ధర్మ పోరాటం కాదు.. సీట్ల ఆరాటం: జీవీఎల్‌ | Sakshi
Sakshi News home page

ధర్మ పోరాటం కాదు.. సీట్ల ఆరాటం: జీవీఎల్‌

Published Wed, May 2 2018 8:14 PM

BJP MP GVL narasimha rao Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన దీక్షలో ధర్మపోరాటం కంటే సీట్లు కావాలన్న ఆరాటమే ఎక్కువగా  కనిపించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు కేవలం సీట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవడం లేదని  విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీఎం, మంత్రులు పనిచేయడం మానేసి..గంటల కొద్ది ఉపన్యాసాలు ఇస్తూ కాలం చెల్లిస్తున్నారని విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వద్దు స్పెషల్‌ ప్యాకేజీయే కావాలన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు.  రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కాగ్‌ రిపోర్ట్‌ చూస్తే ఏపీ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుందన్నారు. పట్టిసీమలో వంద​ల కోట్ల అవినీతి జరిగిందని కాగ్‌ నివేదించినా..రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని  ప్రశ్నించారు.

ప్రత్యేక సాధికారిక సంస్థ(ఎస్పీవీ) కింద కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా..రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని జీవీఎల్‌ పేర్కొన్నారు. నిధులు తీసుకోకపోవడానికి సాకులు చెప్తూ..ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీవీ కింద వచ్చే నిధులను వినియోగించాలని, వాటిని ఎలా ఖర్చు చేశారో కూడా చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదివరకు ఇచ్చిన నిధులకు వివరాలు ఇవ్వలేనందునే రాష్ట్రానికి రావాల్సిన 350 కోట్లు  నిలిపివేశారన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా చేస్తే తామే ప్రభుత్వంపై పోరాటం చేస్తానన్నారు.

బీజేపీ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తోందన్నారు. కేంద్రం చేపట్టిన పంట భీమా పథకం రైతులకు చాలా ఉపయోగ పడుతుందని పేర్కొన్నారు. టీడీపీ కాంగ్రెస్‌ కలిసి  నాటకాలు ఆడుతోందని, చాటు రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీకి ఓటు వెయ్యొద్దని బాబు పిలుపునివ్వడం ఆయన భ్రమ అని..ఇక్కడి ప్రజలనే ప్రభావితం చేయనివారు అక్కడేం చేస్తారని విమర్శించారు. మోదీ ప్రభుత్వం రైతులకు పెట్టుబడి కంటే 50 శాతం గిట్టుబాటు ధరను అందించేలా చర్యలు తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement