ఆయన స్వలాభం కోసమే టీఆర్‌ఎస్‌తో గొడవ | Sakshi
Sakshi News home page

బాబు స్వలాభం కోసమే టీఆర్‌ఎస్‌తో గొడవ: జీవీఎల్‌

Published Mon, May 6 2019 7:32 PM

BJP MP GVL Narasimha Rao Fires on Chandrababu In Delhi - Sakshi

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు మరోసారి తీవ్రంగా మండిపడ్డారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ..తన స్వలాభం కోసమే టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు తగవు పెట్టుకున్నారని ఆరోపించారు. ఏపీ, తెలంగాణ ప్రజలు చాలా మంచిగా కలిసి మెలిసి జీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీ, తెలంగాణ మధ్య పెండింగ్‌ అంశాలను పరిష్కరించడానికి ఉమ్మడి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉన్నారని అన్నారు. కేంద్రానికి ఏపీ, తెలంగాణ రెండు కళ్లలాంటివని చెప్పారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేశామని పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేయడంలో అర్ధం లేదన్నారు. ఏపీ ప్రయోజనాలను దెబ్బతీయడంలో చంద్రబాబే ప్రధాన దోషి అని ఆరోపించారు. ఎన్నికల్లో తుపానులాగా చంద్రబాబు ప్రభుత్వం తుడిచిపెట్టుకు పోవడం ఖాయమన్నారు. పోలవరం కాంట్రాక్టుల్లో తన వాటా తనకు వచ్చిందో లేదో తెలుసుకోవడానికి పర్యటనలు, సమీక్షలు చేస్తున్నారని ఆరోపించారు. పోలవరంలో వచ్చే డబ్బుపైనే చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అనేక పెండింగ్‌ ప్రాజెక్టులున్నా కేవలం పోలవరంపైనే సమీక్ష నిర్వహించడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు.

బాబు కొత్త డ్రామాకు ఓట్లు వచ్చే పరిస్థితి లేదు

చంద్రబాబు నాయుడి కొత్త డ్రామాలకు ఓట్లు వచ్చే పరిస్థితి లేదని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనపై ప్రజలు ఇప్పటికే తీర్పు  ఇచ్చేశారని అన్నారు. చంద్రబాబు పదవి త్వరలోనే ఊడిపోతుందని జోస్యం చెప్పారు. ప్రధాని మోదీని చంపడానికి అర్బన్‌ నక్సలైట్లు ప్రయత్నించారని ఆరోపించారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసమే ఎన్నికల కమిషన్‌ను చంద్రబాబు బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలు ఫలించే అవకాశమే లేదన్నారు. ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాబోతుందని అభిప్రాయపడ్డారు. తమ సంతానానికి రాష్ట్ర బాధ్యతలు అప్పగించి ఢిల్లీకి రావాలని చంద్రబాబు, కేసీఆర్‌లు ఉబలాటపడుతున్నారని, కానీ వారి ఆశలు నెరవేరే అవకాశం లేదన్నారు. 

లోకేష్‌ సైతం ఓడిపోబోతున్నాడు

మంగళగిరిలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ సైతం ఓడిపోబోతున్నాడని జోస్యం చెప్పారు. 2024 కల్లా బీజేపీ ఏపీ, తెలంగాణాల్లో నిర్ణయాత్మక శక్తి ఎదుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ రెండు రాష్ట్రాలను బీజేపీకి కంచుకోటగా మారుస్తామని చెప్పారు. తెలంగాణాలో టీడీపీ అడ్రస్‌ పూర్తి గల్లంతైందని, ఏపీలో కూడా టీడీపీ చతికిలపడిందని అన్నారు. ఎన్నికల్లో ఎవరు కూడా చంద్రబాబును పట్టించుకోలేదని వ్యాక్యానించారు.


 

Advertisement
Advertisement