పూల..ముళ్లా? | Sakshi
Sakshi News home page

పూల..ముళ్లా?

Published Mon, May 21 2018 8:03 AM

BJP Attacks On Coalition Government In Karnataka Assembly Elections - Sakshi

సాక్షి, బెంగళూరు: ఇల్లలకగానే పండుగ కాదు.. అనే సామెత నూతన సంకీర్ణ ప్రభుత్వానికి వర్తిస్తుందనాలి. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధమవుతోంది. బుధవారం జేడీఎస్‌ రాష్ట్రాధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగుతుందా? అని అటు బీజేపీ, ఇటు రాజకీయ పండితులుఆసక్తిగా చర్చించుకుంటున్నారు. సంకీర్ణ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం, దీనికి తోడు కాంగ్రెస్, జేడీఎస్‌ కుమ్ములాటలు కుమారస్వామికికి ఇబ్బందులు తప్పకపోవచ్చనే వాదన ప్రబలంగా వినిపిస్తోంది.

అతిపెద్ద రెండో పార్టీ అయినప్పటికీ తక్షణ అవసరం కోసం కుమారస్వామికి కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యమంత్రి పదవిని సమర్పించుకుంది. ఈ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని కుమారస్వామికే కట్టబెడుతుందా అంటే అనుమానమే అనే సమాధానాలు వినిపిస్తున్నాయి. అయితే జేడీఎస్‌ నాయకులు మాత్రం కుమారన్న కొనసాగడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సంఖ్యాబలం పరంగా జేడీఎస్‌కు 37 సీట్లే ఉండడం వల్ల కాంగ్రెస్‌ ఆధిపత్య ధోరణి కనబరచవచ్చని, దీనివల్ల లుకలుకలు బయల్దేరే అవకాశం లేకపోలేదని, భవిష్యత్తులో పాలనపర నిర్ణయాల్లో హెచ్చుతగ్గులు రావచ్చని ఇరుపార్టీల నాయకుల్లోనూ అనుమానాలు ఉన్నాయి.

కాంగ్రెస్‌ ఆధిపత్య ధోరణి
78 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌ మంత్రిమండలిలో ప్రాధాన్యం తగ్గితే నిశ్శబ్దంగా ఉంటుందా? అనేది వేచిచూడాల్సిన అంశమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మంత్రి పదవుల కేటాయింపులు, నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు, పాలన అంశాల్లో ఇరు పార్టీలు ఎంతమేరకు సర్దుకుపోతాయన్నది గమనార్హం. ఇరుపార్టీల నాయకుల స్నేహాలు, శతృత్వాలు కూడా తెలిసిందే. గతంలో కూడా కాంగ్రెస్, జేడీఎస్‌లు పొత్తుపెట్టుకుని మధ్యలోనే అర్ధాంతరంగా సంకీర్ణ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పడం తెలిసిందే. 2007లో ఇదే తరహాలో సంకీర్ణ ప్రభుత్వానికి జేడీఎస్‌ కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుంది. 2004లో ధరంసింగ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వేరే రాజకీయ కారణాలతో కాంగ్రెస్‌తో జేడీఎస్‌ పొత్తు పెట్టుకుంది.

వేచిచూస్తున్న బీజేపీ
మరోపక్క కేంద్రంలో అధికారంలో చలాయిస్తున్న బీజేపీ... ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని దెబ్బతీసే అవకాశం కోసం ఎదురు చూస్తోందనడంలో సందేహం లేదు. మూడురోజులకే సీఎం పీఠం కోల్పోయిన యడ్యూరప్ప వ్యూహాలకు పదును పెడతారని, అసెంబ్లీలో ఆయన ప్రసంగమే దీనికి నిదర్శనమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌–జేడీఎస్‌ ప్రభుత్వంపై దాడిచేసే ఏ అవకాశాన్ని కూడా బీజేపీ వదలదు. అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు మళ్లీ విశ్వప్రయత్నాలు చేస్తుంది. దీనికి తోడు కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి బలం మ్యాజిక్‌ ఫిగర్‌ కంటే కాస్త ఎక్కువ. ఈ నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయాలు రసవత్తరంగా మారినా ఆశ్చర్యం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement