ప్రగతిభవన్‌ : నేనక్కడికి వెళ్లి ఆపలేను కదా!  | Sakshi
Sakshi News home page

నేనక్కడికి వెళ్లి ఆపలేను కదా! 

Published Wed, Nov 21 2018 3:07 AM

CEO Rajat Kumar about political parties programs in Pragati Bhawan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా రాజకీయపార్టీల నేతలు యథేచ్ఛగా ఎన్నికల ప్రవర్తనానియమావళిని ఉల్లంఘిస్తుండటంపట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) రజత్‌కుమార్‌ నిస్సహాయత వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం నోటీసులను బేఖాతరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా ‘నేనక్కడి(ప్రగతి భవన్‌)కి వెళ్లి ఆపలేను కదా!’అని బదులిచ్చారు. శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోడ్‌ ఉల్లంఘిస్తే ప్రజాప్రాతినిధ్యచట్టంతోపాటు సీఆర్‌పీసీ, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు పెడుతున్నామని చెప్పారు. పదేపదే హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా కొందరు నేతలు కుల, మత, భాష, ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలసభలు నిర్వహిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల, మత, ప్రాంత, భాషలవారీగా ఓట్లను అభ్యర్థించినట్లు ఎవరైనా న్యాయస్థానంలో ఆధారాలతోసహా ఎలక్షన్‌ పిటిషన్‌ వేసి రుజువు చేస్తే సదరు అభ్యర్థులు ఎన్నికైన తర్వాత పదవులు కోల్పోకతప్పదని పేర్కొన్నారు.

ఈసీ హెచ్చరికలను పట్టించుకోకుండా యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేతలపై నిషేధం విధించే అధికారం ఎన్నికల సంఘానికి లేదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనానియమావళి ఉల్లంఘనలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల నుంచి వివరణతోపాటు స్థానిక జిల్లా ఎన్నికల అధికారుల నుంచి విచారణ నివేదికలు తెప్పించుకుంటున్నామని చెప్పారు. తీవ్ర ఆరోపణలకు సంబంధించిన కేసులను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తున్నామన్నారు. వ్యక్తిగత దూషణలకు సంబంధించిన ఫిర్యాదులపై మంత్రి హరీశ్‌రావు, నేతలు రేవంత్‌రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలకు నోటీసులు జారీచేశామని, తమపై వచ్చిన ఆరోపణలను వారంతా నిరాకరించారని పేర్కొన్నారు.

వైఎంసీఏ కార్యక్రమంలో పాల్గొనడాన్ని సమర్థించుకున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిపై గోపాలపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశామన్నారు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిపై దాడి విషయంలో మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై, ఎంఐఎం నేతల ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ వి.హన్మంతరావుపై కేసులు నమోదయ్యాయన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించిన మరో 10 ఫిర్యాదులు తమ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. ఫిర్యాదులపై విచారణ జరపడానికి సరిపడా సిబ్బంది ఎన్నికల సంఘం వద్ద లేరన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్నికల ఏర్పాట్లలో తీరిక లేకుండా ఉండటంతో ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరపడం సాధ్యం కావడంలేదన్నారు.  

రెండోరోజూ నామినేషన్ల పరిశీలన 
రాష్ట్రంలోని 119 శాసనసభ స్థానాలకు మొత్తం 3,583 నామినేషన్లు వచ్చాయని, ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకారం మంగళవారం ఒక్కరోజులో నామినేషన్ల పరిశీలన పూర్తి చేయడం సాధ్యంకాదని రజత్‌కుమార్‌ తెలిపారు. నామినేషన్ల పరిశీలనను బుధవారం పూర్తి చేసి అభ్యర్థుల జాబితాలను ప్రకటిస్తామన్నారు. 22న నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులెవరో తెలుస్తుందని పేర్కొ న్నారు. 23 నుంచి బ్యాలెట్‌ పేపర్ల ముద్రణ ప్రారంభిస్తామని ఆయన అన్నారు.  

పోలింగ్‌ సిబ్బంది కొరత: ఎన్నికల నిర్వహణకు సిబ్బంది కొరత ఉందని రజత్‌కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవడానికి అనుమతి కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామన్నారు. 1,60,509 మంది పోలింగ్‌ సిబ్బంది అవసరమని, అదనంగా 20 శాతం మంది సిబ్బందిని రిజర్వుగా పెట్టాల్సి ఉంటుందన్నారు. ప్రధానంగా మేడ్చల్, మల్కాజ్‌గిరి జిల్లాల్లో కొరత బాగా ఉందని, ఈ ప్రాంతాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు అనుమతి కోరుతున్నామన్నారు. 30 వేల మంది రాష్ట్ర పోలీసు సిబ్బందితోపాటు పొరుగు రాష్ట్రాల నుంచి మరో 18 వేల మంది పోలీసులు ఎన్నికల బందోబస్తుకు వస్తున్నారని తెలిపారు. 279 కంపెనీల కేంద్ర బలగాలు వస్తాయన్నారు. 

23 నుంచి ఓటరుస్లిప్పులు 
బూత్‌లెవల్‌ అధికారులు ఈ నెల 23 నుంచి ఇంటింటికీ వెళ్లి ఓటరుస్లిప్పుల పంపిణీని ప్రారంభించి, నెలాఖరులోగా పూర్తి చేస్తారని సీఈవో తెలిపారు. కుటుంబసభ్యులకే ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాల్సి ఉంటుందని, బల్క్‌గా పంపిణీ చేస్తే సంబంధిత బీఎల్‌వోపై కఠిన చర్యలుంటాయని రజత్‌ కుమార్‌ అన్నారు. డూప్లికేట్‌ ఓటరుస్లిప్పులను తయారు చేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. పంపిణీ తర్వాత మిగిలిన ఓటరుస్లిప్పులను పోలింగ్‌ రోజు పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటరుస్లిప్పు ముందుభాగంలో ఓటరు ఫొటో, వివరాలతోపాటు వెనక భాగంలో పోలింగ్‌ కేంద్రానికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను ముద్రిస్తున్నామని చెప్పారు. కొత్త ఓటర్లకు 25 నుంచి నెలాఖరులోగా బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్‌)ల పంపిణీ చేస్తారన్నారు. రూ.25 చెల్లించి మీ–సేవా కేంద్రాల నుంచి ఎపిక్‌ కార్డులు పొందవచ్చని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా కొందరు ఓటర్ల పోలింగ్‌ కేంద్రాలు మారాయని, ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు.  

Advertisement
Advertisement