కాంగ్రెస్‌ అసంతృప్తులకు బీజేపీ వల? | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అసంతృప్తులకు బీజేపీ వల?

Published Mon, Jul 9 2018 2:13 AM

The BJP's national leaders are focused on Congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా పేరున్న నేతల కోసం  బీజేపీ అన్వేషిస్తోంది. దీని కోసం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీపై బీజేపీ జాతీయ నేతలు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో వేర్వేరుగా రహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న ముఖ్యులపై బీజేపీ వల వేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలోని పలువురు ముఖ్యనేతలతో పలుమార్లు సమావేశాలు జరిగినట్లు  తెలుస్తోంది.

పార్టీకి నేరుగా సంబంధంలేని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రముఖులు, సీనియర్లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొందరు నేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.  రాష్ట్రస్థాయిలో పేరున్న ఐదారుగురికిపైగా నేతలు టీపీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. వారిలో ముఖ్యంగా దక్షిణ తెలంగాణకు చెందిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌పై కొందరు కాంగ్రెస్‌ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకోవాలనే వ్యూహంతో బీజేపీ జాతీయనేతలు, ఆర్‌ఎస్‌ఎస్‌ ముఖ్యులున్నారు.

కాంగ్రెస్‌లోని అంతర్గత కుమ్ములాటలను బీజేపీ విస్తరణకు ఉపయోగించుకునే దిశగా పావు లు కదుపుతున్నారు. దీనివల్ల కాంగ్రెస్‌ను దెబ్బకొట్టవచ్చని   భావిస్తున్నారు. బీజేపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లతోపాటు అన్ని వ్యవహారాల్లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని కాంగ్రెస్‌ నేతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల్లో గెలుపు కోసం అవసరమైన ఆర్థిక వనరులనూ సమకూరుస్తామనే భరోసా ఇస్తు న్నట్లు సమాచారం. టీపీసీసీ పగ్గాలను ఉత్తమ్‌ నుంచి మారుస్తారనే విశ్వాసముందని, ఒకవేళ మార్పు లేకుంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటామని పలువురు కాంగ్రెస్‌ నేతలు అంటున్నట్లు తెలుస్తోంది. జూలై, ఆగస్టు దాకా వేచి చూస్తా మని వారు చెబుతున్నట్లు తెలియవచ్చింది.  

జన చైతన్య యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్‌..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ నేతృత్వంలో 14 రోజులపాటు జరిగిన జన చైతన్య యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. కార్యక్రమాలు మరింత వేగం అందుకుంటే బీజేపీకి మంచి రోజులు వస్తాయనే విశ్వాసానికి కార్యకర్తలు వస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. బీజేపీ జనచైతన్య యాత్ర 206 మండలాల్లోని 48 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా సాగింది. 

Advertisement
Advertisement