‘ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం’ | Sakshi
Sakshi News home page

‘టీడీపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం’

Published Wed, Mar 13 2019 5:03 PM

BJP MP GVL Narasimha Rao Slams TDP In Vijayawada - Sakshi

విజయవాడ: ఏపీలో ఎన్నికల సందర్భంగా తప్పుడు రాజకీయాలు, తప్పుడు ప్రచారాలను టీడీపీ చేస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహా రావు తీవ్రంగా మండిపడ్డారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జీవీఎల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ను కేంద్ర ప్రభుత్వం కాపాడే యత్నం చేస్తోందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని,  జగన్‌ను కాపాడాల్సిన అవసరం బీజేపీకి లేదని వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ హయాంలో ఏ నాయకుడిని కాపడటం కానీ టార్గెట్‌ చేయడం కానీ జరగలేదని అన్నారు. టీడీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు చూస్తుంటే వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమనిపిస్తోందని జోస్యం చెప్పారు.

రాజకీయాల్లో మార్పు తెస్తానంటూ పలుమార్లు సభలు పెట్టి ప్రచారం చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పచ్చ కండువా కప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీనిని బట్టి చూస్తేనే టీడీపీకి ఆయనతో ఉన్న బంధం ఏంటో అర్ధమవుతుందని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల, ధన రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. అమరావతి, విశాఖలో టీడీపీ నాయకులు వేల ఎకరాలు దోచేశారని ఆరోపించారు. ఏపీలో ప్రాంతీయపార్టీలకు నిబద్ధత, నిజాయతీ లేదని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎంపీ అవ్వాలంటే అడ్డగోలుగా అవినీతి, ఈడీ కేసులు వంటివి తప్పనిసరిగా ఉండాలని ఎద్దేవా చేశారు. ఈడీ, సీబీఐ, ఆదాయపన్ను శాఖల ఆరోపణలు ఎదుర్కొనే వారంతా కూడా టీడీపీ అభ్యర్ధులేనని విమర్శించారు.

Advertisement
Advertisement