎంపీ వర్గం ఆమెకు వ్యతిరేకంగా చేయడానికి సిద్ధంగా  ఉంది. ఈ విషయం సీఎం చంద్రబాబు కు కూడా స్పష్టం చేశారు. ఆమెకు టిక్కెట్‌ ఇవ్వకుండా మాగంటి బాబు పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేస్తున్నారు. పోలవరం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి ఉంది.

ప్రస్తుత ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస్‌తో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని అతని వ్యతిరేక వర్గానికి బాబు అండగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆ నియోజకవర్గంలోని అసమ్మతి వర్గానికి అపాయింట్‌మెంట్‌ ఇచ్చి పెద్ద ఎత్తున కార్లలో ఏలూరు, అక్కడి నుంచి అమరావతి తరలించారు. మొదటి నుంచి తమ సామాజికవర్గం పెత్తనమే సాగాలనే వైఖరితో రిజర్వు నియోజకవర్గాల్లో పెత్తనం కోసం ప్రయత్నాలు చేశారు. అక్కడ తమ సామాజిక వర్గానికి చెందిన వారిని ముందు పెట్టి అసమ్మతి కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు.

ఏలూరు పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే  నూజివీడులో తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా అక్కడ కూడా రెండు వర్గాలను ఎంపీ ప్రోత్సహిస్తూ వచ్చారు. గత ఎన్నికల నుంచి రంగంలో ఉన్న ముద్దరబోయిన వెంకటేశ్వరరావును కాదని అక్కడ తన సామాజిక వర్గానికి చెందిన అట్లూరి రమేష్‌తో పాటు ఇతరులను ప్రోత్సహిస్తూ వచ్చారు. దీంతో మాగంటి బాబు వైఖరితో విసిగిపోయిన వీరంతా తమకు మాగంటి బాబు మరోసారి ఎంపీగా వద్దంటూ తెలుగుదేశం ముఖ్య నేతలకు మొరపెట్టుకుంటున్నారు. 

అలిగిన బాపిరాజు .. నేడు కార్యకర్తలతో సమావేశం

తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం టికెట్‌ను అధిష్ఠానం ఈలి నానికి కేటాయించింది. నానీని గెలిపించే బాధ్యతను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజుపై ఉంచింది. చివరి వరకు సీటు కోసం ఆశించి భంగపడ్డ బాపిరాజు సీఎం వైఖరిపై గుర్రుగా ఉన్నారు. సీఎంను టికెట్‌ కోసం కలిసేందుకు బాపిరాజు, ఈలి నాని, బొలిశెట్టి శ్రీనివాసులు బుధవారం అమరావతి బయలుదేరి వెళ్లారు. సీఎంతో ఒక్కొక్కరిగా మాట్లాడిన అనంతరం సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలో టికెట్‌ను నానీకి ఇస్తున్నట్టు చంద్రబాబు స్పష్టం చేసినట్టు సమాచారం.

బాపిరాజుకు సీటిస్తే హార్ట్‌ఫుల్‌గా చేస్తానని బొలిశెట్టి హామీ ఇచ్చినట్టు, బొలిశెట్టికి సీటిచ్చినా తాను గెలుపునకు కృషి చేస్తానని  బాపిరాజు సీఎం పంచాయితీలో హామీలు ఇచ్చినా కూడా బాబు నానీ అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపడంతో బాపిరాజు ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.  అయినా ఈలి నానీని గెలిపించే బాధ్యత నీదేనని సీఎం చంద్రబాబు బాపిరాజుకు చెప్పినట్లు తెలిసింది. దీంతో బాపిరాజు అలక బూనారని తెలుస్తోంది.

గురువారం సాయంత్రం సమావేశం

తాడేపల్లిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ క్యాంపు కార్యాలయం వద్ద బాపిరాజు అభిమానులు, పార్టీ క్యాడర్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. బాపిరాజు కూడా సమావేశానికి హాజరై అధిష్ఠానం చేసిన అన్యాయాన్ని కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు వివరించనున్నారని సమాచారం. టికెట్‌ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బాపిరాజును బరిలోకి దింపాలనే యోచనలో ఆయన వర్గం ఉంది.    

Advertisement
Advertisement