అధికస్థానాలపై ‘అమిత’ దృష్టి | Sakshi
Sakshi News home page

అధికస్థానాలపై ‘అమిత’ దృష్టి

Published Mon, Sep 10 2018 2:11 AM

BJP to remain in power for next 50 years: Amit Shah - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎలాగైనా అధిక స్థానాలు సాధించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఉన్న 5 ఎమ్మెల్యే స్థానాలను కాపాడుకోవడంతోపాటు మరిన్ని ఎక్కువ స్థానాలను వచ్చే ఎన్నికల్లో గెలుచుకోవాలన్న ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన డైరెక్షన్‌ మేరకే బీజేపీ నేతలు ముందడుగు వేస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీకి అధిక స్థానాలు తెప్పించేందుకు తానే ప్రచార బాధ్యతలు స్వీకరిస్తానని ఇటీవల రాష్ట్ర నేతలకు సూచించారు. గత వారం మంత్రా లయం వెళ్లేందుకు వచ్చినపుడు కూడా శంషాబాద్‌ విమానాశ్రయంలోనే రాష్ట్ర బీజేపీ నేతలతో రాజకీయ చర్చ చేసిన అమిత్‌ షా.. తర్వాత పార్టీ కోర్‌ కమిటీ నేతలతో భేటీ అయ్యారు. ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ఈనెల 15న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న మొదటి సభ నుంచే పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.

ప్రత్యేకంగా ప్రచార బాధ్యతలు
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలను పర్యవేక్షిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలను ఆ పార్టీ జాతీయ నేతలకు అప్పగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చని, తద్వారా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రచార బాధ్యతలను పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సంతోష్‌కు అప్పగించిన అమిత్‌ షా.. కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, నితిన్‌ గడ్కారీని కూడా ఎన్నికల ప్రచార రంగంలోకి దింపనున్నట్లు తెలిసింది.  

రేపు మేనిఫెస్టో కమిటీ భేటీ
భారతీయ జనతాపార్టీ(బీజేపీ) ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఈ నెల 11న భేటీ కావాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పార్టీ ప్రాధాన్యాలను అందులో పొందుపరిచి ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది.  

Advertisement
Advertisement