టీఆర్‌ఎస్‌ది ముస్లిం సంతుష్టీకరణే | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ది ముస్లిం సంతుష్టీకరణే

Published Sun, Dec 29 2019 2:01 AM

BJP Leader Laxman Fires On TRS Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పౌరసత్వ సవరణ చట్టంలో ముస్లిం అనే పదం లేకపోవడంతోపాటు ఇతర షరతులు ఒప్పుకోకపోవడం వల్లే పార్లమెంట్‌లో ఈ చట్టాన్ని వ్యతిరేకించినట్లు ఉందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొనడం ముస్లిం సంతుష్టీకరణ తప్పిస్తే మరొకటి కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ సెక్యులర్‌ పార్టీ అని చెప్పుకోవడం నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉందని ఎద్దేవా చేశారు. సవరణ చట్టంలో ముస్లిం అనే పదం లేకపోవడాన్ని ప్రధానంగా పెట్టి మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్లు అడిగే దమ్ము టీఆర్‌ఎస్‌కు ఉందా? అని ప్రశ్నించారు. శనివారం పౌరసత్వ సవరణ చట్టంపై బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన వర్క్‌షాపులో లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి విషయాన్ని ముస్లిం కోణంలోనే చూస్తున్నాయని మండిపడ్డారు.

పాకిస్తాన్, అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతహింసను ఎదుర్కోలేక మనదేశం వచ్చిన శరణార్థుల కోసం పౌరసత్వ సవరణ చట్టం తీసుకొస్తే.. ఇందులోనూ ముస్లిం పదం కోసం పట్టుబట్టడం నిజాం, రజాకార్‌ పోకడలకు నిదర్శనమని ఆరో పించారు. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ఫామ్‌ హౌస్‌కే పరిమితమైన సీఎం పట్ల ప్రజల్లో వ్యతిరేకత, ఆగ్రహం పెరిగిపోతున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రత్యామ్నాయంగా కేటీఆర్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ సర్కార్‌ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకు ఆయన తర్వాత కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారంటూ వార్తను ప్రచారంలో పెడుతున్నారని విమర్శించారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.. 
రాజకీయ దురుద్దేశంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వార్డులలో రిజర్వేషన్‌ ప్రక్రియను ప్రకటించకుండా మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని లక్ష్మణ్‌ తెలిపారు. పంచా యతీ ఎన్నికలలో ఇద్దరు సంతానం నిబంధనలు పెట్టి మున్సిపల్‌ ఎన్నికలలో ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఇది మైనారిటీ ఓట్ల కోసమా.. ఎన్నికల కోసమా అని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ప్రజలు లేరని వ్యాఖ్యానించారు. ఎంఐ ఎం సీఏఏపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, వారి కుట్రలను భగ్నం చేసేందుకు సోమవారం (30న) హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల్లో సభలు, ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. మున్సిపల్‌ ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించింది. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement