షబ్బీర్‌ ‘హోదా’కు గండం! | Sakshi
Sakshi News home page

షబ్బీర్‌ ‘హోదా’కు గండం!

Published Sat, Dec 22 2018 11:33 AM

Bad Time To Shabbir Ali Council Opposition Leader Post - Sakshi

సాక్షి, కామారెడ్డి: శాసనమండలిలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్‌అలీ ‘హోదా’కు గండం ఏర్పడింది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు దామోదర్‌రెడ్డి, ప్రభాకర్, ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌ మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను కలిసి కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు శుక్రవారం లేఖ సమర్పించారు. మండలిలో కాంగ్రెస్‌కు ఏడుగురు సభ్యుల బలం ఉండగా, ఇటీవలే ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మిగిలిన ఆరుగురు సభ్యుల్లో ఇద్దరు గతంలోనే టీఆర్‌ఎస్‌ పంచన చేరారు. తాజాగా మరో ఇద్దరు కూడా కా రెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ నలుగురు కలిసి కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు మండలి చైర్మన్‌కు శుక్రవారం లేఖ సమర్పించారు.

లేఖను పరిశీలించిన మండలి చైర్మన్‌.. కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటిం చారు. దీంతో మండలిలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్‌ సభ్యుల బలం కేవలం రెండుకు చేరింది. షబ్బీర్‌ అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలుగా ఉన్నారు. వారి పదవీ కాలం కూడా వచ్చే మార్చితో ముగియనుంది. 40 మంది ఉన్న శాసనమండలిలో ప్రతిపక్ష హోదాకు కనీసం నలుగురు సభ్యులు అవసరం. కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ప్రతిపక్ష హోదా పోయే అవకాశం ఉంది. ప్రతిపక్ష హోదా కోల్పోయిన పక్షంలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్‌అలీ తన హోదాను కోల్పోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

‘చే’జారి.. కారెక్కి! 
రాష్ట్రంలో ఈ నెల 7న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 88 చోట్ల గెలుపొంది, రెండోసారి అధికారంలోకి వచ్చింది. వచ్చే నెలలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి మేలో జరిగే పార్లమెంటు ఎన్నికల వరకూ అన్నింటా విజయం సాధించాలన్న లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. అందులో భాగంగా శాసన మండలిలో ప్రతిపక్షాన్ని బలహీన పర్చేందుకు ఎత్తులు వేసింది. మెజారిటీ సభ్యులు ‘చే’జారడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు ‘కారెక్కే’ందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ సభా పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, ఆ పార్టీ చేతి నుంచి ప్రతిపక్ష హోదా జారిపోతుందనేది స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న షబ్బీర్‌అలీ ప్రతిపక్ష నేత హోదాను కోల్పోవలసి వస్తుందని భావిస్తున్నారు. షబ్బీర్‌అలీ ఎమ్మెల్సీ పదవి రానున్న మార్చి నెలాఖరుతో ముగియనుంది. అప్పటి వరకు ప్రతిపక్ష నేత హోదా కొనసాగుతుందనుకున్న ఆయనకు సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు షాక్‌ ఇచ్చారు. వారు పార్టీ ఫిరాయించడమే గాకుండా కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు పేర్కొన్నారు. గతంలో టీడీపీ శాసన సభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలేనం చేసినట్టుగానే, శాసన మండలిలో కాంగ్రెస్‌ సభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరోవైపు, షబ్బీర్‌అలీ, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండలి చైర్మన్‌ను కలిసి, సీఎల్పీ సమావేశమే జరగలేదని, విలీనం నిర్ణయం తీసుకోలేదని లేఖ సమర్పించారు. తమ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

టీఆర్‌ఎస్‌ సభ్యులుగా ‘గుర్తించిన’ చైర్మన్‌.. 
మండలిలో కాంగ్రెస్‌ సభాపక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు మెజారిటీ ఎమ్మెల్సీలు ఇచ్చిన లేఖపై మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సత్వరమే నిర్ణయంం తీసుకున్నారు. ఆ నలుగురు సభ్యులను టీఆర్‌ఎస్‌ సభ్యులుగా గుర్తిస్తున్నట్లు బులెటిన్‌ విడుదల చేశారు. ఈ నిర్ణయంతో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా కోల్పోనుంది. అయితే, మండలిలో కాంగ్రెస్‌ సభాపక్షానికి తానే నేతగా ఉన్నానని, తాను లేకుండా తీసుకునే నిర్ణయం ఎలా చెల్లుతుందని షబ్బీర్‌అలీ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. గతంలో శాసనసభలో టీడీపీ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే మండలిలో కాంగ్రెస్‌ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడానికి మండలి చైర్మన్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో షబ్బీర్‌ ‘హోదా’ దాదాపు పోయినట్లేనని సమాచారం.

ఓటమి నుంచి తేరుకోకముందే.. 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షబ్బీర్‌అలీ కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఓటమి చెందారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌కు గట్టి పోటీ ఇచ్చిన ఆయన కేవలం 4,557 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తానని ఆశలు పెట్టుకున్న షబ్బీర్‌ స్వల్ప తేడాతో ఓటమి చెందడంతో నిరాశ చెందారు. ఆ ఓటమి నుంచి తేరుకోక ముందే శాసనమండలి ప్రతిపక్ష నేత హోదాపై టీఆర్‌ఎస్‌ గురి పెట్టింది. మండలిలో నలుగురికి గాలం వేయడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య తగ్గిపోయింది. పైగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలు తాము మండలిలో కాంగ్రెస్‌ సభాపక్షాన్ని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. మండలి చైర్మన్‌ అంగీకరించడంతో షబ్బీర్‌అలీ ప్రతిపక్ష నేత హోదా పోతుందన్న ఆందోళన ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది.

Advertisement
Advertisement