Sakshi News home page

‘హృదయం’ గెలిచేదెవరు?

Published Tue, Mar 26 2019 9:21 AM

BJP And Congress Party Target to UP And Bihar - Sakshi

దేశ రాజధాని ఢిల్లీ కోటపై రెపరెపలాడే జెండాని ఏ పార్టీ ఎగురవేస్తుందో బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలే నిర్ణయించనున్నాయి. దేశానికి గుండెకాయలాంటి ఈ రెండు రాష్ట్రాల్లో ఎవరైతే విజయబావుటా ఎగురవేస్తారో వారినే ఢిల్లీ పీఠం వరించే అవకాశాలు మెండుగా ఉంటాయి. భారత రాజకీయ సరళినే మార్చివేయగల ఈ రెండు రాష్ట్రాల్లో 2014 ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకొని సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా అవతరించింది. బిహార్, యూపీ రాష్ట్రాల్లోని మొత్తం 120 సీట్లలో బీజేపీ గత ఎన్నికల్లో 93 సీట్లలో విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీకి యూపీలో 71, బిహార్‌లో 22 సీట్లూ దక్కాయి. ఈసారి బిహార్‌లోని రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ) నేతృత్వంలోని కూటమి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్‌పీ) కూటమి ఉత్తరప్రదేశ్‌లో ఉమ్మడిగా ఒకే వేదికపై నుంచి పోటీకి దిగుతుండడంతో అక్కడ బీజేపీకి కత్తిమీద సాములా మారింది.

పశ్చిమ యూపీలోనూ, నార్త్, సౌత్‌ బిహార్‌లోనూ ఓటర్లను కదిలిస్తే ఇక్కడ టఫ్‌ ఫైట్‌ ఉండబోతోందని అర్థమవుతోంది. ఇక్కడ తొలి దశ ఎన్నికలు ఏప్రిల్‌ 11న జరగబోతున్నాయి. మే చివరి వరకూ వివిధ దశల్లో ఇక్కడ పోలింగ్‌ జరగనుంది. అయితే  ఓటర్ల మూడ్‌లో ఏదైనా మార్పు రావడానికి ఈ సమయం సరిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకూ ఏ రాజకీయ పార్టీ కూడా అన్ని స్థానాల జాబితాను ప్రకటించలేదు. చాలా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితే లేదు. అలాగే క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజాభిప్రాయం సీట్ల రూపంలోకి మారుతుందా లేదా అన్నది ఈ ఉత్కంఠభరిత పోటీలో తేల్చి చెప్పడం కష్టంతో కూడుకున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొద్ది స్థాయిలో ఓట్లు అటూ ఇటూ మారినా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇది కేవలం ప్రధాన రాష్ట్రాల నుంచి అందుతోన్న ప్రాథమిక సమాచారం మాత్రమే.

యువతరం మదిలో మోదీ..
ఈ ప్రాంతాల్లో జరిపిన సర్వేలో మోదీకి మంచి పేరున్నట్టు అర్థమవుతోంది. ప్రధానంగా యువతరం అంతరంగంలో మోదీకి ఒక ప్రత్యేకమైన స్థానముంది. క్షేత్రస్థాయిలో మోదీ హవా కొనసాగుతున్నట్టు ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. కొంతమంది యువకులు ఆయన ‘‘శక్తియుక్తులను పొగుడుతోంటే, మరికొందరు మోదీ నిర్ణయాలను కొనియాడుతున్నారు. రాజకీయాల్లో మోదీ నిజాయితీని గురించి గొప్పగా చెప్పుకునేవారు కొందరైతే, మోదీ పేదల కోసం ప్రవేశపెట్టిన గ్రామీణ సంక్షేమ పథకాలను బట్టి ఆయనను పేదల పాలిటి పెన్నిధిగా భావిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మరికొందరు కుల రాజకీయాల నుంచి పైకి ఎదిగిన జాతి ప్రతీకగా మోదీని భావిస్తున్నారు. మోదీకి బలమైన ప్రత్యామ్నాయమే లేదనే భావంతో కొందరు ఓటర్లున్నారు. అయితే మోదీపై ప్రత్యర్థులు కురిపిస్తోన్న విమర్శల విషయంలో సైతం యువతరం స్పష్టమైన అవగాహనతో ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగావకాశాలు మోదీ కల్పించలేకపోయారనీ, వ్యవసాయ సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడలేకపోయారన్న విమర్శలపై వారు స్పందిస్తూ అన్నింటికీ మోదీని నిందించాల్సిన పనిలేదనీ, నిజానికి ఆయనకింకా సమయమివ్వాలని నొక్కి చెబుతున్నారు. అనుకున్నవన్నీ జరిగితే మే 23న ఎన్నికల ఫలితాలు చూసి, మోదీ మురిసిపోయే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

హిందూ శక్తుల నుంచి బీజేపీకి అండదండలు....
మోదీకి హిందూ సమాజంలోని వివిధ కుల సమూహాల నుంచి మద్దతు లభిస్తోంది. యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలు కేంద్ర ప్రభుత్వానికి బలమైన మద్దతుదారులుగా ఉన్నారు. గతంలో మోదీ తెచ్చిన ఎస్‌సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్ట సవరణలు ఆయా వర్గాలను ఆగ్రహానికి గురిచేశాయి. అయితే మోదీ తెచ్చిన నిరుపేదలకు పదిశాతం రిజర్వేషన్‌ ఆ వర్గాల్లో వ్యతిరేకతను పోగొట్టి ఉత్సాహాన్ని నింపింది. బిహార్‌లో ప్రధానంగా వెనుకబడిన, అత్యంత వెనుకబడిన (బీసీ, ఈబీసీ) వర్గాలు, యూపీలోని యాదవేతర ఓబీసీలు బీజేపీకి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి మోదీని ఈబీసీ, ఓబీసీ వర్గాలు తమ నాయకుడిగా ఆమోదిస్తున్నట్టు తెలుస్తోంది. దళిత ఉపకులాల్లోకి బీజేపీ చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తూనే ఉంది. బిహార్‌లో పాశ్వా న్, రవిదాస్‌ కులాలకు చెందిన ప్రతినిధులు యూపీలోని రజక, పాశీ కులాల మద్దతు మోదీవైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే బిహార్‌లోని యాదవులు, ఉత్తర ప్రదేశ్‌లోని యాదవ, జాత హిందూ గ్రూప్‌లు బీజేపీకి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఎస్పీ, బీఎస్పీ కలయికతో మారిన సమీకరణలు...
ఈ ఎన్నికల్లో యూపీలో ఎస్పీ, బీఎస్పీ కూటమి బీజేపీకి పెను సవాల్‌గా మారి, మోదీ ప్రధానిగా ఎన్నికవుతారా లేదా అనేది నిర్ణయించబోతున్నాయి. ఈ రెండు పార్టీ లూ కలిసి, మూడు ప్రధాన సామాజిక వర్గాలైన ముస్లింలు, యాదవులు, జాతవులలో ఆధిపత్యాన్ని కలిగి ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ విడివిడిగా పోటీచేసి, గెలిచి న స్థానాలకన్నా ఈసారి ఈ కూటమి మంచి విజయాలు సాధించడం ఖాయమని నిపుణుల అభిప్రాయం. ఒక సర్వే విశ్లేషణ ప్రకారం ఉత్తర ప్రదేశ్‌లోని 80 నియోజకవర్గాల్లో 47 నియోజకవర్గాల్లో ముస్లింలు, యాదవులు, దళిత ఓటర్లు కలిపి 50 శాతానికి పైగా ఉన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఈ కూటమికి అండగా ఉండి, ఓట్ల బదలాయింపు సరిగా జరిగితే మోదీకి ఉన్న ప్రాభవాన్ని ఈ కూటమి అడ్డుకోలేదని అంచనా.

Advertisement

What’s your opinion

Advertisement