టీఆర్‌ఎస్‌ ఓ నీటి బుడగ.. అది పేలడానికి సిద్ధంగా ఉంది | Sakshi
Sakshi News home page

Published Thu, Feb 8 2018 6:03 PM

bjp leader k laxman fires on minister KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంత్రి కేటీఆర్ కేంద్ర బడ్జెట్‌పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ పార్టీ కూడా చౌకబారు వ్యాఖ్యలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  కే లక్ష్మణ్ విమర్శించారు. మంత్రి కేటీఆర్‌ విద్యావంతుడై.. నిరక్షరాస్యుడిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. రైతులు, కార్మికులు, మహిళలు, వృద్ధులు మోదీ బడ్జెట్‌ను స్వాగతిస్తున్నారని అన్నారు.

గతంలో రాష్ట్రంలో బీజేపీ 23శాతం ఓట్లు సాధించి.. ఒక ఎంపీ స్థానాన్ని ఒంటరిగా గెలుచుకుందన్నారు. బీజేపీ దేశంలో ఏకకాలంలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉందని, తమ పార్టీని తక్కువగా అంచనా వేయకూడదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ నిజాం నవాబును తలపిస్తూ కుటుంబం కోసమే పాలన సాగిస్తున్నారని, టీఆర్‌ఎస్‌ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు కేంద్ర బడ్జెట్ ఉపయోగపడలేదనే అక్కసుతోనే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. దత్తాత్రేయను మంత్రి పదవి నుంచి తొలగించారని మాట్లాడేముందు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి డాక్టర్ రాజయ్యను ఎందుకు తప్పించారో చెప్పాలని అడిగారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు పుష్కలంగా నిధులు కేటాయించారని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు విడుదల చేయకపోవడం వల్ల కేంద్రం నుంచి రావాల్సిన 10 వేల కోట్ల రూపాయలు నిలిచిపోయాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా పెరుగుతోందని, టీఆర్‌ఎస్‌ ఓ నీటి బుడగ.. అది పేలడానికి సిద్ధంగా ఉందని కే లక్ష్మణ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తుండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అవినీతికి నిలయమైన పార్టీలని తెలిపారు. కర్ణాటక ఎన్నికల తర్వాత జరిగే పరిణామాల్లో కాంగ్రెస్ బలమెంతో తేలిపోతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్వాకం వల్లే వైద్య విద్య నిర్వీర్యం అవుతోందన్నారు.

Advertisement
Advertisement