‘ఎర్ర’కోటలో కాషాయం | Sakshi
Sakshi News home page

‘ఎర్ర’కోటలో కాషాయం

Published Sun, Mar 4 2018 1:19 AM

BJP poised to form government - Sakshi

న్యూఢిల్లీ: ఈశాన్య భారతంలో బీజేపీ హవా పెరుగుతోంది. శనివారం వెల్లడైన మూడురాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ఇప్పటికే అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో అధికారంలో ఉన్న బీజేపీ.. తాజాగా కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి త్రిపురలో భారీవిజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఒక్క కౌన్సిలర్‌ కూడా లేని త్రిపురలో 25 ఏళ్ల మాణిక్‌ ‘సర్కారు’ను గద్దెనుంచి కూలదోసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. ‘శూన్యం నుంచి శిఖరానికి చేరుకున్నాం’ అని ఎన్నికల ఫలితాల అనంతరం మోదీ పేర్కొన్నారు. అటు నాగాలాండ్‌ ప్రభుత్వంలో భాగస్వామ్యమయ్యేలా కమలదళం వ్యూహాలు రచిస్తోంది. మేఘాలయలో హంగ్‌ ఏర్పడినప్పటికీ.. ఎన్‌పీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అటు, మేఘాలయలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌.. త్రిపుర, నాగాలాండ్‌లలో ఖాతా తెరవలేదు.

ఎలాగైనా ప్రభుత్వంలో..
నాగాలాండ్‌లో బీజేపీ–ఎన్‌డీపీపీ కూటమి మెజారిటీ సాధించలేకపోయింది. అటు అధికారంలో ఉన్న ఎన్‌పీఎఫ్‌కూ స్పష్టమైన మెజారిటీ లేదు. అయినా ఎన్‌పీపీ, జేడీయూ, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలున్నాయి. అటు, బీజేపీ తమతో కలసిరావాలంటూ ఎన్‌పీఎఫ్‌ ఆహ్వానం పంపింది. ‘బీజేపీ నేతృత్వంలో ఈశాన్య ప్రజాస్వామ్య కూటమిలో ఎన్‌పీఎఫ్‌ భాగస్వామిగానే ఉంది. మాతో కలిసి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు’ అని సీఎం, ఎన్‌పీఎఫ్‌ నేత టీఆర్‌ జెలియాంగ్‌ పేర్కొన్నారు. దీంతో నాగాలాండ్‌లో ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీ పాత్ర కీలకం కానుంది. ఎన్నికల ముందు వరకు ఎన్‌పీఎఫ్‌–బీజేపీ అధికారంలో  ఉన్నాయి.

మేఘాలయ ఎవరిది?
మేఘాలయ ప్రజలు ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. 59 సీట్లున్న అసెంబ్లీలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ 21 సీట్లలో విజయం సాధించి.. మెజారిటీకి 9 సీట్ల దూరంలో నిలిచింది. బీజేపీ 2 చోట్ల గెలవగా.. నేషనలిస్ట్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఏ పార్టీకి మద్దతు రాకపోవటం చిన్న పార్టీల పాత్ర కీలకంగా మారింది. దీంతో పరిస్థితి చేయి దాటకుండా కాంగ్రెస్‌పార్టీ అహ్మద్‌ పటేల్, కమల్‌నాథ్‌లను రంగంలోకి దించింది. అటు బీజేపీ కూడా ఎన్‌పీపీతో కలిసి సర్కారు ఏర్పాటుకు లోపాయకారిగా సహాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రాష్ట్రాలకు బీజేపీ అబ్జర్వర్లను నియమించింది. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, జువల్‌ ఓరమ్‌లను త్రిపురకు, జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌లను నాగాలాండ్‌కు, కేంద్ర మంత్రులు కిరణ్‌ రిజిజు, అల్ఫోన్స్‌ కన్నథాణంలను మేఘాలయకు పంపింది.

2019 ఎన్నికలకు..
తాజా ఫలితాలు బీజేపీ మరింత విశ్వాసంతో 2019 సార్వత్రిక ఎన్నికలు వెళ్లేందుకు బాటలు వేస్తున్నాయి. అసలు స్థానం లేని ఈశాన్య రాష్ట్రాల్లో మరీ ప్రత్యేకంగా పార్టీ జెండా ఎగరలేని త్రిపురలో అధికారాన్ని సంపాదించటం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తల్లో విశ్వాసాన్ని పెంచాయి. త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. పశ్చిమబెంగాల్, ఒడిశాలో పార్టీ పట్టును పెంచుకుంటున్న కమలదళం.. దక్షిణాదినుంచి మరిన్ని సీట్లను ఖాతాలో వేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మొత్తంగా 2019లో తిరిగి అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీల జోరునూ అడ్డుకునేందుకు షా–మోదీ ద్వయం వ్యూహాలు రచిస్తోంది.  

ఒక్కోరాష్ట్రం కమలమయం
2014కు ముందు దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు కేవలం ఏడు మాత్రమే. గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, గోవా, పంజాబ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లు మాత్రమే బీజేపీ ఖాతాలో ఉన్నాయి. కానీ మోదీ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యాక బీజేపీ జోరు పెరిగింది. జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్, యూపీ, మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ అడుగుపెట్టింది. తాజా ఫలితాలతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా.. కాంగ్రెస్‌ మూడు రాష్ట్రాల్లో (కర్ణాటక, పంజాబ్, మిజోరం) మాత్రమే ఉంది.

Advertisement
Advertisement