తెలంగాణను కాపాడుకునేందుకు బీజేపీని గెలిపించాలి  | Sakshi
Sakshi News home page

Published Tue, Dec 4 2018 2:50 AM

BJP Leader Laxman Speech At LB Stadium Public Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పార్టీలు మజ్లిస్‌ పార్టీకి దాసోహం అంటున్నాయని, మజ్లిస్‌ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడేందుకు బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. సోమవారం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మజ్లిస్‌తో కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అంటకాగుతున్నాయని, దానిని ఎదుర్కొని బుద్ధి చెప్పే పార్టీ ఒక్క బీజేపీయేనని అన్నారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, పారదర్శక పాలనను ప్రజలు చూడాలని, బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే అదే తరహా అభివృద్ధి రాష్ట్రంలో కూడా సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ దోచుకుని, దాచుకుని రాజకీయాలు చేస్తోందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తానని చెప్పిన టీఆర్‌ఎస్‌ విషాద నగరంగా మార్చేసిందని విమర్శించారు. నీళ్లు, డ్రైనేజీ సరిగ్గా లేవని, ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో గుంతలు చూపితే గుంతకు రూ.1,000 ఇస్తామని కేటీఆర్‌ ప్రకటించారని, కానీ, గుంత లేని రోడ్డును చూపిస్తే తామే రూ.1,000 చొప్పున ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని, మంత్రులకే అపాయింట్‌మెంట్‌ దొరకడంలేదన్నారు.

ప్రజాహిత పాలన కావాలంటే బీజేపీ ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ అంటే ఆరు అని, ఆయన కు ఆరు అంటే ఇష్టమని, అందుకే ప్రాజెక్టుల్లో కమీషన్‌ను కూడా 6 శాతం తీసుకుంటున్నారని అన్నారు. కమీషన్లు లేని పాలన కోసం బీజేపీని ఆదరించాలని కోరారు. గోషామహల్‌ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడు తూ తెలంగాణ లో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్‌ కు అవకాశం ఇచ్చినా ఏమీ జరగలేదన్నారు. తెలంగాణకు మోదీ రావాలన్న నేత ఇప్పుడు మాట్లాడాలని, 15 నిమిషాలు పోలీసులను పక్కన పెట్టమన్న వ్యక్తి ఇప్పుడు ఎల్బీ స్టేడియంకు రాగలరా’అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను భాగ్యనగరంగా మారుస్తామని రాజాసింగ్‌ అన్నారు. తెలంగాణలో  బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకునే వాళ్లంతా సెల్‌ఫోన్‌ లైట్లు వేయాలని సూచించడంతో కార్యకర్తలు తమ సెల్‌ఫోన్‌ లైట్లు వేసి కేరింతలు కొట్టారు. బీజేపీ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీజేపీ అభ్యర్థులు షెహజాదీ, బద్దం బాల్‌రెడ్డి, పేరాల శేఖర్‌రావు తదితరులు మాట్లాడారు.   

Advertisement
Advertisement