చంద్రబాబూ.. డ్రామాలు కట్టిపెట్టు  | Sakshi
Sakshi News home page

చంద్రబాబూ.. డ్రామాలు కట్టిపెట్టు 

Published Sat, Apr 20 2019 12:38 AM

Buggana Slams Chandrababu Over Elections Code Violation - Sakshi

సాక్షి, అమరావతి: ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు అవాకులు చెవాకులు పేలుతున్నాడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలకు, ప్రవర్తనకు పొంతన లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ఓవైపు టీడీపీ 150 సీట్లు గెలుస్తుందని చెబుతూ, మరోపక్క ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగిందనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి, ఉద్యోగులకు జీతాలు ఇప్పించే ప్రయత్నం చేయాలని సూచించారు. బుగ్గన శుక్రవారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో
మాట్లాడారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...  

‘‘చంద్రబాబుకు అసహనం ఎక్కువైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిని అనరాని మాటలు అనడం, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా సమీక్షలు నిర్వహించడం ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారా? అత్యవసర పరిస్థితుల్లో తప్ప సమీక్షలు నిర్వహించకూడదన్న నిబంధనను చంద్రబాబు తుంగలో తొక్కాడు. పోలవరం ప్రాజెక్టు, సీఆర్‌డీఏపై సమీక్షలు చేపట్టాడు. హోంగార్డులకు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకు టీఏలు, డీఏలు ఇవ్వలేదు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు స్కీమ్‌ల పేరిట ప్రభుత్వ నిధులను వాడుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్‌ రూపంలో చూపించారు. చంద్రబాబు మళ్లీ రాకపోతే అభివృద్ధి ఆగిపోతుందట! రాజధాని ప్రాం తంలో ఇప్పటికీ కంప చెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి.  

ట్యాంపరింగ్‌ ఎవరు చేశారు?  
చంద్రబాబు సేవామిత్ర యాప్‌ పేరిట ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని రోడ్డున పడేశాడు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకుంటే ఎంతో అనర్థం జరిగేది. ఈవీఎంల ట్యాంపరింగ్‌ అని మాట్లాడుతున్నాడు. టీడీపీకి 150 సీట్లు వస్తున్నాయని చెబుతున్నాడు. మరి ట్యాంపరింగ్‌ ఎవరు చేశారు? చంద్రబాబు సాంకేతిక సలహాదారు వేమూరి హరిప్రసాద్‌ను, ‘ఆపరేషన్‌ గరుడ’యాక్టర్‌ శివాజీని అదుపులోకి తీసుకుని విచారించాలి ’’అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు.   

Advertisement
Advertisement