‘కేసీఆర్‌ మజ్లిస్‌కు మోకరిల్లారు’ | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 15 2018 10:49 AM

BJP Telangana President Laxman Comments On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వారసత్వ రాజకీయాల్లో కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు దొందూ దొందేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్‌ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌, తన పిల్లలు రాజకీయాల్లోకి రారు అని చెప్పి ప్రజల్ని మోసం చేశారని ధ్వజమెత్తారు. మతోన్మాద మజ్లిస్‌​ పార్టీకి మోకరిల్లిన ముఖ్యమంత్రి తెలంగాణ విమోచన దినం ‘సెప్టెంబర్‌ 17’ను జరపడం లేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినం జరుపుతామని అన్నారు. భారత 72వ స్వాతంత్ర్య దినోత్సవ దినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

అవినీతి కూపంలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అవినీతి బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధిస్తే.. రాహుల్‌ స్వేచ్ఛ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. 70 ఏళ్ల అనంతరం బీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించడం మోదీ వల్లనే సాధ్యమైందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి మరింత పదును పెట్టి ఆ వర్గాల అభ్యున్నతికి పెద్ద పీట వేశారని , ఎస్సీ, ఎస్టీ, బీసీ హక్కులకోసం పాటు పడుతున్న మోదీ అభినవ అంబేడ్కర్‌ అని కొనియాడారు.

 

Advertisement
Advertisement