బాబు పాలనలో ఆలయాలకు అప్రతిష్ట

4 Sep, 2018 03:36 IST|Sakshi

సాక్షి, తిరుపతి: నారా చంద్రబాబునాయుడి పాలనలో ఆలయాల ప్రతిష్టకు మచ్చవచ్చిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శ్రీవారి నగలు, దుర్గమ్మ చీరలు, మల్లన్న మాన్యాలు పచ్చ నేతల జేబుల్లోకి చేరిపోతున్నాయన్నారు. శ్రీవారి అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాను, కేంద్ర సాంస్కృతిక శాఖను, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, టీటీడీని కేంద్ర సమాచార కమిషన్‌ ఇటీవల ప్రశ్నించిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీబీఐ విచారణ, లేదా సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జిచేత విచారణ జరిపించాలన్నారు.

టీటీడీ చైర్మన్‌గా తాను పనిచేసిన కాలంలో తనపై టీడీపీ నేతలు చేస్తున్న అభియోగాలపై తాను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని భూమన చెప్పారు. గతంలో తనపై సీబీఐ విచారణ కోరుతూ ఎనిమిది రోజుల పాటు నిరాహారదీక్ష చేపట్టానని, ఆ దీక్షను కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరస్వామి విరమింప జేశారని తెలిపారు. ఆ తర్వాత కూడా తనపై విచారణ జరిపించాల్సిందిగా గవర్నర్‌ను, హైకోర్టును కోరినట్లు చెప్పారు. నగలు పోయాయని చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించిన వారు.. ఇప్పుడు నగలన్నీ భద్రంగా ఉన్నాయని చెపుతున్నప్పుడు తనపై ఎందుకు విమర్శలు చేశారని భూమన ప్రశ్నించారు. తిరుమలలో పురాతన కట్టడాలను పురావస్తుశాఖ పరిధిలోకి తేవాలన్న ప్రతిపాదనను ఎందుకు తొక్కిపెడుతున్నారని నిలదీశారు. సమాచార హక్కుచట్టం ఎందుకు అమలు కావటం లేదని ప్రశ్నించారు.  

నేడు గొల్లమండపంపై కన్ను  
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తిరుమలలో వెయ్యికాళ్ల మండపాన్ని పడగొట్టించారని భూమన చెప్పారు. గొల్లమండపాన్ని కూడా కూలదోసేందుకు టీటీడీ పాలకమండలి అజెండాలో ఇటీవల చేర్చారని గుర్తుచేశారు. అయితే విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారని చెప్పారు. జీయంగార్‌ వ్యవస్థలో చిచ్చుపెట్టిన వ్యక్తి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. అర్చకుల వ్యవస్థను సర్వనాశనం చేశారని, వారి మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. అనువంశిక వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి సన్నిధిలో అపచారం జరుగుతోందని రమణదీక్షితులు చెప్పారని, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఉద్దేశ్యపూర్వకంగానే రమణ దీక్షితులుపై దాడిచేశారన్నారు. శ్రీవారిని తమ కులదైవం అని చెప్పుకుంటున్న చంద్రబాబు.. తిరుమల క్షేత్రాన్ని కులక్షేత్రంగా మార్చేశారని చెబుతూ మురళీమోహన్‌ ఇటీవల శ్రీవెంకటేశ్వరస్వామి తమ కులానికి చెందిన వారని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. పింక్‌ డైమండ్‌ జెనీవాలో విక్రయించారని వచ్చిన ఆరోపణలకు, సమాచార శాఖ కమిషన్‌ వేసిన ప్రశ్నలకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు సీఎం పదవికి వెంటనే రాజీనామా చేసి సుప్రీం కోర్టు జడ్జితో విచారణ జరిపించుకోవాలని భూమన డిమాండ్‌ చేశారు.  

రాయల నగలు ఏమయ్యాయి 
శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు సమర్పించిన నగలు ఏమయ్యాయని భూమన ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తులు స్వామి వారికి సమర్పించిన నగలపై జస్టిస్‌ వాద్వా, జస్టిస్‌ జగన్నాథరావు ఇచ్చిన నివేదికను ఎందుకు బయటపెట్టలేదన్నారు. రాయల వారు ఇచ్చిన నగల వివరాలను ఆలయ గోడలపై రాశారని 2011లో డైరెక్టర్‌ ఆఫ్‌ మ్యూజియం సభ్యుల కమిటీ చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల టీటీడీ పాలకమండలి సభ్యులు నగలను పరిశీలించి అన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పడాన్ని భూమన తప్పుబట్టారు. ఆగమశాస్త్రం ఒప్పుకొంటే నగలు చూపిస్తామని ఈవో చెప్పారని, అయితే ఏ నగలు చూపిస్తారని ప్రశ్నించారు. ఉన్న వాటిని చూపి ఇవే స్వామి ఆభరణాలు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మూలవిరాట్‌కు, యోగ నరసింహస్వామి, వరదరాజస్వామికి కూడా ఆభరణాలు ఉండేవని చెబుతున్నారని భూమన వివరించారు. స్వామి వారికి నిత్యం, వారం, మాసం, ఉత్తరాయణం, దక్షిణాయణం పేరుతో నగలు ఉండేవని తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు

రైతు క‘రుణ’ ఎవరిపై?

అసంతృప్తులతో చర్చలకు బుజ్జగింపుల కమిటీ రాక

నాలుగు స్థానాలకు టీజేఎస్‌ అభ్యర్థుల ప్రకటన

పేదలందరికీ జీవిత బీమా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఖరీదైన పల్లెటూరు

అవును.. ఉంది!

తెలుగింటి అమ్మాయి!

విడుదలైన ‘ఉద్యమ సింహం’ ఆడియో

చేదు అనుభవాలెన్నో చవిచూశాను

ఆమె బయోపిక్‌ను నిషేధించండి