‘అసలు దోషులను తప్పించేందుకు ప్రణాళికలు’ | Sakshi
Sakshi News home page

Published Mon, Oct 29 2018 4:03 PM

Botsa Satyanarayana Says Center Investigate Over Attack On YS Jagan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నంపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని ఆ పార్టీ నేతలు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు ఈ ఘటనను చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత‍్నం వెనుక కుట్ర ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సిట్‌తో దర్యాప్తు చేయించాలని కోరారు. హత్యాయత్నం జరిగిన ప్రదేశం తమ ఆధీనంలో లేదని చంద్రబాబు అన్నారు కనుక ఈ కేసును కేంద్రానికి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

ఘటన జరిగిన ఐదు నిమిషాల్లోనే.. పబ్లిసిటీ కోసమే చేశారని డీజీపీ అనడం రాజకీయ రంగు పులమడమేనని ఆయన విమర్శించారు. సీఎం, డీజీపీలు ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు దోషులను పక్కకు తప్పించే ప్రణాళికలు రచించారని.. నిజాలు నిగ్గు తేలాలంటే కేంద్ర దర్యాప్తు అవసరమని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 26 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ వైపుకు తిప్పుకున్న  టీడీపీకి.. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని చిన్నపాటి వ్యక్తిని తమ వైపు తిప్పుకోవడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యనించారు. కేంద్రం దర్యాప్తు చేపట్టాలన్న తమ వినతిపై రాజ్‌నాథ్‌ సింగ్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే హత్య, మహిళలపై అత్యాచారాలు వరుసగా జరుగుతున్నాయని.. అసలు శాంతి భద్రతలు చాలా కాలం నుంచే కరువయ్యాయని అన్నారు.

Advertisement
Advertisement